• facebook
  • whatsapp
  • telegram

ఆఫ్రికాబంధం... బహుళ ప్రయోజనకరం!

 

 

ఆఫ్రికా దేశాలు భవిష్యత్తులో భారత్‌కు వాణిజ్య అవకాశాల గనులుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణరంగ పరికరాల ఎగుమతులకు ఆ దేశాలను గమ్యస్థానాలుగా భావిస్తున్నారు. సమకాలీన భౌగోళిక రాజకీయాల్లో విస్మరించలేని పాత్ర పోషిస్తున్న ఆఫ్రికాతో సత్సంబంధాలు నెరపడంవల్ల అంతర్జాతీయంగా కలిసివచ్చే ప్రయోజనాలెన్నో!

 

ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ, సైనిక సామగ్రి దిగుమతిదారుగా ముద్రపడిన ఇండియా- ఎగుమతుల లక్ష్యాలను నిర్దేశించుకొంటోంది. ఇందులో భాగంగా ఆఫ్రికా, తూర్పు ఆసియా, పశ్చిమాసియా దేశాల సైనిక, భద్రత అవసరాలను వాణిజ్య అవకాశాలుగా మలచుకునే ప్రణాళిక ఇటీవల ఆవిష్కృతమైంది. 2020లో తొలిసారి లఖ్‌నవూలో నిర్వహించిన ఇండియా-ఆఫ్రికా రక్షణ చర్చ (ఐఏడీడీ)లకు కొనసాగింపుగా- గాంధీనగర్‌ డిక్లరేషన్‌ పేరిట సంయుక్త ప్రకటన వెలువడింది. గుజరాత్‌ రాజధాని గాంధీనగర్‌ వేదికగా అక్టోబర్‌ 18 నుంచి 22 వరకు నిర్వహించిన 12వ రక్షణ ప్రదర్శన (డిఫెన్స్‌ ఎక్స్‌పో) స్వశక్తీకరణ దిశగా భారత దృఢసంకల్పాన్ని చాటింది. రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలకు దేశీయంగా అవకాశాలు వెల్లువెత్తనున్నట్లు సంకేతాలిచ్చింది. 50 దేశాల ప్రతినిధులు, 20 మంది రక్షణ మంత్రులు, ఏడుగురు ముఖ్య భద్రతాధికారులు, ఎనమండుగురు శాశ్వత కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సహాయమంత్రి అజయ్‌భట్‌తో ఉన్నతస్థాయి ప్రతినిధులు సమావేశమై పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు.

 

వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యం

హిందూ మహాసముద్ర వాతావరణాన్ని పరిరక్షించడంలో సుదీర్ఘ తీరరేఖ గల తూర్పు ఆఫ్రికా దేశాలదే కీలక భూమిక. ఈ దేశాలతో వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించుకోవాలని ఇండియా అభిలషిస్తోంది. ఇప్పటికే సాగర్‌ (సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ది రీజియన్‌) పేరిట ఆఫ్రికాఖండ వ్యాప్తంగా పలు ప్రగతికాముక ప్రాజెక్టులను నిర్మిస్తోంది. 2008 నుంచి జరిగిన ఇండో-ఆఫ్రికన్‌ సదస్సుల స్ఫూర్తితో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి భిన్నరంగాలకు విస్తరించింది. కొంతకాలంగా ఆఫ్రికా దేశాల్లో దిల్లీ నాయకత్వం 197 ప్రాజెక్టులు సాకారం చేయగా, మరో 65 పురోగతిలో ఉన్నాయి. గాంబియాలో జాతీయ అసెంబ్లీ నిర్మాణం, నమీబియా, మారిషస్‌లలో హైడ్రోపవర్‌ ప్లాంట్లు, ఆహార పరిశ్రమలు, వ్యవసాయ, ఉద్యాన పంటల పరిశోధనల ప్రాజెక్టుల్లో భారత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌, ఆఫ్రికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ కరోనా కాలమైన 2020-21లో 5600 కోట్ల డాలర్లు. అది ఈ ఏడాది సుమారు 8600 కోట్ల డాలర్లకు పెరిగింది. రక్షణరంగ ఎగుమతుల్లో ఎనిమిదేళ్లుగా భారత్‌ గణనీయ వృద్ధి సాధించినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నివేదిస్తున్నాయి. 2015-16లో మన ఆయుధ సామగ్రి ఎగుమతులు రూ.1,522 కోట్లు. 2021-22 నాటికి రూ.13వేల కోట్లకు చేరాయి. 2025 నాటికి రూ.40వేల కోట్లకు పెంచుకోవాలని రక్షణశాఖ-దేశీయ సాయుధ సామగ్రి తయారీదారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్‌ సాయుధ స్వావలంబన సాధించడంతోపాటు ప్రధాన ఎగుమతిదారుగా నిలబడాలంటే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు అవసరం.

 

అక్కడా చైనాతోనే పోటీ

ఆఫ్రికాలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశాల జాబితాలో చైనాది అగ్రస్థానం. భారత్‌ తొలి అయిదు స్థానాల్లో ఉంది. పక్కా వ్యాపార ధోరణిని ప్రదర్శించే చైనాను ఎదుర్కోవడానికి భారత్‌ భిన్నమైన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంది. ఐరాస శాంతి స్థాపన కార్యక్రమంలో దిల్లీ ప్రధాన భాగస్వామిగా నిలిచింది. విపత్తులు సంభవించినా, మహమ్మారులు ప్రబలినా మానవతా సహాయం కింద భారత బృందాలు రంగంలోకి దిగిన ఉదంతాలు కోకొల్లలు. ఆ సౌహార్దం పట్ల కృతజ్ఞతాభావంతోనే ఆఫ్రికా దేశాలు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఐఏడీడీ చర్చల్లోనూ ఆఫ్రికా ప్రతినిధులు ఈ మేరకు ప్రకటన చేశారు. ఇప్పటికీ లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, చైనా మినహా ఆసియా దేశాలకు మండలిలో ప్రాతినిధ్యం లేదు. ఆయా దేశాల పేదరికం, వెనకబాటుతనం, ప్రజారోగ్యం, విపత్తులు, అంతర్యుద్ధాలు వంటి అంశాలే ఐరాసలో ప్రధానంగా చర్చకు వస్తుంటాయి. ప్రజాస్వామ్యం, అధిక జనాభా, భౌగోళిక విస్తీర్ణం, మతం, భాష, సంస్కృతుల వైవిధ్యం, చారిత్రక నేపథ్యం దృష్ట్యా- ఇండియాకు మండలిలో ఎప్పుడో చోటు దక్కాల్సింది. అందుకు తన వీటో అధికారంతో అడ్డుపుల్ల వేస్తున్నది చైనాయే. భారత్‌తో పాటు ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, నైజీరియాలు భద్రతామండలిలో ప్రాతినిధ్యానికి ప్రయత్నిస్తున్నాయి. ఆయుధ సరఫరాలోనే కాదు, పరస్పర మద్దతుతో ఐరాస అత్యున్నత నిర్ణయాత్మక మండలిలో చోటు దక్కించుకోగలిగితే వసుధైక కుటుంబ భావనకు భారత్‌, ఆఫ్రికాలు ఆలంబనగా నిలుస్తాయి!

 

- బోండ్ల అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చమురు ధరల పోటుతో భారత్‌కు తీరని చేటు

‣ స్కూలు నుంచే సైన్యంలోకి!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

‣ విద్యకు విదేశీ సొబగులు

‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

Posted Date: 04-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం