• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

 

 

ద్రవ్యోల్బణం ప్రపంచానికి పెను సమస్యగా పరిణమిస్తోంది. దానివల్ల ప్రజల కొనుగోలు శక్తి తెగ్గోసుకుపోతోంది. దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

 

ఒకప్పుడు ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల గురించి విద్యావంతులే ఎక్కువగా మాట్లాడేవారు. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) వచ్చిన తరవాత పాలు, పెరుగు, తాగునీటి సీసాల ధరలు సైతం పెరిగిపోవడంతో నిరక్షరాస్యుల నోటా ఇప్పుడు ద్రవ్యోల్బణమనే పదం ఆడుతోంది. ద్రవ్యోల్బణం దేశార్థికాన్ని, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల దాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు అత్యధిక ప్రాధాన్యమిస్తాయి. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ తమ దేశంలో ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి పరిమితం చేయాలని లక్షిస్తోంది. తదనుగుణంగా వడ్డీరేట్లు, ద్రవ్య లభ్యతలో మార్పుచేర్పులు చేస్తోంది. పౌరుల జీవన స్థితిగతులు దెబ్బతినకుండా చూడటం కోసమే ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వినియోగ ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని గణిస్తూ అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.

 

భారీగా పెరుగుదల

వస్తువులకు గిరాకీ పెరిగి, సరఫరా తగ్గినప్పుడు ధరలు ఎగబాకుతాయి. మార్కెట్లో ద్రవ్య లభ్యత అధికంగా ఉన్నా కొనుగోలు విలువ పడిపోయి ధరలు పెరుగుతాయి. ధరలు అదేపనిగా పడిపోతూ ఉంటే ప్రతిద్రవ్యోల్బణం లేదా డిఫ్లేషన్‌ అంటారు. కరెన్సీ మారక విలువ పడిపోయినప్పుడూ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్లనే 2014-22 మధ్యకాలంలో ద్రవ్యోల్బణం హెచ్చుతూ వచ్చింది. దానికి భిన్నంగా డాలర్‌ విలువ చుక్కలను తాకుతున్నా అమెరికాలోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. భారత్‌లో అధికమవుతున్న ద్రవ్యోల్బణం భవిష్యత్తును అనిశ్చితం చేస్తోంది. పోనుపోను ధరలు ఎలా ఉంటాయో తెలియనప్పుడు ఉత్పత్తి చేసే వస్తువులకు ధరలు నిర్ణయించడంలో కంపెనీలు ఇబ్బంది పడతాయి. ఉత్పత్తిని పెంచాలా తగ్గించాలా అన్నది తేల్చుకోలేకపోతాయి. ద్రవ్యోల్బణం మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని అందరూ ఆందోళన చెందుతారు. జనాభా పెరుగుదల, ప్రభుత్వాల లోటు బడ్జెట్లు, విరివిగా రుణాల లభ్యత, ఎగుమతుల్లో వృద్ధి, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం... ఇవన్నీ ద్రవ్యోల్బణానికి కారణాలే. ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు, ముడి సరకులు, ఇతర ఉత్పత్తి సాధనాలకు కొరత ఏర్పడినప్పుడు, నల్ల బజారు వర్తకం, అక్రమ నిల్వలు పెరిగిపోయినప్పుడు, కొవిడ్‌ సమయంలో మాదిరిగా జనం పెద్దమొత్తంలో వస్తువులను కొని నిల్వచేసుకున్నప్పుడు సరకుల కొరత ఏర్పడి వాటి ధరలు పెరుగుతాయి. భారత్‌లో ద్రవ్యోల్బణం 1957-58లో మూడు శాతం, 1960-61లో ఏడు శాతంగా ఉంది. 1962, 1965ల్లో చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాల కారణంగా ధరలు పెరిగాయి. 1965-66లో పంటల వైఫల్యమూ ద్రవ్యోల్బణాన్ని అధికం చేసింది. దానికి తోడు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) సైతం చమురు ధరలను పెంచింది. 1970ల్లో ఇండియాలో ద్రవ్యోల్బణం 33.3శాతం దాకా పెరిగింది. స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరగని రేటు అది. 1980ల్లో ద్రవ్యోల్బణం 7.2శాతం దగ్గర నిలకడగా ఉన్నా 1990-91లో మళ్ళీ రెండంకెలకు (10.1శాతానికి) చేరింది. 1992-93లో ఆర్థిక సంస్కరణల వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 37శాతం పడిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణం హెచ్చినా 2000-01 నాటికి బాగా తగ్గింది. అయితే, ధరల పెరుగుదల పెట్టుబడుల వృద్ధికి తోడ్పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మూడు శాతం వడ్డీకి బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్‌ చేశాడనుకోండి. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఎనిమిది శాతం ఉంటే, అతడు తన డిపాజిట్‌ అసలు విలువను కోల్పోతున్నాడని అర్థం. అదే మొత్తాన్ని స్థిరాస్తులు, షేర్లలో పెట్టుబడి పెడితే బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ సంపాదించగలుగుతాడు. సామాన్యులకు ఈ విషయంలో సరైన అవగాహన ఉండదు. సాధారణంగా ద్రవ్యోల్బణం కన్నా స్థిరాస్తి ధరలు ఎక్కువగా పెరుగుతాయి. 1980లో ఒక ఇల్లు కొనడానికి రూ.10 లక్షలు వెచ్చిస్తే సరిపోయేది. అదే ఇల్లు 2022 సంవత్సర ధరల్లో కోటిన్నర రూపాయల దాకా అవుతుంది. అదే ఇంటి ధర రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుంది. ఇదంతా ద్రవ్యోల్బణ మహిమ.

 

రుణదాతలకు నష్టం

పెద్ద మొత్తాల్లో అప్పులు తీసుకున్నవారు అధిక ద్రవ్యోల్బణం వల్ల లబ్ధి పొందుతారు. వారు అప్పును తిరిగి చెల్లించేటప్పుడు కట్టే నగదు తన వాస్తవిక విలువను కోల్పోయి ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణమనేది పొదుపు చేసేవారికి, రుణాలిచ్చేవారికి నష్టదాయకం. అప్పులు తీసుకుని తిరిగి చెల్లించేవారికి లాభదాయకం. ముఖ్యంగా దీర్ఘకాలానికి స్థిర వడ్డీపై, అదీ తక్కువ రేటుకు పెద్దమొత్తాలు అప్పు తీసుకున్నవారికి మరీ లాభం. స్థిరాస్తుల యజమానులు సైతం లబ్ధి పొందుతారు. వారు అద్దెల రూపంలో ఎక్కువ ఆదాయం కళ్లజూడగలుగుతారు. అధిక ద్రవ్యోల్బణ వాతావరణంలో షేర్‌ మార్కెట్‌ లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులతోపాటు బంగారం సైతం ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పిస్తుంది.

 

- శ్రీరామ్‌ చేకూరి 

(ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐరోపాను బెంబేలెత్తిస్తున్న జీవనవ్యయం

‣ ‘పునరుత్పాదక’ లక్ష్యాలు... సుదూరం!

‣ మాటల్లోనే... సమానత్వం

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

Posted Date: 31-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం