• facebook
  • whatsapp
  • telegram

సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

ఐక్యరాజ్యసమితి దినోత్సవం. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పాటైన సమితి- ఆ ఆశయాన్ని నెరవేర్చడంలో విఫలమవుతోంది. భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల వీటో అధికారం వల్ల ప్రపంచ భద్రతకు విఘాతం కలుగుతోంది. దీన్ని నివారించాలంటే ఐరాస సమూల ప్రక్షాళన కీలకమని పలు దేశాలు గళమెత్తుతున్నాయి.

రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఐరోపాపై జర్మనీ దాడిని నిరసిస్తూ అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌, బ్రిటన్‌ ప్రధాని చర్చిల్‌ సంయుక్తంగా 1941లో అట్లాంటిక్‌ ఛార్టర్‌ను ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) స్థాపనలో దీన్ని మొదటి అడుగుగా చెబుతారు. 1945 జూన్‌ 26న 50 దేశాల ప్రతినిధులు అగ్రరాజ్యంలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఐరాస ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్‌ 24న న్యూయార్క్‌లో ఐరాస ప్రారంభమైంది. అంతర్జాతీయ శాంతి, యుద్ధ నివారణ వంటి సిద్ధాంతాలతో ఈ సంస్థ ఆవిర్భవించింది. 77 ఏళ్ల ప్రస్థానంలో ఆ లక్ష్యాలను ఐరాస ఎంతమేరకు చేరుకొంది అంటే... సమాధానం ప్రశ్నార్థకమే. మారుతున్న కాలమాన పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య తలెత్తుతున్న నూతన స్పర్థల నేపథ్యంలో ఐరాసలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని పలు దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ శాంతిభద్రతల రక్షణ బాధ్యత వహించే ఐరాస ప్రధానాంగమైన భద్రతామండలి విస్తరణ నేడు తప్పనిసరి అవసరం.

అయిదు దేశాలదే హవా

ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 సభ్యదేశాలు ఉన్నాయి. భద్రతామండలిలో అయిదు శాశ్వత సభ్యదేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. రెండో ప్రపంచయుద్ధ విజేతలైన అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, రష్యా, ఫ్రాన్స్‌లతో పాటు చైనా సైతం భద్రతామండలిలో వీటో అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారాన్ని వినియోగించుకొని ఆ అయిదు దేశాలు ఐక్యరాజ్య సమితి రూపొందించిన బిల్లు లేదా తీర్మానాన్ని చెల్లకుండా చేయవచ్చు. సైనిక బలగాలను పంపడానికి, వివిధ దేశాలపై ఆంక్షలు విధించడానికీ వీటో అధికారం ఉపయోగపడుతుంది. ప్రపంచ శాంతిభద్రతలను పరిరక్షించడం భద్రతామండలి ప్రాథమిక విధి. వీటో అధికారం వల్ల ప్రపంచశాంతి, భద్రత అన్నవి శాశ్వత సభ్య దేశాల స్వార్థ ప్రయోజనాల పంజరంలో బందీ అయ్యాయనేది కాదనలేని వాస్తవం. భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశాలను రెండేళ్లకు ఒకసారి ఎన్నుకొంటారు. వాటికి వీటో హక్కు ఉండదు. వాటి నిర్ణయాలకు సరైన ప్రాధాన్యమూ దక్కదు. మొత్తం భూభాగంలో ఐరోపా ఖండం వాటా కేవలం 6.6శాతం. కానీ, భద్రతామండలిలో ఐరోపా ప్రాధాన్యం 60శాతంగా ఉంది. ప్రపంచ భూభాగంలో వరసగా 20శాతం, 12శాతం వాటాలు కలిగి ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఏ ఒక్క దేశానికీ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా లేదు. ప్రపంచ జనాభాలో 60శాతాన్ని కలిగి ఉన్న ఆసియాకు సైతం భద్రతా మండలిలో సరైన ప్రాధాన్యం దక్కడంలేదు.

ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పలు సంక్షోభాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి ఐరాస పలు ఆదేశాలు ఇచ్చింది. వాటి అమలు కోసం భద్రతా మండలి సకాలంలో సరైన చర్యలు తీసుకోవడంలో అనేక సందర్భాల్లో విఫలమైంది. వీటో అధికారం కలిగిన దేశాలు తమ సొంత ప్రయోజనాల అజెండాలను ప్రపంచంపై రుద్దడానికి ఐరాసను వినియోగించుకొంటున్నాయి. గతంలో జరిగిన అనేక సంఘటనలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సోవియట్‌ యూనియన్‌/రష్యా అత్యధికంగా వీటో అధికారాన్ని వినియోగించుకొంది. తరవాతి స్థానంలో అమెరికా నిలుస్తోంది. రెండు దశాబ్దాలుగా చైనా సైతం అధికంగా వీటోను వినియోగిస్తోంది. తమ అవసరాలను అనుగుణంగా ఫ్రాన్స్‌, యూకేలు కూడా ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. అయిదు శాశ్వత సభ్య దేశాల వీటో అధికార దుర్వినియోగం అందరి గళంగా ఉండాల్సిన ఐరాసను కొందరి వాణిగా మార్చేస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ పౌర సమాజంపై రష్యా కురిపిస్తున్న బాంబుల వర్షాన్ని ప్రపంచం దిగ్భ్రాంతికి గురై వీక్షిస్తోంది. ఉక్రెయిన్‌లో పలు భూభాగాలను క్రెమ్లిన్‌ తనవిగా చెప్పడాన్ని ఖండిస్తూ అమెరికా, అల్బేనియా భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. ఐరాస అనుమతి లేకుండానే 2003లో అమెరికా ఇరాక్‌పై దాడి చేసి సద్దాం హుస్సేన్‌ను పాలన నుంచి తొలగించింది. 2011లో అగ్రరాజ్యం, బ్రిటన్‌లు లిబియాపై వైమానిక దాడులు జరిపి గడాఫీని పదవి నుంచి దించివేశాయి. అమెరికా పూర్తి మద్దతు ఉండటం వల్లనే పాలస్తీనా భూభాగాలపై సాగుతున్న ఇజ్రాయెల్‌ దాడులను భద్రతామండలి ఏనాడూ అడ్డుకోలేదు.

సంస్కరణలు కీలకం

అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనందించడంలో ముందుండే జపాన్‌కు, ప్రపంచశాంతిని సర్వదా కాంక్షించే భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని పలు దేశాలు కోరుతున్నాయి. దక్షిణాఫ్రికా, నైజీరియా, బ్రెజిల్‌ వంటి దేశాలూ ఎన్నో ఏళ్ల నుంచి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నాయి. శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌, జపాన్‌, జర్మనీల ఆకాంక్షలకు అగ్రరాజ్యం పలుమార్లు మద్దతు తెలిపింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌, రష్యా, ఫ్రాన్స్‌లు సైతం భారత్‌కు అనుకూలంగా ఉన్న సందర్భాలు అనేకం. చైనా మాత్రం ఇండియాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య 11కు, తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను 26కు పెంచాలనే డిమాండు చాలా రోజులుగా వినిపిస్తోంది. మొత్తం వీటో అధికారాన్నే తొలగించాలని మరికొన్ని దేశాలు కోరుతున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ స్పర్థలు అధికమవుతున్నాయి. వాటిని సమర్థంగా నివారించాలంటే ప్రపంచ జనాభాలో అత్యధికుల అభిప్రాయాలకు ఐరాసలో మన్నన దక్కాల్సిందే. లేకుంటే ప్రజాస్వామ్యం, ప్రపంచశాంతి, సమాన హక్కుల గురించి ఐరాస చెప్పే మాటలకు విలువ ఏముంటుంది? అందుకే ఐక్యరాజ్య సమితి ముసాయిదా, భద్రతామండలి సంస్కరణ నేడు అత్యావశ్యకం.

పరిమితులకు దర్పణం

భారత సరిహద్దుల్లోని పలు ప్రాంతాలను చైనా ఆక్రమించినప్పుడు ఐక్యరాజ్య సమితి మౌనం వహించింది. అఫ్గాన్‌ పరిణామాలు, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌పై చర్యల లేమి భద్రతామండలి పరిమితులను తెలియజేస్తున్నాయి. వీటో అధికారం కలిగిన దేశాలు తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం వివిధ సందర్భాల్లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న దేశాలకు బేషరతుగా తమ మద్దతును అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త మద్దతు ఉన్నప్పటికీ రోహింగ్యాల సమస్యను పరిష్కరించడంలో భద్రతామండలి వైఫల్యానికి చైనా, రష్యాలు మయన్మార్‌కు మద్దతునివ్వడమే కారణంగా కనిపిస్తుంది. రోహింగ్యాల సమస్య వల్ల మయన్మార్‌కు సరిహద్దున ఉన్న బంగ్లాదేశ్‌, భారత్‌ వంటివి ఇబ్బంది పడుతున్నాయి.

- గొడవర్తి శ్రీనివాసు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భాజపా - కాంగ్రెస్‌... మధ్యలో ఆప్‌!

‣ అమెరికా - చైనా చిప్‌ యుద్ధం

‣ కష్టాల సేద్యంలో కర్షకులు

‣ పోటెత్తుతున్న వరదలు

Posted Date: 31-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం