• facebook
  • whatsapp
  • telegram

పోటెత్తుతున్న వరదలు

 

 

వాతావరణ మార్పులతో దేశీయంగా కుండపోత వానలు, వరదల ముప్పు పెరిగింది. ఫలితంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఇటీవల బెంగళూరును, తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాలను భీకర వరదలు ముంచెత్తాయి. జల విలయం నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగడం అత్యావశ్యకం.

 

రాబోయే రోజుల్లో కుండపోత వానలు సాధారణంగా మారతాయని, తద్వారా వరదల ముప్పు పెరుగుతుందని వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్జాతీయ సంఘం (ఐపీసీసీ) తేల్చి చెప్పింది. పర్యావరణ మార్పులే దీనికి కారణమని ఆ సంఘం కుండ బద్దలుకొట్టింది. భారీ వర్షాల వల్ల తలెత్తుతున్న ఆకస్మిక వరదలు ఇటీవలి కాలంలో తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కబళిస్తున్నాయి. 1953-2018 మధ్య కాలంలో తీవ్రమైన వర్షాలు, వరదల వల్ల దేశీయంగా నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. అందులో యాభై శాతం ఆర్థిక నష్టాన్ని చివరి పదేళ్లలోనే ఇండియా చవిచూసింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) అధ్యయనం ఇటీవల లెక్క తేల్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్దేశం మేరకు ఈ సంస్థ అధ్యయనం జరిపింది.

 

సమష్టి వ్యవస్థ

భారత్‌లో వరదల వల్ల 1953-2018 మధ్య కాలంలో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇటీవల వెల్లడించింది. 61 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయి. పెద్దమొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. ఇంత విధ్వంసానికి కారణమవుతున్న వరదల కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని జల వనరులపై పార్లమెంటరీ స్థాయీ సంఘం గతంలో సూచించింది. అందుకోసం జాతీయ సమీకృత వరద నిర్వహణ బృందాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిరుడు సిఫార్సు చేసింది. ప్రతి రాష్ట్రంలో సంబంధిత మంత్రులు అందులో సభ్యులుగా ఉండాలని, ఏటా కనీసం ఒక సమావేశం నిర్వహించాలని చెప్పింది. వరద నష్టాన్ని అధికంగా చవిచూస్తున్న అన్ని రాష్ట్రాలు, పొరుగు దేశాలతో కలిసి సమీకృత నదీ పరీవాహక ప్రాంత నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని సూచించింది. దానిపై ఎలాంటి ముందడుగూ పడలేదు. ప్రస్తుతం ఎన్‌ఐడీఎం సైతం అలాంటి ప్రతిపాదనే చేసింది. సమగ్ర వరద నిర్వహణ కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలో సమీకృత రిజర్వాయర్లు, ఆనకట్టలు, నదీ పరీవాహక ప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. నదులు, ఉపనదుల్లో వరద నియంత్రణ, నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి సరఫరా నిర్వహణ, విద్యుత్తు ఉత్తత్తి, ప్రసరణ, పంపిణీ వంటి వాటిని ఆ సంస్థ పర్యవేక్షించాలని ఎన్‌ఐడీఎం తెలిపింది. నేల పరిరక్షణ, జల వనరుల సమగ్ర అభివృద్ధికి ఆ సంస్థ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. జల వనరులపై గుత్తాధిపత్యానికి కేంద్రం ప్రయత్నిస్తోందని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. దానిపై తరచూ వివాదాలు సైతం నెలకొంటున్నాయి. ఈ తరుణంలో పార్లమెంటరీ స్థాయీసంఘం లేదా ఎన్‌ఐడీఎం సిఫార్సులు అమలు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్య మార్గంలో ఏక తాటిపైకి రావాలి. వరదల నష్టం కట్టలు తెంచుకొంటున్న తరుణంలో ఈ చర్య అత్యావశ్యకం. దేశీయంగా నిత్యం వరదలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి సరైన చర్యలు తీసుకొనేందుకు జాతీయ వరద మైదాన జోనింగ్‌కు సంబంధించి నమూనా బిల్లును కేంద్రం రూపొందించి రాష్ట్రాలకు పంపించింది. చాలా రాష్ట్రాలు దాన్ని అమలులోకి తేలేదు.

 

పటిష్ఠ చర్యలు కీలకం

వరదల నష్టాన్ని నివారించాలంటే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందుగా స్థానిక, ప్రాంతీయ స్థాయిలో వరదలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించాలి. ఎక్కడికక్కడ ఆనకట్టలు, కల్వర్టులను నిర్మించాలి. వరద నీరు వేగంగా వెళ్ళిపోయేలా కాలువలు, వరద మళ్ళింపు మార్గాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలి. వాటిలో ఎప్పటికప్పుడు పూడిక తీయడం తప్పనిసరి. ఇటీవలి కాలంలో పట్టణాలు, నగరాల్లో ఆకస్మిక వరద ముప్పు అధికమైంది. దాన్ని నివారించాలంటే డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి. పట్టణ ప్రణాళికలు సక్రమంగా అమలయ్యేలా చూడటం తప్పనిసరి. వరదలపై వేగంగా సమాచారం అందించేందుకు ఆధునిక సాంకేతిక, సమాచార వ్యవస్థనూ వినియోగించుకోవాలి. నదీ పరీవాహంలో పెద్ద మొత్తంలో అడవులను పెంచితే వాన నీటిని అవి పట్టి ఉంచుతాయి. తద్వారా అధిక మొత్తంలో నీరు నదుల్లోకి చేరి వరదలు ముంచెత్తకుండా నివారించవచ్చు. కుంభవృష్టుల ముప్పు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఆనకట్టల భద్రతనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఆనకట్టల భద్రత చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలి. వరదల విధ్వంసాన్ని తగ్గించాలంటే ముందుగా వాతావరణ మార్పులను నిలువరించాలి. అందుకోసం కర్బన ఉద్గారాల కట్టడి లక్ష్యాలను ప్రపంచ దేశాలు తప్పనిసరిగా అందుకోవాలి.

 

- ఎం.అక్షర
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉత్తరకొరియా దూకుడు

‣ సంక్షోభం నేర్పిన పాఠాలకు నోబెల్‌

‣ హిమ సీమలో ఎన్నికల వేడి

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

Posted Date: 22-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం