• facebook
  • whatsapp
  • telegram

సంక్షోభం నేర్పిన పాఠాలకు నోబెల్‌

ఈసారి ఆర్థిక శాస్త్ర నోబెల్‌ బహుమతిని రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌- బెన్‌ ఎస్‌. బెర్నాన్కి, డగ్లస్‌ డబ్ల్యూ. డైమండ్‌, ఫిలిప్‌ హెచ్‌. డిబ్విగ్‌లకు ప్రకటించింది. బ్యాంకులు-ఆర్థిక సంక్షోభాలు అనే అంశంపై చేసిన పరిశోధనలు, వాటి అన్వయానికిగాను వీరిని నోబెల్‌ వరించింది. బెర్నాన్కి 2006 నుంచి 2014 వరకు అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. డగ్లస్‌ డైమండ్‌ షికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. ఫిలిప్‌ డిబ్విగ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర ఆచార్యుడు. ఈ ముగ్గురూ 1983 నుంచి చేస్తున్న పరిశోధనలకు ప్రతిఫలమే నోబెల్‌.

బ్యాంకుల పాత్ర

సాధారణంగా ఆర్థిక నోబెల్‌ను ఆ రంగంపై అవగాహనను మరింతగా పెంచే ఆర్థిక వేత్తలకు ప్రదానం చేస్తారు. బెర్నాన్కి వంటి విధానకర్తను నోబెల్‌ వరించడం ఇదే ప్రథమం. 1929నాటి ఆర్థిక మహామాంద్యం బ్యాంకింగ్‌ రంగంమీద చూపిన ప్రభావంపై బెర్నాన్కి డాక్టరేట్‌ చేశారు. ఆర్థిక రంగంలో బ్యాంకుల కీలక పాత్రను బెర్నాన్కి, డైమండ్‌, డిబ్విగ్‌ల పరిశోధనలు తేటతెల్లం చేశాయి. వారి పరిశోధనా పత్రాలు వెలువడక ముందు ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎలా తోడ్పడతాయన్న అంశం మీద పూర్తి అవగాహన ఉండేది కాదు. ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచమంతటా కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య జరిగే కోట్లాది లావాదేవీల సమాహారం. వీరిద్దరి మధ్య చేతులు మారే వస్తుసేవలకు నగదు లేక రుణ రూపేణా లేదా ఉభయులకూ అంగీకారయోగ్యమైన మరేదైనా పద్ధతిలో చెల్లింపులు, జమలు జరుపుతారు. ఆర్థిక వ్యవస్థలు విస్తరించే కొద్దీ ఈ లావాదేవీలు, వాటికి వేదికలుగా ఉపయోగపడే సంస్థలూ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. ఆర్థికాభివృద్ధి పుంజుకొంటున్న కొద్దీ రుణాల అవసరమూ పెరిగిపోతుంది. ఒకప్పుడు రుణ వితరణకు వడ్డీ వ్యాపారులు పోషించిన పాత్రను నేడు బ్యాంకులు చేపట్టాయి. డిపాజిటర్లకు, రుణగ్రహీతలకు మధ్య బ్యాంకులు మధ్యవర్తులుగా పనిచేస్తాయి. పొదుపు మొత్తాలను ఇతరులకు రుణాలిచ్చేటప్పుడు నష్ట ప్రమాదాన్ని తమ భుజాలపై వేసుకుంటాయి. దీనికోసం డిపాజిటర్లకు తామిచ్చే వడ్డీకన్నా కొంత ఎక్కువ వడ్డీని రుణగ్రహీతల నుంచి తీసుకుంటాయి. డిపాజిటర్లు తమ పొదుపు మొత్తాల భద్రతకు, ఆ సొమ్మును ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. రుణ గ్రహీతలు దీర్ఘకాల రుణాలు కావాలని, వాటిపై వడ్డీ కట్టడం, రుణాన్ని తీర్చడం వంటి అంశాల్లో స్పష్టమైన షరతులు, నిబంధనలు ఉండాలని కోరుకుంటారు. నిర్దిష్ట కాలపరిమితికి ముందే రుణాన్ని తీర్చాలంటూ ఒత్తిడి చేయకూడదని ఆశిస్తారు. ఒకవేళ ముందే తీర్చాలంటే ఆ అంశాన్ని రుణం తీసుకునేటప్పుడే లిఖితపూర్వకంగా నమోదు చేయాలంటారు. మధ్యవర్తి పాత్రలోని బ్యాంకులు స్వల్పకాలానికి డిపాజిట్లు తీసుకుని దీర్ఘకాలానికి రుణాలిస్తాయి. బ్యాంకుల బ్యాలన్స్‌ షీట్లలో అవి ఇచ్చిన రుణాలను ఆస్తులుగా, తాము తిరిగి చెల్లించాల్సిన డిపాజిట్లను అప్పులుగా చూపుతాయి. డిపాజిట్‌ దారులంతా మూకుమ్మడిగా ఒకేసారి తమ డబ్బును బ్యాంకుల నుంచి వాపసు తీసుకోరు కాబట్టి బ్యాంకులు వారి డబ్బును రుణాలుగా తిప్పగలుగుతాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో కొన్ని నష్టాలు తెచ్చిపెట్టినా, తగు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు ఆర్జించగలుగుతాయి. అయితే సంక్షోభ సమయాల్లో డిపాజిట్‌ దారులంతా తమ డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు పరుగెత్తుతారు. అందరి డిపాజిట్లను ఒకేసారి తిరిగి చెల్లించలేక బ్యాంకులు కుప్పకూలతాయి. ఇది ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు పాకి మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. 1929 మహా ఆర్థిక మాంద్యంలో జరిగినది ఇదే. నాటి పరిణామాలను ఈ సంవత్సరం ఆర్థిక నోబెల్‌ను గెలుచుకున్న ముగ్గురు మేధావులూ గణిత నమూనాలతో విశ్లేషించి విలువైన పాఠాలను మనకు అందించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు కీలకమని నిర్ధారించారు.

బ్యాంకుల ప్రాముఖ్యం అందరికీ తెలిసినట్లే కనిపించినా, నోబెల్‌ గ్రహీతలు గతకాల అనుభవాలను భావి కార్యాచరణకు అనువుగా మలచి అందించారు. 1929 మహా మాంద్యాన్ని పరిశీలించి వారు రంగరించిన పాఠాలు 2008 ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి తోడ్పడ్డాయి. ఆ సమయంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌గా ఉన్న బెన్‌ బెర్నాన్కి చేసినది ఇదే. 1929లో మిన్నంటిన ఆస్తుల ధరలు ద్రవ్య లభ్యతను తగ్గించేశాయి. దాంతో డిపాజిట్‌ దారులు బ్యాంకుల నుంచి సొమ్ము వాపసు తీసుకోవడానికి పోటీపడ్డారు. దీన్ని తట్టుకోలేక బ్యాంకులను కొన్ని రోజులపాటు మూసేయవలసి వచ్చింది. 2008లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా బెర్నాన్కి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ద్రవ్య లభ్యత పెంచి ఆర్థిక ఉత్పాతాన్ని నివారించారు. ఆ అనుభవం కొవిడ్‌ లాక్‌డౌన్ల సమయంలోనూ ఆదుకున్నది.

బాధ్యతారహిత రుణవితరణ

ఏది ఏమైనా సంక్షోభ సమయాల్లో కేంద్ర బ్యాంకులు పెద్దయెత్తున నగదును ప్రవహింపజేయడం- కేంద్ర బ్యాంకుల అప్పుల భారాన్ని, తద్వారా యావత్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. సున్నా వడ్డీకో లేక అత్యల్ప వడ్డీకో రుణాలు ఇవ్వడం రెండువైపులా పదునైన కత్తిలాంటిది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ స్వల్పకాలంలో కుదుటపడినా, దీర్ఘకాలంలో బ్యాంకుల బాధ్యతారహిత రుణ వితరణ వల్ల జరిగిన నష్టాలను ప్రజాధనంతో పూడ్చవలసి వస్తుంది. అంటే నష్టాలు ప్రజల నెత్తిన పడితే, లాభాలు కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థల జేబుల్లో చేరిపోతాయన్నమాట. పైగా కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం ఆదుకొంటాయనే భరోసాతో బ్యాంకులు బాధ్యతారహిత రుణ వితరణను కొనసాగించే ప్రమాదం ఉంటుంది.

పరిశోధన ఫలాలు

ప్రపంచమంతటా కేంద్ర బ్యాంకులు 2008-09లో, తిరిగి 2020లో దివాలాల ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి భారీయెత్తున నగదు సరఫరా పెంచాయి. 1997నాటి ఆగ్నేయాసియా ఆర్థిక సంక్షోభం, 1998లో రుణాలకు రష్యా ఎగనామం, 1998లో లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎల్టీసీఎం) అనే హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ పతనం సంభవించినప్పుడు ఈ పరిశోధన ఫలాలు అందుబాటులో లేవు. అందుకే కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యత పెంచి సంక్షోభాలను అధిగమించలేకపోయాయి. ఎల్టీసీఎంను మళ్లీ పట్టాలెక్కించడానికి 14 భారీ బ్యాంకులు కలసికట్టుగా కృషి చేయాల్సి వచ్చింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హిమ సీమలో ఎన్నికల వేడి

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

‣ పేదరికంపై పోరుబాట

‣ చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు

‣ వెంటాడుతున్న ఆహార అభద్రత

‣ పట్టపగ్గాలు లేని డాలర్‌

Posted Date: 19-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం