• facebook
  • whatsapp
  • telegram

వెంటాడుతున్న ఆహార అభద్రత

 

 

ప్రపంచ ఆహార దినోత్సవం. ఇటీవల భారత్‌ ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశీయంగా భారీగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ, ప్రపంచ ఆహార భద్రతా సూచీలో నిరుడు ఇండియా 113 దేశాల సరసన 71వ స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆకలి సూచీలో 101వ స్థానంతో సరిపెట్టుకొంది. ఆహార ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల మధ్య సమన్వయ లేమి తీవ్ర సమస్యగా మారింది.

 

కూడు, గూడు, వస్త్రం... మనిషి కనీస అవసరాలు. తిండి గింజల లభ్యత, అందుబాటు, వినియోగం అన్నవి ఆహార భద్రతలో ప్రధాన అంశాలుగా నిలుస్తాయి. ఆహార లభ్యత అనేది ఉత్పత్తితో ముడివడి ఉంటుంది. భారత్‌లో 1950-51లో 5.08 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 32 కోట్ల టన్నులకు పైగా ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. ఏడు దశాబ్దాల కాలంలో దేశీయ జనాభా దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగి 35.7 కోట్ల నుంచి 141 కోట్లకు చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తీ ఆరు రెట్లు అధికమైంది. 1960-61లో రోజుకు తలసరి ఆహార ధాన్యాల లభ్యత 469 గ్రాములు. 2020-21 నాటికి అవి 512 గ్రాములకు మాత్రమే పెరిగాయి. దీన్నిబట్టి ఆహార ధాన్యాల లభ్యతలో సరైన మెరుగుదల లేదని అర్థమవుతుంది. భారత ఆహార సంస్థ నిబంధనలను అనుసరించి అక్టోబరు ఒకటి నాటికి దేశీయంగా 3.1 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వ ఉండాలి. ప్రస్తుతం 4.32 కోట్ల టన్నులు గోదాముల్లో అందుబాటులో ఉన్నాయి. అంటే, 1.22 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ వ్యవస్థకు చేరకుండా ఉండిపోయాయి.

 

పెను సవాళ్లు

ప్రజల సంస్కృతి, కట్టుబాట్లు, పోషకాహార జ్ఞానం, ఆహార తయారీ వంటి వాటిపై ఆహార ధాన్యాల వినియోగం ఆధారపడి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి- ఇండియా 2020 నివేదిక ప్రకారం, దేశీయంగా 43 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలను పౌష్టికాహార లేమి పట్టి పీడిస్తోంది. నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ వ్యాఖ్యానించినట్లు ఇండియాలో ఆఫ్రికా దేశాల మాదిరిగా హృదయ విదారకమైన ఆకలి చావులు లేవు. కానీ, అర్ధాకలి పోషకాహార లోపంతో జీవిస్తున్నవారి సంఖ్య ఎక్కువే. ఆహారంలో ధాన్యాలు, ప్రొటీన్‌ శాతం తగ్గడం, నూనె పదార్థాలు, శీతల పానీయాల వినియోగం పెరగడం వంటివి పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పంట కాలానికి పరిమితమై ఉంటుంది. ఏడాదికి రెండు లేదా మూడుసార్లే పంటలు వస్తాయి. వినియోగం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని అధిగమించాలంటే ఆహార ధాన్యాలను నిల్వ ఉంచి అవసరాల మేరకు సరఫరా చేయాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి రాయితీ ధరలపై ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులను సరఫరా చేయాలి. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారికి విపణి ద్వారా సరసమైన ధరలకు సరకులు అందించాలి.

 

ఇటీవలి కాలంలో సేద్య రంగంలో కూలీల కొరత అధికమైంది. ముడిసరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. అసమర్థ మార్కెటింగ్‌ విధానాల వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదు. భూసారం సైతం తగ్గుతోంది. కొత్త రకమైన పురుగులు, తెగుళ్లు పంటలను పట్టి పీడిస్తున్నాయి. మరోవైపు ఆహార ధాన్యాల సేకరణలో తీవ్ర జాప్యం చోటుచేసుకొంటోంది. వాటి పంపిణీ దారి తప్పుతోంది. నకిలీ రేషన్‌కార్డులను, లబ్ధిదారులను తొలగించడంలో అలసత్వం నెలకొంటోంది. వాతావరణ మార్పుల వల్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు పెరుగుతున్నాయి. వాటిని తట్టుకొనేలా వంగడాలను సృష్టించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారుతోంది. కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటివి ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి ఆహార భద్రత సాధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి.

 

పారదర్శకత పాటించాలి

దేశీయంగా ఆహార అభద్రతను ఉత్పత్తి, యాజమాన్యం, సమన్వయం అనే మూడు కోణాల నుంచి ఎదుర్కోవాలి. ఉత్పత్తి పరంగా స్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. ప్రత్యేక వ్యవసాయ జోన్లను ఏర్పాటు చేసి, సమాచార-సాంకేతిక విజ్ఞానంతో వాటిని పర్యవేక్షించాలి. రేషన్‌ కార్డు-ఆధార్‌కార్డులను అనుసంధానించి అసలైన లబ్ధిదారులకే రాయితీ ఆహార ధాన్యాలు అందేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి. నిల్వల విషయంలోనూ పారదర్శకత పాటించాలి. జన్‌ధన్‌ ఖాతా-ఆధార్‌ కార్డు-మొబైల్‌ నంబర్లను అనుసంధానించి లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ జరిగేలా చూడాలి. తద్వారా ఆహార ధాన్యాల రవాణా భారం తగ్గించాలి. పాలకులు పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు సాగితేనే దేశీయంగా ప్రజలకు ఆహార భద్రత సాధ్యమవుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పట్టపగ్గాలు లేని డాలర్‌

‣ తీర ప్రాంతాలపై తుపానుల పడగ

‣ మంగళయాన్‌... సంపూర్ణం!

‣ దిగుబడుల్ని రెట్టింపు చేసే నవ సాంకేతికత

‣ బాలికల శ్రేయస్సే భవితకు మార్గం

Posted Date: 18-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం