• facebook
  • whatsapp
  • telegram

మంగళయాన్‌... సంపూర్ణం!

 

 

ఒక హాలీవుడ్‌ సినిమా తీయడానికయ్యే ఖర్చుకంటే తక్కువ వ్యయంతో పూర్తయిన మంగళయాన్‌ ప్రాజెక్టు ప్రపంచ అంతరిక్ష చరిత్రలోనే ఎన్నో అద్భుతాలు లిఖిస్తుందని ఎనిమిదేళ్ల క్రితం ఎవరూ అనుకోలేదు. 2014 సెప్టెంబరు 24న అంగారక గ్రహం కక్ష్యలోకి అడుగుపెట్టిన మామ్‌(మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌) ఇటీవల భూమితో తన సంబంధాలు తెంచుకుంది.  ఈ ఎనిమిదేళ్లలో మామ్‌ మనకందించిన విజయాలెన్నో...

 

సాధారణంగా గెలుపు, ఓటముల్ని మరొకరితో సరి పోల్చుకుంటాం. ఈ విషయంలో మామ్‌- అగ్రదేశాలతో మనల్ని పోల్చుకొనేందుకు ఎన్నో విజయాలను అందించి, భారతీయులుగా మనం గర్వపడేలా చేసింది. మిగిలిన దేశాల వ్యోమనౌకల మాదిరిగా కాకుండా... మామ్‌ తన తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహం కక్ష్యలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రపంచంలోనే ఈ ఘనత అందుకున్న తొలి దేశంగా భారత్‌ను అది నిలబెట్టింది. మనకంటే ముందు మార్స్‌పై ప్రయోగాలు చేసిన చైనా, రష్యా, అమెరికాలు ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నాయి. రెట్టింపు సమయాన్ని, డబ్బును వెచ్చించాయి. వాటితో పోలిస్తే- భారత్‌కు అయిన ఖర్చు సుమారు రూ.450 కోట్లు. ఇంటర్‌స్టెల్లార్‌, గ్రావిటీ సినిమాల నిర్మాణ ఖర్చుతో పోలిస్తే ఇది సగం కూడా కాదు. అలాగే నాసా పంపించిన మావెన్‌(మార్స్‌ ఎట్మాస్ఫియర్‌ అండ్‌ ఓలటైల్‌ ఎవల్యూషన్‌)ప్రాజెక్టు ఖర్చులో పదోవంతు డబ్బును మాత్రమే ఇండియా మామ్‌ కోసం వెచ్చించింది. మావెన్‌ రూపకల్పనకు అయిదేళ్ల సుదీర్ఘ సమయం పడితే- మన శాస్త్రవేత్తలు ‘మామ్‌’ను 15 నెలల్లోనే పూర్తిచేశారు.

 

ఒక బోయింగ్‌ విమానం తయారీకన్నా తక్కువ ఖర్చుతో మామ్‌ను ఆరు నెలల పాటు సేవల్ని అందించేందుకు వీలుగా రూపొందించారు. అంచనాలకు మించి అది ఎనిమిదేళ్లపాటు తన సేవలు అందించింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. అంగారకుడిపై వివిధ రకాల పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా 15 కేజీల బరువున్న సాంకేతిక పరికరాలను మామ్‌కి అమర్చారు. అవి సౌరశక్తితో పనిచేస్తాయి. అక్కడ సూక్ష్మజీవులు ఉంటే... అవి విడుదల చేసే మీథేన్‌ వాయువును గుర్తించేందుకు వీలుగా మీథేన్‌ సెన్సర్లను ఏర్పాటు చేశారు. అంగారకుడి వాతావరణం, అందులోని వాయువులు, ఖనిజాలు, నీటి జాడను తెలుసుకొనేందుకు ఎనిమిది వేల చిత్రాలను మామ్‌ పంపించింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది శాస్త్రవేత్తలు ఆ సమాచారాన్ని తమ పరిశోధనల కోసం వాడుకున్నారు. వాటి ఆధారంగా 27 పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. చంద్రయాన్‌ ప్రయోగం అంతరిక్ష ప్రయోగాల్లో డిగ్రీ పుచ్చుకోవడం లాంటిదైతే, మంగళయాన్‌ పీజీ పట్టా అందుకోవడం లాంటిదన్న చంద్రయాన్‌ డైరెక్టర్‌ అభివర్ణన- మామ్‌ ప్రత్యేకతకు అద్దంపట్టేదే. సౌరశక్తితో నడిచే ఈ ఉపగ్రహానికి ప్రధాన శత్రువులు అంగారకుడిపై ఏర్పడే గ్రహణాలు. గ్రహణాలు ఏర్పడినప్పుడు సౌరశక్తి లభించక తన బ్యాటరీని వాడుకోవాల్సి ఉంటుంది. గంటపాటు ఎదురయ్యే గ్రహణాలను తట్టుకొనేలా మాత్రమే మామ్‌ని తయారు చేశారు. అంగారకుడిపై ఏడున్నర గంటల సుదీర్ఘ గ్రహణాలు తరచూ రావడంతో మామ్‌ తన బ్యాటరీని ఎక్కువగా వినియోగించుకోవాల్సి వచ్చింది. దాంతో ఇంధనం ఖాళీ అయి మామ్‌ తన సేవలను ముగించుకోవాల్సి వచ్చింది.

 

అంతరిక్ష ప్రయోగాలంటే తామే చేయాలనే భ్రమల్లో ఉన్న పాశ్చాత్య దేశాలు మన ప్రయత్నాన్ని మొదట్లో తీసిపారేశాయి. పైపెచ్చు హేళన చేశాయి. అప్పట్లో అమెరికాకు చెందిన న్యూయార్క్‌టైమ్స్‌ వేసిన కార్టూన్‌ పెద్దయెత్తున విమర్శలను ఎదుర్కొంది. భారతీయ సంప్రదాయ దుస్తులైన ధోతీ, తలపాగా ధరించి ఆవును పట్టుకొన్న ఓ వ్యక్తి... సూటూబూటూ వేసుకున్న వాళ్లున్న ఉన్నతస్థాయి స్పేస్‌క్లబ్‌ తలుపులు తట్టడం ఆ కార్టూన్‌ సారాంశం. ఇలా ప్రయోగాలపై డబ్బును వృథా చేసుకొనే బదులు ప్రజలకు శుభ్రమైన మంచినీటిని అందించవచ్చు, ఆహార భద్రత, విద్యను కల్పించవచ్చు వంటి వ్యాఖ్యానాలు సైతం వినిపించాయి. అన్ని హేళనలు, అవమానాల మధ్య బయలుదేరిన మామ్‌ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. పొరుగు దేశమైన చైనా సైతం మంగళయాన్‌ ప్రయోగం ఆసియా ఖండానికే గర్వకారణమని ప్రకటించింది. అన్నింటికీ మించి ఐటీ ఉద్యోగాలవైపు వెళ్తున్న యువతను సైన్స్‌, పరిశోధనా రంగాల వైపు అది మళ్లించింది. 2,500 మంది ఉన్న మంగళయాన్‌ బృందంలో... శాస్త్రవేత్తల సగటు వయసు 27 ఏళ్లే. అలా భారతీయ యువ శక్తిని మామ్‌ ప్రపంచానికి ఘనంగా చాటింది!

 

- శ్రీసత్యవాణి గొర్లె
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దిగుబడుల్ని రెట్టింపు చేసే నవ సాంకేతికత

‣ బాలికల శ్రేయస్సే భవితకు మార్గం

‣ మొండిబాకీల భారం... తగ్గితేనే లాభాల బాట!

‣ ఆర్థిక ప్రగతికి ప్రైవేటు పెట్టుబడులు

‣ మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

Posted Date: 17-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం