• facebook
  • whatsapp
  • telegram

మొండిబాకీల భారం... తగ్గితేనే లాభాల బాట!

 

 

నిరర్థక ఆస్తు (ఎన్‌పీఏ)లు పెరిగిపోతూ బ్యాంకులపై పెనుభారం మోపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఎన్‌పీఏలను భర్తీ చేయడానికి బ్యాంకులు సొంత నిధులను వెచ్చించి భారీ నష్టాలను చవిచూశాయి. మూల ధనం తరిగిపోవడం వల్ల కొత్త రుణాలిచ్చే స్తోమత దెబ్బతింటోంది. బ్యాంకు రుణాలు అందకపోతే ఉత్పాదక కార్యకలాపాలు కుంటువడి యావత్‌ ఆర్థిక వ్యవస్థ మందగతిలోకి జారిపోతుంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.

 

నివాస వసతి కానీ, వాణిజ్య భవనం కానీ కొనుగోలు చేయదలచినవారికి ఇప్పుడు ఒక కొత్త అవకాశం అందివస్తోంది. బ్యాంకుల వద్ద ఇతరులు తనఖా పెట్టి విడిపించుకోలేకపోయిన స్థిరాస్తులను ఇకపై ఎలెక్ట్రానిక్‌ వేలం (ఈ-వేలం) ద్వారా కొనుగోలు చేయవచ్చు. పారు బాకీల వసూలుకు బ్యాంకులు ఈ-వేలం చేపడుతున్నాయి. 2015లోనే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 26 నగరాలు, పట్టణాల్లో 300కు పైగా స్థిరాస్తులను తన ప్రత్యేక పోర్టల్‌ ద్వారా వేలం వేసింది. తరవాత ఇతర బ్యాంకులు కూడా ‘సర్ఫేసి (సెక్యూరిటైజేషన్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎసెట్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ ఇంటరెస్ట్‌)’ చట్టం కింద మొండి బకాయిల వసూలుకు ఈ-వేలం విధానాన్ని చేపట్టాయి. రుణ ఎగవేతదారులు తనఖా పెట్టిన స్థిరాస్తుల వేలానికి నేడు ఇండియన్‌ బ్యాంక్స్‌ ఆక్షన్స్‌ ప్రాపర్టీస్‌ ఇన్‌ఫర్మేషన్‌ (ఐబీఏపీఐ) అనే ఉమ్మడి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. నిరర్థక ఆస్తు(ఎన్‌పీఏ)ల వేలానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పోర్టల్‌ను ఉపయోగించుకొంటున్నాయి. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) ఇప్పుడు ఐబీఏపీఐ పోర్టల్‌ను ఉపయోగించుకొంటోంది. నేడు 11 బ్యాంకుల వద్ద దేశవ్యాప్తంగా 15,800 స్థిరాస్తులు ఈ-వేలానికి అందుబాటులో ఉన్నాయి. వీటిలో 76శాతం నివాస గృహాలు లేదా అపార్ట్‌మెంట్లు, 14శాతం వాణిజ్య ఆస్తులు, ఎనిమిది శాతం పారిశ్రామిక ఆస్తులు. బ్యాంకు అధికారులు, అవినీతిపరులు కుమ్మక్కై నిరర్థక ఆస్తులను కారుచవక ధరకు సొంతం చేసుకుంటున్న సందర్భాలు ఎన్నో. దీనిపై కోర్టు వ్యాజ్యాలు పెరిగిపోతున్నాయి. ఐబీఏపీఐ పోర్టల్‌ ద్వారా నిర్వహించే ఈ-వేలం బ్యాంకులకు, వాటి వద్ద ఆస్తులు తనఖాపెట్టి అప్పు తీసుకున్న ఖాతాదారులకు, స్థిరాస్తులు కొనదలచిన సామాన్యులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

 

నిరర్థక ఆస్తులపై పోరు

బ్యాంకులు 2007-08లో ఇచ్చిన మొత్తం రుణాల్లో కేవలం 2.26శాతమే ఎన్‌పీఏలుగా లెక్కతేలాయి. 2018 మార్చికల్లా అవి 11.2శాతానికి (10.3 లక్షల కోట్ల రూపాయలకు) పెరిగాయి. ఈ పారుబాకీల్లో 86శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చినవే. 2020-21కల్లా ప్రభుత్వ బ్యాంకులు రూ.5.5 లక్షల కోట్ల పారు బాకీలను వసూలు చేసుకోగలిగాయి. అయితే స్థూల ఎన్‌పీఏలు అంటే మొత్తం బ్యాంకు రుణాల్లో నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) శాతం ఇప్పటికీ ఇతర దేశాలకన్నా భారత్‌లో ఎక్కువే. 2022 మార్చినాటికి భారత్‌లో జీఎన్‌పీఏ నిష్పత్తి 5.9శాతం. చైనాలో 1.8శాతం, మలేసియాలో 1.6, ఫ్రాన్స్‌లో 2.7, బ్రిటన్‌లో 1.2, అమెరికాలో 1.1శాతం చొప్పున ఉంది. జీఎన్‌పీఏ నిష్పత్తి ఒక్క రష్యాలో మాత్రమే భారత్‌ కన్నా ఎక్కువ (8.3శాతం). అభివృద్ధి చెందిన దేశాలకు దీటైన జీఎన్‌పీఏ నిష్పత్తిని సాధించడానికి భారత్‌ చేయవలసింది చాలా ఉంది. 2016లో రిజర్వు బ్యాంకు ఆస్తుల నాణ్యత సమీక్ష (ఏక్యూఆర్‌) చేపట్టింది. రుణ ఎగవేత జరుగుతున్నా ఆ అంశాన్ని ఖాతా పుస్తకాల్లో చూపని బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. అలాంటి మొండి బాకీలను రిజర్వు బ్యాంకు గుర్తించి, రుణ గ్రహీతలు తమ బకాయిలను తీర్చివేయడానికి గడువు ఇచ్చింది. మొండి బాకీలను ఖాతా పుస్తకాల్లో చూపి, ఆ నష్టాన్ని తామే భర్తీ చేయడానికి భారతీయ బ్యాంకులు రూ.16 లక్షల కోట్లు వెచ్చించాయి. దీనివల్ల వాటి మూలధనం తరిగిపోయింది. భారత్‌లో ఎన్‌పీఏలు వ్యవసాయ రంగంలోనే ఎక్కువ (9.4శాతం). తరవాతి స్థానాలను పరిశ్రమలు (8.4శాతం), సేవా రంగం (5.8శాతం) ఆక్రమిస్తున్నాయి. గృహ రుణాల్లో ఎన్‌పీఏలు 1.8శాతమే.

 

భావి కార్యాచరణ

ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకారం భారతీయ బ్యాంకులిచ్చిన మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల వాటా 2024 మార్చినాటికి అయిదు శాతం నుంచి అయిదున్నర శాతం మధ్యలో ఉంటుంది. 2024-26 మధ్యకాలంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు సాలీనా 6.5శాతం నుంచి ఏడు శాతం వరకు ఉండవచ్చు. ఈలోపు ఎన్‌పీఏల వసూలుకు భారతీయ బ్యాంకులు గట్టి కార్యాచరణ చేపట్టాలి. కొవిడ్‌ నుంచి ఆర్థిక వ్యవస్థ తేరుకుంటున్న దృష్ట్యా కంపెనీలు మూలధనం కోసం, కార్యనిర్వాహక మూలధనం కోసం బ్యాంకులను ఆశ్రయించడం ఎక్కువైంది. మొండి బకాయిలకు తావివ్వని విధానాలను చేపడుతూనే బ్యాంకులు మూలధనం సమకూర్చుకోవాలి. లేకుంటే ఆర్థికాభివృద్ధి కుంటువడుతుంది. 2015 మార్చిలో మొత్తం బ్యాంకు రుణాల్లో 71శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 2021 మార్చికల్లా 56శాతానికి తగ్గింది. ఇదే కాలంలో ప్రైవేటు బ్యాంకుల వాటా 20శాతం నుంచి 35శాతానికి పెరిగింది. ఇకపై అన్ని జాగ్రత్తలూ తీసుకుని రుణాలిస్తూ లాభాలను ఆర్జించగలిగేలా ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్ఠీకరించాలి.

 

ఈ-వేలంతో అధిక విలువ

తరిగిపోయిన బ్యాంకుల మూలధన భర్తీకి కేంద్ర ప్రభుత్వం 2016-17 నుంచి 2020-21 వరకు రూ.3.10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్‌ పేరిట అందించింది. అందులో రూ.34,997 కోట్లు బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా సమకూర్చింది. రూ.2,76,000 కోట్లు బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా అందించింది. ఎస్సార్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, వీడియోకాన్‌ వంటి బడా కార్పొరేట్‌ సంస్థలకు రుణ మాఫీ చేయడం వల్ల బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లిందా అని లోక్‌సభలో సభ్యులు ప్రశ్నించారు. 2021 డిసెంబరు 31నాటికి 43 బడా కార్పొరేట్‌ సంస్థలు రూ.5.44 లక్షల కోట్ల మేరకు బ్యాంకులకు బకాయి పడ్డాయని, అందులో రూ.1.06 లక్షల కోట్లు ఆస్తుల వేలం ద్వారా రాబట్టవచ్చని కేంద్రం బదులిచ్చింది. రూ.2,500 కోట్లు, అంతకన్నా ఎక్కువ బాకీపడిన కార్పొరేట్‌ సంస్థలు 43 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐబీఏపీఐ ఈ-వేలం పోర్టల్‌ తనఖా ఆస్తులకు ఎక్కువ విలువ రాబట్టడానికి తోడ్పడుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక ప్రగతికి ప్రైవేటు పెట్టుబడులు

‣ మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

‣ ముప్పు ముంగిట ప్రపంచార్థికం

‣ చిరుధాన్యాలతో ఆహార భద్రత

‣ ఆవరణ వ్యవస్థకు ప్రాణాధారం

‣ 5G ఎన్నో సవాళ్లు... మరెన్నో అవకాశాలు!

Posted Date: 17-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం