• facebook
  • whatsapp
  • telegram

మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా ఒంటా లేదన్నది మనం తరచూ వినేమాట. మాట తప్పడం విలువలు, విశ్వాసాలను దెబ్బతీయడమే కాకుండా, విధ్వంసానికీ దారి తీస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం! నిప్పుతో చెలగాటంలా సాగుతున్న ఈ పోరు ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. పుడమిని అణు యుద్ధపుటంచులకు నెడుతోంది.

డొనాల్డ్‌ ట్రంప్‌ జమానాలో బలహీనపడిన తన ప్రపంచ పెద్దన్న హోదాను తిరిగి పొందడానికి అమెరికా ఇప్పుడు తహతహలాడుతోంది. ట్రంప్‌ హయాములో డీలా పడ్డ నాటో కూటమికి, మిత్ర దేశాలన్నింటికీ జో బైడెన్‌ రాగానే తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అమెరికా పాత శత్రువు రష్యాతో మళ్ళీ యుద్ధానికి కాలుదువ్వారు. ఉక్రెయిన్‌కు నాటో కూటమిలో సభ్యత్వం రెండు వర్గాల మధ్య సులభంగా చిచ్చు రగిల్చింది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వడమంటే... అమెరికా సైనిక దళాలు రష్యా సరిహద్దుల్లో అధికారికంగా మోహరించడమే! సహజంగానే క్రెమ్లిన్‌ దాన్ని వ్యతిరేకించింది. స్వతంత్ర దేశమైన ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం తీసుకోవాలో లేదో నిర్ణయించుకొనే హక్కు లేదా? రష్యాకు ఇబ్బందని ఉక్రెయిన్‌ తన హక్కును వదులుకోవాలా? ఒకదేశంపై రష్యా దాడి చేసి ఆక్రమిస్తుంటే... అమెరికా, ఐరోపాలాంటి దేశాలు మద్దతుగా నిలవడం తప్పవుతుందా? వీటన్నింటికీ సమాధానం దొరకాలంటే చరిత్రను అవలోకించాలి.

పరిస్థితి సంక్లిష్టం

ఇటీవల మరణించిన సోవియట్‌ యూనియన్‌ (యూఎస్‌ఎస్‌ఆర్‌) మాజీ అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచెవ్‌ నిర్ణయాలు, సంస్కరణలు అంతర్జాతీయంగా పెను మార్పులకు కారణమయ్యాయి. అప్పటిదాకా తూర్పు ఐరోపా దేశాలపై (అల్బేనియా, చెకొస్లొవేకియా, తూర్పు జర్మనీ, బల్గేరియా, రుమేనియా తదితర దేశాలు) సోవియట్‌ పెత్తనం ఉండేది. నాటోకు పోటీగా యూఎస్‌ఎస్‌ఆర్‌తో పాటు అవన్నీ వార్సా ఒప్పందంలో కలిసికట్టుగా ఉండేవి. ఆయా దేశాల్లో భారీ సంఖ్యలో సోవియట్‌ సైన్యం ఉండేది. గోర్బచెవ్‌ సంస్కరణలు యూఎస్‌ఎస్‌ఆర్‌ విచ్ఛిన్నానికి దారి తీయడంతో పాటు ఈ వార్సా కూటమినీ మాయం చేశాయి. తూర్పు ఐరోపా దేశాలపై సోవియట్‌ పట్టు సడలింది. అప్పటిదాకా కమ్యూనిజం నీడలో ఉన్న రాజ్యాలన్నీ ఒక్కసారిగా స్వేచ్ఛకు తహతహలాడాయి. ఒకవైపు సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైతే, జర్మనీ ఏకమైంది. ఆనాడు అమెరికా, నాటోలోని ఇతర సభ్యదేశాలన్నీ గోర్బచెవ్‌కు ఇచ్చిన ఓ కీలక హామీ ఈ మార్పులన్నింటినీ సజావుగా సాగేలా చేసింది. తూర్పు వైపుగా (అంటే రష్యాకు ఇబ్బంది కలిగించేలా) నాటో విస్తరించదని గోర్బచెవ్‌కు ఆనాటి అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్‌ బెకర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. నాటో సభ్యదేశాలన్నీ దానికి వంత పాడాయి. జర్మనీ ఏకీకరణ విషయంలోనూ ఇదే ఒప్పందం ఉంది. మరోవైపు సోవియట్‌ విచ్ఛిన్నం సమయానికి ఉక్రెయిన్‌లాంటి వాటి వద్ద భారీస్థాయిలో అణ్వస్త్రాలున్నాయి. అమెరికా, రష్యా కలిసి అణ్వస్త్ర ఉక్రెయిన్‌ను తటస్థ దేశంలా ఉండేందుకు ఒప్పించాయి. ఉక్రెయిన్‌ భద్రతకు ఇబ్బందుల్లేకుండా   చూసుకుంటానని రష్యా హామీ ఇచ్చింది. ఆ మేరకు అమెరికా, రష్యాలు రెండూ కలిసి ఉక్రెయిన్‌ వద్ద ఉన్న అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయించాయి. ఆ రెండు హామీలూ తరవాతి కాలంలో నీటి మూటలవటంతో సమస్యలు మొదలయ్యాయి. గొర్బచెవ్‌కు ఇచ్చిన మాటను తుంగలో తొక్కి నాటో కూటమి రష్యా వైపునకు విస్తరిస్తోంది. 14 దేశాలకు కొత్తగా సభ్యత్వం ఇస్తూ తమ వైపుగా నాటో దళాలు అడుగులు వేస్తుండటంతో రష్యా జాగ్రత్త పడటం మొదలు పెట్టింది. 2014లో ఉక్రెయిన్‌లో అత్యంత వ్యూహాత్మకమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది.

ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌కే నాటో సభ్యత్వం ఇవ్వటానికి సిద్ధపడటంతో పరిస్థితి యుద్ధం దాకా వచ్చింది. తొలుత నాటోలో చేరకుండా నిలువరించడానికి ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టిన రష్యా- ప్రస్తుతం ఏకంగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. పేరుకు అది రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధమే అయినా... నిజానికి పోరు జరుగుతోంది రష్యా-అమెరికాల మధ్యే... అగ్రరాజ్యం నేరుగా తెరపైన కనిపించడం లేదంతే! ఉక్రెయిన్‌ భుజంపై తుపాకీ పెట్టి అమెరికా యుద్ధం చేస్తోంది. అందుకు ఐరోపా దేశాలు మద్దతిస్తున్నాయి. రష్యా గతవారం ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను విలీనం చేసుకొని పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరుపక్షాలూ తమ పంతం నెగ్గడానికి, తీవ్రతను మరింత పెంచడానికే ప్రయత్నిస్తుండటంతో సయోధ్యకు అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి అమెరికా, దాని మిత్ర దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్నది మారణహోమమని, పుతిన్‌ను యుద్ధఖైదీగా పరిగణించి విచారణ జరపాలనీ అమెరికా డిమాండ్‌ చేసింది. ఇవన్నీ దౌత్యపరంగా తీవ్రమైన అంశాలే

సరైన పరిష్కారం

తన చేతిలో అణ్వస్త్రాలు ముమ్మరంగా ఉన్న పుతిన్‌ ఉక్రెయిన్‌ చేతిలో ఓటమికి అంగీకరిస్తారా? నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని ఐరోపా దేశాలు ఎన్నాళ్లని నిలబడగలుగుతాయి? వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యే స్థితిలో అమెరికా ఈ యుద్ధాన్ని సాగదీస్తుందా... లేక స్వదేశంలో ఎన్నికల్లో లాభపడటానికి బైడెన్‌ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారా? ఇవన్నీ కీలక ప్రశ్నలే! కొవిడ్‌ దెబ్బకు విలవిల్లాడిన ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అగ్రరాజ్యాలు తమ అహాలను, ఆభిజాత్యాలను, సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, విశ్వమానవ కల్యాణాన్ని ఆశించి విశాల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటేనే ఉపద్రవాన్ని కట్టడి చేయడం సాధ్యమవుతుంది. ఒకరిని మించి మరొకరు అణు భయం పెంచడంలో కాకుండా మానవాళికి భరోసా ఇవ్వడంలో పోటీ పడాలి. అప్పుడే ఎవరూ నెగ్గని ఈ యుద్ధానికి పరిష్కారం లభిస్తుంది!

మూడో ప్రపంచ యుద్ధ భయం!

యుద్ధం సాగుతున్నది రష్యా-ఉక్రెయిన్‌ల మధ్యే అయినా... యావత్‌ ప్రపంచం దాని పర్యవసానాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా ఐరోపా అతలాకుతలమవుతోంది. ఇళ్లలో ప్రజలు వెచ్చగా ఉండాలన్నా, కంపెనీల్లో యంత్రాలు పనిచేయాలన్నా రష్యా నుంచి వచ్చే గ్యాస్‌పై ఆధారపడే జర్మనీ దాని కొరతతో విలవిల్లాడుతోంది. అధిక ధరలకు అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఐరోపాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఇంధనం సహా అన్నింటి ధరలూ ఎగబాకాయి. విద్యుత్‌ సంక్షోభంతో కర్మాగారాలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది. ఇప్పటికే ఫిన్‌లాండ్‌లాంటి దేశాల్లో ఈ యుద్ధంతో మనకేం సంబంధమంటూ నిరసనలు మొదలయ్యాయి. ఇవన్నీ రెండో ప్రపంచయుద్ధం ఆరంభానికి ముందు తలెత్తిన పరిణామాలకు ప్రతిబింబాలే! మరి మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా?

- రేగళ్ళ సంతోష్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

‣ ముప్పు ముంగిట ప్రపంచార్థికం

‣ చిరుధాన్యాలతో ఆహార భద్రత

‣ ఆవరణ వ్యవస్థకు ప్రాణాధారం

‣ 5G ఎన్నో సవాళ్లు... మరెన్నో అవకాశాలు!

Posted Date: 15-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం