• facebook
  • whatsapp
  • telegram

నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు గతించినా, నేటికీ భారత్‌ నూరుశాతం అక్షరాస్యత సాధించలేకపోయింది. విద్య పరంగా దేశీయంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సైతం ఆ కృషిలో భాగస్వామ్యం వహించాలి.

భారత్‌లో ప్రస్తుతం లక్షల సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. భారీగా విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. అయినా సంపూర్ణ అక్షరాస్యత అందని ద్రాక్షగానే మిగిలిపోవడం ఆవేదన కలిగిస్తోంది. నేడు ప్రపంచ నిరక్షరాస్యుల్లో 34శాతం భారత్‌లోనే ఉన్నారు. ఈ తరుణంలో 2030 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలో ఎన్నో వెనకబడిన దేశాలు ఎనభై శాతానికి పైగా అక్షరాస్యత సాధించాయి. ఇండియా అక్షరాస్యత మాత్రం ప్రస్తుతం 77.7శాతమే. పట్టణ ప్రాంతాల్లోనూ అది 89.7శాతం దగ్గరే ఉంది.

పేదరికాన్ని అధిగమించకుండా విద్యా లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యం. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం దేశీయ జనాభాలో నేటికీ 21.92శాతం పేదరికంలో మగ్గుతున్నారు. మన జీడీపీలో కనీసం మూడు శాతాన్నీ విద్యకు ఖర్చు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో వంద శాతం అక్షరాస్యత సాధించడం అంత తేలిక కాదు. మానసిక వికాసం లేకపోవడం, మూఢనమ్మకాలతో శతాబ్దాల పాటు మగ్గిన మన సమాజంలో విద్య వల్ల క్రమేణా కొంత మార్పు వస్తోంది. అయితే, సంస్కృతి మాటున అమలవుతున్న కొన్ని నమ్మకాలు, పేదరికం, అవగాహన రాహిత్యం, లింగ, కుల దుర్విచక్షణలు, అరకొర సాంకేతిక సదుపాయాలు దేశ సంపూర్ణ అక్షరాస్యతకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. 1966 నుంచి విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు చేపట్టినా సరైన ఫలితాలు సాధ్యం కాలేదు. భారత్‌లో ఉన్నన్ని విద్యా ప్రణాళికలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సరైన అభ్యసన-బోధన ఏ భాషలో     జరగాలన్నదానిపై నేటికీ ఏకాభిప్రాయం లేదు.

నూరు శాతం అక్షరాస్యత సాధించడానికి మాతృభాష అనుకూలమని నూతన విద్యావిధానం సూచించింది. భారత్‌లో విద్య కేంద్రం రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంది. భిన్న భాషలు, సంస్కృతి కలిగిన ఇండియాలో ఒకే విద్యావిధానం అమలు చేయడం పెనుసవాలే. 1951లో ఇండియా అక్షరాస్యత కేవలం 18.3 శాతం. ప్రస్తుతం అది 77.7 శాతానికి చేరింది. అయితే, ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌లో నేటికీ పెద్ద సంఖ్యలో నిరక్ష్యరాస్యులు ఉండటం తీవ్ర విచారకరం. పులిమీద పుట్ర అన్నట్లు కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇండియాలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగినా, సరైన డిజిటల్‌ ఉపకరణాలు లేక ఎంతోమంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. కరోనా అనంతరం బడులు తెరచుకున్న తరవాతా దాదాపు 30శాతం విద్యార్థులు తిరిగి బడిమెట్లు ఎక్కలేదని యునెస్కో నివేదిక తేటతెల్లం చేసింది. విద్యలో ఈ నష్ట నివారణకు సరైన చర్యలు, ప్రణాళికలతో ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా కోటి మంది బాలకార్మికులు ఉన్నట్లు గతంలో పలు పరిశీలనలు వెల్లడించాయి.

ఏడేళ్ల వయసు దాటినవారు వారి మాతృభాషగాని, లేదా ప్రాంతీయ భాషలోగాని చదవడం రాయడం వస్తే అక్షరాస్యులని నిబంధనలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ విద్యాలయాలు ఉన్నాయి. వాటిలో ఒక్కో శిక్షకుడు పది మంది నిరక్షరాస్యులకు చదువు చెబితే కొన్నేళ్లలోనే నూరు శాతం అక్షరస్యత లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సైతం ఆ కృషిలో భాగం వహిస్తే మరింత త్వరగా గమ్యాన్ని చేరుకోవచ్చు. కళాశాలల విద్యార్థులు గ్రామాలు, పట్టణాల్లో మురికి వాడలకు వెళ్ళి నిరక్షరాస్యులకు చదువు చెబితే దేశానికి మేలు జరగడంతోపాటు స్థానిక సంస్కృతి, ఆచార వ్యవహారాలు, స్థితిగతులపై వారికి అవగాహన కలుగుతుంది. సంపూర్ణ అక్షరాస్యత బాధ్యతను కేవలం ప్రభుత్వాలకు వదిలిపెట్టకుండా స్వచ్ఛంద సంస్థలు, పౌరులు సైతం తమ వంతుగా పదిమందికీ విద్య నేర్పించే ప్రయత్నం చేయాలి. దేశీయంగా నూరుశాతం అక్షరాస్యత సాధ్యం కావాలంటే స్వతంత్ర పోరాటంలో చూపిన ఐక్యత నేడు ప్రజల్లో అవసరం. దానికి ప్రభుత్వ ప్రణాళిక, సహకారం తోడైతే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి

(అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముప్పు ముంగిట ప్రపంచార్థికం

‣ చిరుధాన్యాలతో ఆహార భద్రత

‣ ఆవరణ వ్యవస్థకు ప్రాణాధారం

‣ 5G ఎన్నో సవాళ్లు... మరెన్నో అవకాశాలు!

Posted Date: 08-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం