• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక ప్రగతికి ప్రైవేటు పెట్టుబడులు

చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించాలనుకొంటున్న బహుళజాతి కంపెనీలను భారత్‌కు రప్పించాలని ఎన్‌డీఏ సర్కారు లక్షిస్తోంది. ప్రస్తుతం దేశాభివృద్ధికి ప్రజల వినియోగం, ప్రభుత్వ వ్యయం మూలాధారాలుగా ఉన్నాయి. వాటికి తోడు ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు సైతం వృద్ధి చెందితేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే వాటికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగితే ఎగుమతులు, వినియోగం, ప్రభుత్వ వ్యయం సైతం ఇతోధికమవుతాయి. 2003-08 మధ్య కాలంలో భారత్‌ అత్యధిక వృద్ధి రేటు సాధించడం వెనక ప్రైవేటు పెట్టుబడుల పాత్ర చాలా ఉంది. అప్పట్లో జీడీపీలో ప్రైవేటు పెట్టుబడుల వాటా 36శాతం. ఇప్పుడది 22శాతం వద్ద తచ్చాడుతోంది. కొవిడ్‌ కాలంలో ప్రైవేటు రంగం పెట్టుబడులకు ముందుకు రాలేకపోయింది. అప్పుడు ప్రభుత్వమే ఎక్కువ వ్యయం చేసి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకొంటోంది. కొవిడ్‌ కాలంలో దారుణంగా దెబ్బతిన్న గృహోపకరణాలు, కార్ల వంటి వినియోగ వస్తువుల ఉత్పత్తి, విక్రయాలు ఇంకా ఊపందుకోలేదు. పైగా ఆ రంగంలో ఉత్పత్తి రెండు శాతం మేర క్షీణించింది. ధరల పెరుగుదల, ఆదాయాల క్షీణత వల్ల ప్రజలు వినియోగ వస్తువులపై ఖర్చు తగ్గించారు. కొవిడ్‌ కాలంలో ఒక వర్గం ఆదాయాలు పెరిగాయి. ఇతర వర్గాల ఆదాయం పడిపోయింది. వారికి రోజు గడవడమే కష్టమైంది. ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థ కోలుకున్న చిహ్నాలు కనిపిస్తున్నా, ఈ ధోరణిని మరింత ముందుకు తీసుకెళ్ళేవి ప్రైవేటు పెట్టుబడులు మాత్రమే.

లోపాలను అధిగమించాలి

ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం బాగా లేకపోయినా భారత్‌లో మాత్రం కొత్త ఉత్పత్తి సామర్థ్య సృష్టికి ప్రైవేటు రంగం ముందుకురావడం స్వాగతించాల్సిన అంశం. సాధారణంగా భారత్‌లో పెట్టుబడుల చక్రం 12 త్రైమాసికాలపాటు నడుస్తుంది. అందులో ఏడు త్రైమాసికాలపాటు పెట్టుబడులు పెరుగుతూ వచ్చి, అయిదు త్రైమాసికాలలో తగ్గుముఖం పడతాయి. ఈసారి ప్రైవేటు పెట్టుబడులు క్షీణించి దశాబ్ద కాలం గడచింది. కంపెనీల రుణభారం, వాస్తవ వడ్డీ రేట్లు, స్వదేశీ పొదుపు, అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం, ప్రభుత్వ విధానాలు వంటివి ప్రైవేటు పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడున్న ఉత్పత్తి సామర్థ్యాన్నే పూర్తిగా వినియోగించుకోలేనప్పుడు కొత్త ఉత్పత్తి సామర్థ్య సృష్టిపై కంపెనీలు పెట్టుబడులు పెట్టవు. వచ్చే దశాబ్దంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, హరిత ఇంధనాలు కలగలిసి ప్రైవేటు పెట్టుబడులను పెద్దయెత్తున ఆకర్షించడం ఖాయం. కొవిడ్‌ వంటి ఉత్పాతాలు వచ్చిపడిన తరవాత కొత్త రీతుల్లో ఉత్పత్తి, వినియోగాలు ఊపందుకొంటాయని చరిత్ర చెబుతోంది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కొత్త పెట్టుబడి ప్రతిపాదనల్లో 78శాతం ప్రైవేటు రంగానివే. ఈ ఏడాది అదే త్రైమాసికంలో ప్రైవేటు పెట్టుబడి ప్రతిపాదనల వాటా 91శాతానికి పెరగడం శుభపరిణామం. మౌలిక వసతులు, పారిశ్రామిక ఉత్పత్తి, సాంకేతిక సేవల రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలతో ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం, చైనాలో జీరో కొవిడ్‌ విధానం అంతమైతే అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం బాగా మెరుగుపడుతుందని, అప్పుడైతే పెట్టుబడులు బాగా పెంచవచ్చని చాలా సంస్థలు ఎదురుచూస్తున్నాయి. వివిధ రంగాల్లో నియంత్రణలు సడలించడం, అనుమతులు వేగంగా ఇవ్వడం, వెనకటి తేదీ నుంచి పన్నులు వేసే పద్ధతిని తొలగించడం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) వంటివి ఉత్పత్తి పెంపుదలకు తోడ్పడతాయి. తద్వారా ప్రైవేటు పెట్టుబడులను భారీయెత్తున ఆకర్షించడానికి అవకాశం లభిస్తుంది. ప్రైవేటు రంగానికి జీడీపీలో 10శాతాన్ని మించిన రుణాలను అందిస్తే కొత్త పెట్టుబడులు ప్రవహిస్తాయి.

సంస్కరణలు కీలకం

ప్రస్తుతం విదేశాల నుంచి పెట్టుబడులు ప్రధానంగా స్టాక్‌ మార్కెట్లలోకి వస్తున్నాయి. దానికి బదులు ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఉపాధి, వ్యాపారాలను వృద్ధి చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లను ఆకట్టుకొనే విధానాలను చేపట్టడం అభిలషణీయం. పాలన, న్యాయపరమైన సంస్కరణలను చేపట్టి భారతీయ ప్రైవేటు పెట్టుబడులు ఇతోధికం కావడానికి దారులు తెరవాలి. ప్రపంచ బ్యాంకు 2020లో వెలువరించిన వ్యాపార సౌలభ్య సూచీ ప్రకారం కాంట్రాక్టులను నెరవేర్చడంలో భారత్‌ స్థానం 163. కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను కచ్చితంగా నెరవేర్చడం వ్యాపారాభివృద్ధికి ఊతమిస్తుంది. కాంట్రాక్టులు ఏళ్ల తరబడి కోర్టు వ్యాజ్యాల్లో చిక్కుకుపోతే పెట్టుబడిదారులు ముందుకు రారు. భారతీయ కోర్టుల్లో వాణిజ్య వివాద పరిష్కారానికి సగటున 1445 రోజులు పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాన్ని సరిదిద్దడానికి న్యాయపరమైన సంస్కరణలు తీసుకురావాలి. భారతదేశంలో ప్రాజెక్టులను పూర్తిచేయడం వివిధ కారణాల వల్ల విపరీతంగా ఆలస్యమైపోతోంది. దానివల్ల పెట్టుబడిదారులకు వ్యయం పెరిగిపోయి ప్రాజెక్టులు గిట్టుబాటు కాకుండా పోతాయి. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ దేశాలు చేపట్టిన విధానాలను పరిశీలించాలి. ఆయా దేశాల ప్రయోగాలు, అనుభవాలను సమీక్షించి భారత్‌ తనదైన అభివృద్ధి వ్యూహాన్ని రచించి ఆచరించాలి.

ఏ దేశం ఏం చేస్తోంది?

చైనాలో నవీకరణ సాధించే కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తున్నారు. యంత్రాల ఆధునికీకరణకు చైనా ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలిస్తోంది. డిజిటల్‌ వేదికగా పనిచేసే సంస్థలకు ప్రత్యేక రుణాలిస్తోంది.

కొవిడ్‌ నుంచి వేగంగా తేరుకోవడానికి అమెరికా ఎగ్జిం బ్యాంకు కొత్త చర్యలు తీసుకుంటోంది. చిన్న పరిశ్రమలు, వ్యాపారాలకు 7,000 కోట్ల డాలర్ల అదనపు రుణాలు, పెట్టుబడులు సమకూరుస్తోంది. అధునాతన టెక్నాలజీలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానాలను చేపట్టింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2020 నుంచి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టడానికి 350 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. 5జీ సేవలకు మహిళలను డిజిటల్‌ నిపుణులుగా తీర్చిదిద్దడానికీ నిధులు కేటాయించింది. ఆధునిక పారిశ్రామికోత్పత్తి వ్యూహానికి 100 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది.

అంకుర సంస్థలకు సింగపుర్‌ పన్ను మినహాయింపునిస్తోంది. కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలకు నగదు సహాయం చేస్తోంది. నవీకరణ టెక్నాలజీలను వేగంగా వాణిజ్యీకరించడానికి గ్రాంట్లను ఇస్తోంది.

బ్రిటన్‌ చేపట్టిన అభివృద్ధి ప్రణాళిక ప్రభుత్వ అనుమతుల మంజూరులో జాప్యాన్ని తొలగించి మౌలిక వసతుల్లోకి ప్రైవేటు పెట్టుబడులు వేగంగా ప్రవహించడానికి తోడ్పడుతోంది. ఉపాధి, వ్యాపారాల విజృంభణకు బాటలు వేస్తోంది.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

‣ ముప్పు ముంగిట ప్రపంచార్థికం

‣ చిరుధాన్యాలతో ఆహార భద్రత

‣ ఆవరణ వ్యవస్థకు ప్రాణాధారం

‣ 5G ఎన్నో సవాళ్లు... మరెన్నో అవకాశాలు!

Posted Date: 15-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం