• facebook
  • whatsapp
  • telegram

దిగుబడుల్ని రెట్టింపు చేసే నవ సాంకేతికత

 

 

చీడపీడలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల పంటల ఉత్పాదకత తగ్గిపోతోంది. ఆహార భద్రతకు అది సవాలుగా మారుతోంది. మరోవైపు జన్యు మార్పిడి పంటలపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాలు పెద్ద సంఖ్యలో ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు కత్తిరింపు) సాంకేతికత సరికొత్త ఆశాకిరణంలా కనిపిస్తోంది.

 

చీడపీడల కారణంగా పంట దిగుబడుల్లో సుమారు 30 నుంచి 60శాతం దాకా నష్టపోవాల్సి వస్తోంది. దీన్ని నివారించడానికి పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా రసాయనాల వాడకమే అంతిమ పరిష్కారం కాదు. అసలు మొక్కల ఎదుగుదలలో చీడపీడలు విజృంభించకుండా చేసే సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చు. అందుకు జీన్‌ ఎడిటింగ్‌ (జన్యు కత్తిరింపు), జెనెటిక్‌ ఇంజినీరింగ్‌, ప్లాంట్‌ బ్రీడింగ్‌, టిష్యూకల్చర్‌, జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సరికొత్త ఆవిష్కరణలను రూపొందించవచ్చు. ముఖ్యంగా చీడపీడలు, నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకొనేలా, అధిక దిగుబడులను అందించేలా ఆయా వంగడాల జన్యుక్రమంలో మార్పులు తీసుకురావచ్చు. జీవ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చేసే ఇలాంటి ప్రయోగాల ద్వారా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందీ కలగదు. నేల ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా జీవ ఎరువులు, జీవ రసాయనాల ద్వారా మంచి దిగుబడులు పొందగల వీలుంది.

 

అంకుర సంస్థల కృషి

ఇరవై ఏళ్ల క్రితం పత్తిలో రూపొందించిన జన్యుమార్పిడి జీవసాంకేతిక(బీటీ) పరిజ్ఞానం తీవ్రంగా వివాదాస్పదమైంది. ఈ పత్తి విత్తనంలో ఉండే ఒక రకమైన విషపదార్థం వల్ల పురుగుమందులపై పెట్టే ఖర్చు తగ్గుతుందన్న కంపెనీల ప్రచారం అప్పట్లో రైతుల్ని విశేషంగా ఆకర్షించింది. తరవాతి కాలంలో దేశంలోని 95శాతం పత్తి పంట బీటీకి మారిపోయింది. జన్యు మార్పిడి పంటలపై భయాలతో ఆహార పంటల్లో బీటీ తరహా వంగడాలు వెలుగు చూడలేదు. ప్రస్తుతం సరికొత్త సాంకేతికతతో జన్యు వైవిధ్యానికి ఏ మాత్రం నష్టం కలిగించకుండానే ఆయా వంగడాల్లో కోరుకున్న మార్పులు తేవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని దేశీయ వంగడాల్లోనూ అధిక దిగుబడినిచ్చే, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొనే, నాణ్యమైన విత్తనాన్నిచ్చే జన్యు సామర్థ్యం ఉంటుంది. ఈ వంగడాల్లోని మేలైన జన్యు లక్షణాలను సేకరించి జన్యు కత్తిరింపు ప్రక్రియ ద్వారా కొత్త జన్యు క్రమాన్ని ఆవిష్కరించవచ్చు. నూక్లియోజ్‌ ఎంజైములైన క్రిస్పర్‌, కాస్‌9 వంటివి ఉపయోగించి ప్రస్తుతమున్న జన్యువులోనే కోరుకున్న లక్షణం వచ్చేలా చేసే ప్రక్రియనే జీన్‌ ఎడిటింగ్‌ అంటారు. దీన్ని ఉపయోగించి జన్యు మార్పిడి పంటల్లో దిగుబడుల క్షీణతకు కారణమయ్యే హానికర జన్యువులను గుర్తించి తొలగించేయవచ్చు. మేలైన వంగడాలను రూపొందించవచ్చు. ఆయా వంగడాల దిగుబడి సామర్థ్యాన్ని పెంచేందుకు సైతం ఈ ప్రక్రియ తోడ్పడుతుంది.

 

కెనడాకు చెందిన ఏజీ జీన్‌ అనే అంకుర సంస్థ జీవ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రొటీన్‌ను మెరుగుపరచడం ద్వారా విత్తనాలు, కణజాలాన్ని వృద్ధి చేసింది. జన్యు కత్తిరింపు ప్రక్రియలను ఉపయోగించి వాణిజ్య పంటల్లోనూ ప్రయోగాలు చేస్తోంది. మొక్క జన్యువులోకి ప్రవేశించకుండానే కేవలం ఒక తరం విత్తనాలకు పనికొచ్చేలా ఇజ్రాయెల్‌కు చెందిన అంకుర సంస్థ మార్‌ఫ్లోరా కరవును తట్టుకొనేలా విత్తనాలకు టీకాను రూపొందించింది. కరవును తట్టుకోగలిగే సోయాలోని జన్యువును తీసి మొక్కజొన్న, వడ్ల గింజల్లో ప్రవేశపెట్టడం ద్వారా ఈ టీకాను రూపొందించారు. ఆస్ట్రేలియాకు చెందిన మరో అంకుర సంస్థ సైతం జీవసాంకేతికత సాయంతో వ్యవసాయం, పశువులు, జీవాల్లో మేలైన బ్రీడింగ్‌ మెలకువలను ఉపయోగించి మేలు జాతులను గుర్తించే పనిలో పడింది. ఇదే తరహాలో ఆక్వా రంగంలోనూ వైరస్‌ల బారిన పడకుండా అధిక దిగుబడులు వచ్చే పద్ధతులపైనా పరిశోధనలు సాగిస్తోంది. అన్నీ మగ రొయ్యలనే పుట్టించే సాంకేతికతను ప్రపంచంలో తొలిసారిగా ఇజ్రాయెల్‌ 2014లోనే అభివృద్ధి చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంకుర సంస్థలు జన్యు వైవిధ్యానికి ఎలాంటి హాని కలిగించకుండానే నవ సాంకేతికత సాయంతో విప్లవాత్మక ఫలితాలను రాబడుతున్నాయి. ఈ పరిణామాలు పోనుపోను అన్ని రకాల ఆహార పంటల్లో బయోఫోర్టిఫైడ్‌ రకాల రూపకల్పనకు దారితీయనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

 

పోషక లోపాలు తొలగేలా...

ఎల్లలు లేని సాంకేతికత నేడు పంటల రూపురేఖల్ని మార్చేస్తోంది. జన్యుమార్పిడి పంటలతో పర్యావరణ విధ్వంసం గురించి భయపడుతున్న తరుణంలో జన్యు కత్తిరింపు సాంకేతికత నేడు విప్లవం సృష్టిస్తోంది. పదేళ్లు సాగే పరిశోధనల్ని ఈ సాంకేతికతో నాలుగేళ్లలోనే ముగించేయవచ్చు. పలు రకాల పంటల సహజ జన్యు ప్రక్రియను దెబ్బతీయకుండా, ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటం ఈ సాంకేతికత ప్రత్యేకత. దీన్ని కరవు, అత్యల్ప ఉత్పాదకత, పోషకాహార లోపం వంటి సమస్యలను అధిగమించడానికి అద్భుత అవకాశంగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ సాంకేతికత జన్యువైవిధ్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలిగించనిదైతేనే అటు పర్యావరణ పరంగా ఇటు ఆహారోత్పత్తుల పెంపు దిశగా అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. జన్యుమార్పిడి పంటలతో పోలిస్తే జన్యు కత్తిరింపు సాంకేతికతలో ఎన్నో రెట్ల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేడు భారత్‌సహా ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌, అమెరికా, బ్రిటన్‌, అర్జెంటీనా, స్వీడన్‌ వంటి దేశాల్లో దానిపై విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. పలు దేశాలు ఆయా పంటల సాగును సైతం అనుమతించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది సూక్ష్మపోషక లోపాలతో బాధపడుతున్నారు. పోషక లోపాలతో 10శాతం పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేలా నూతన సాంకేతికత ఉండాలి. విశ్వవ్యాప్తంగా పరిశోధన, అంకుర సంస్థలు మరింత శ్రద్ధ వహించి ఆకలి కేకలను, పోషకాహార లోపాలను నివారించేలా, రైతుల ఆదాయాలు ఇనుమడించేలా చేయడం నేడెంతో అవసరం.

 

ఇక్రిశాట్‌ ఘనత

జన్యుమార్పిడి పంటల తయారీకి ఉపయోగించే ట్రాన్స్‌జెనిక్‌ జీవ సాంకేతిక ప్రక్రియ కంటే జన్యు కత్తిరింపు ప్రక్రియ మరింత ఆధునికమైనది. దీని ద్వారా మనం కోరుకొనే లక్షణాలున్న జన్యువులను మొక్కల జీనోమ్‌లో ప్రవేశపెట్టడం కచ్చితమైనది, సులభమైనది, తక్కువ ఖర్చుతో కూడినది. జన్యు వైవిధ్యానికి ఎలాంటి నష్టం కలిగించకుండానే ఇలాంటి పద్ధతులు పాటించి సరికొత్త వంగడాలకు రూపకల్పన చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్రిశాట్‌ హైదరాబాద్‌ కేంద్రం జన్యు కత్తిరింపు ద్వారా అద్భుతాలు సృష్టిస్తోంది. జన్యు క్రమం ఆధారంగా శెనగలో ఇలాంటి ప్రయోగాన్ని ఇక్రిశాట్‌లో విజయవంతంగా చేశారు. 41 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ క్రతువులో పాల్గొని శెనగలో విస్తృత జన్యుక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రక్రియను ఉపయోగించి 12 నుంచి 23శాతం దాకా దిగుబడులు పెంచేలా ఇక్కడ పరిశోధనలు సాగుతున్నాయి.

 

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బాలికల శ్రేయస్సే భవితకు మార్గం

‣ మొండిబాకీల భారం... తగ్గితేనే లాభాల బాట!

‣ ఆర్థిక ప్రగతికి ప్రైవేటు పెట్టుబడులు

‣ మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

Posted Date: 17-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం