• facebook
  • whatsapp
  • telegram

బాలికల శ్రేయస్సే భవితకు మార్గం

అంతర్జాతీయ బాలికా దినోత్సవం. ఆధునిక యుగంలో ఆడపిల్లలు తమ గళాన్ని వినిపించే అవకాశాలు పెరిగినా... హక్కుల సాధనలో వారు సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. విద్యారంగంలో సమాన అవకాశాలను పొందలేని దైన్యం నేటికీ కొనసాగుతోంది. శారీరక మానసిక ఆరోగ్య సంరక్షణ దిశగా బాలికలకు పూర్తిస్థాయి వైద్యసేవలు లభించడంలేదు. లైంగిక దాడులు, లింగపరమైన దుర్విచక్షణలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడలేదు.

బాలికా విద్యకు ప్రాధాన్యం పెరిగింది. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పౌర సమాజం గళమెత్తి- వారికి అండగా నిలుస్తోంది. బాలికల హక్కుల కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయి. ఇలాంటివి బాలికలు విజయసోపానాలు అధిరోహించడానికి తగినంత బలాన్ని ఇస్తున్నాయి. కానీ బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. కిశోర బాలికలకు అవసరమైన అన్ని రంగాల్లో నిర్ణయాత్మక భాగస్వామ్యం కల్పించడం నేటి సమాజంలో తక్షణావసరం. కుటుంబాల్లో, సమాజంలో వారి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడంద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం, వారి సాధికారత కోసం కృషి చేయడం, హక్కులు పొందడంలో వారికి సహాయపడటం వంటి లక్ష్యాలతో ఏటా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ‘ఇది మన సమయం- మన హక్కులు, మన భవిత’ అనేది ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవ నినాదం.

చట్టాలతో రక్షణ కవచం

బాలికల్లో జ్ఞానం పెంచడం, తమను తాము రక్షించుకోవడంపై అవగాహన కల్పించడం, నైపుణ్యాలతో సాధికారత దిశగా నడిపించడం, పలురకాల ప్రయోజనాలను అందించడంవంటి లక్ష్యాలతో కేంద్రప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలుచేస్తోంది. లింగపరమైన దుర్విచక్షణను రూపుమాపడం, బాలికల చదువును ప్రోత్సహించడం, వారి జీవనానికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలు సమష్టిగా ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కిశోర బాలికల ఆరోగ్యం, పునరుత్పత్తి, పోషకాహార లోపాలు, రుతుక్రమ పరిశుభ్రత తదితరాలపై అవగాహన కల్పించడం కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలు అమలుచేస్తోంది. యుక్తవయసులో ఉపాధి కల్పించడం, వర్ధమాన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం కోసం నైఫుణ్యాభివృద్ధి జాతీయ విధానం-2015ను కేంద్రం రూపొందించింది. వీటితోపాటు సుకన్య సమృద్ధి యోజన, బాలికా సమృద్ధి యోజన, ముఖ్యమంత్రి రాజ్యశ్రీ యోజన, ముఖ్యమంత్రి లాడ్లీయోజన, కన్యా సుమంగళ యోజన, నందాదేవీ కన్యా యోజన, ముఖ్యమంత్రి కన్యా సురక్షా యోజన, సీబీఎస్‌ఈ ఉపకార వేతన పథకం వంటివి  దేశంలో బాలికల కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఉద్దేశించినవే. ఇందులో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం, మరికొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. బాలికలకు సామాజిక, ఆర్థిక చేయూతను అందించే దిశగా తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పథకాలు అమలులో ఉన్నాయి.ఆడపిల్లల రక్షణార్థం ఎన్నో చట్టాలూ రూపొందాయి. వాటిలో బాలల న్యాయ (పిల్లల భద్రత, సంరక్షణ) నమూనా సవరణ నియమాలు-2022, అనైతిక రవాణా నిరోధక సవరణ బిల్లు-2006, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (సవరణ)చట్టం-2019 ఇటీవలి కాలంలో అమలులోకి వచ్చాయి. మిషన్‌ పోషణ్‌ కింద అంగన్‌వాడీల సేవలు, కిశోర బాలికా పథకం, పోషణ్‌ అభియాన్‌, మిషన్‌ శక్తి, మిషన్‌ వాత్సల్య, జాతీయ బాలనిధి వంటి పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పిల్లలను ఆదుకోవడమే లక్ష్యంగా గత ఏడాది మే 29న ప్రధానమంత్రి పీఎం కేర్స్‌ పథకాన్ని ప్రారంభించారు. కొవిడ్‌ సంక్షోభంలో తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన పిల్లల సంరక్షణ బాధ్యతలను చేపట్టడానికి ఉద్దేశించిన పథకమిది. ఆ చిన్నారులకు 23 ఏళ్ల వయసు వచ్చేవరకు విద్య, బీమా, ఆర్థిక సహాయం ద్వారా వారిని శక్తిమంతం చేయడం దీని లక్ష్యం.

ఆగని భ్రూణ హత్యలు

లింగ నిష్పత్తి రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంది. కొన్నిచోట్ల ఆ నిష్పత్తిలో తీవ్ర అంతరాలు కనిపిస్తున్నాయి. బాలికల జననాలపై సమాజంలో ఉన్న దుర్విచక్షణ సైతం ఇందుకు కారణమని తేటతెల్లమవుతోంది. గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ చట్టం అమలులో ఉన్నప్పటికీ పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలియగానే గర్భస్రావం చేయించడం ఇంకా కొనసాగుతోంది. ఆడపిల్లల అభ్యున్నతికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా సామాజికంగా అవసరమైన పరివర్తన కనిపించడం లేదు. అబ్బాయిలతో పోలుస్తూ చదువుతో సహా అన్నింటిలోనూ అమ్మాయిలను వెనక వరసలోకి నెట్టేందుకే ప్రయత్నిస్తున్న వర్గాలెన్నో. బాలికల ప్రతిభ, నైపుణ్యాలకు పదును పెట్టే మాట అటుంచి- వారికి చదువు చెప్పించడానికీ కొందరు నిరాకరిస్తున్నారు. త్వరగా పెళ్ళి చేసి అత్తారింటికి పంపించేస్తే ఆమె రక్షణ బాధ్యత తీరిపోతుందనే భావన కొందరు తల్లిదండ్రుల్లో నాటుకుపోయింది. అదే కుటుంబంలోని బాలుడు అన్ని సదుపాయాలనూ సులభంగా పొందగలుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఈ భావజాలం నుంచి సమాజం కొంతమేర బయటపడుతోంది. బాలికలకు సరైన నైపుణ్యాలను, అవకాశాలను అందిస్తే మరింతగా రాణించి సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటారు. రేపటి సమాజ పురోగతిలో భాగస్వాములవుతారు.  

- డాక్టర్‌ జి.సాయిస్రవంతి

(సహాయ ఆచార్యులు, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మొండిబాకీల భారం... తగ్గితేనే లాభాల బాట!

‣ ఆర్థిక ప్రగతికి ప్రైవేటు పెట్టుబడులు

‣ మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

Posted Date: 17-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని