• facebook
  • whatsapp
  • telegram

తీర ప్రాంతాలపై తుపానుల పడగ

హుద్‌హుద్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంత జనజీవనాన్ని అతలాకుతలం చేసి ఎనిమిదేళ్లయింది. భారత్‌లో తీరప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న తుపానులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తుపానులను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు... నష్ట తీవ్రతను నియంత్రించడానికి ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకం.

కోస్తా తీరంపై 2014 అక్టోబర్‌ 7-14 తేదీల మధ్య విరుచుకుపడ్డ ‘హుద్‌హుద్‌’ తుపాను తూర్పు తీరాన్ని తీవ్రంగా వణికించింది. ఆంధ్ర తీరంతో పాటు అండమాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం గడచిన వందేళ్లలో ఇదే అతి పెద్ద విధ్వంసకర తుపాను. హుద్‌హుద్‌ తుపానువల్ల రూ. 22వేల కోట్ల వరకు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. పదుల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. హుద్‌హుద్‌ సమయంలో మూడు నిమిషాల పాటు గంటకు 185  కి.మీ.ల వేగంతో వీచిన గాలులకు ఉత్తరాంధ్ర పల్లెలతో పాటు, విశాఖ నగరమూ కకావికలమైంది. ఈ తుపాను అనంతరం ప్రకృతి వనరులు, మౌలిక వసతులు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కలిగిన నష్టాన్ని పూడ్చడానికి చాలా సమయం పట్టింది.

విపత్తులతో కష్టకాలం

హుద్‌హుద్‌ వంటి తుపానుల అనుభవాలతో తీరరక్షణకు పటిష్ఠమైన దీర్ఘకాలిక కార్యాచరణను అమలు చేయడంపై ప్రభుత్వ వ్యవస్థలు దృష్టి సారించకపోవడం విచారకరం. మన దేశ భూభాగం వెంబడి 7,500    కి.మీ.ల సముద్రతీర ప్రాంతం ఉంది. తీరానికి 50 కి.మీ. వరకు నివాసం ఉండే జనాభా 25 కోట్లని అంచనా. 1800-2022 మధ్య కాలంలో దేశంలో 350 వరకు తుపానులు ఏర్పడగా వాటిలో 120 దాకా తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని అంచనా. కోస్తా తీరంలో దివిసీమ(1977), కోనసీమ(1997), ఒడిశా(1999) తుపానులతోపాటు హుద్‌హుద్‌, తిత్లీ, ఫణి, బుల్‌బుల్‌, అసాని తదితర ఎన్నో ఉత్పాతాలు తీరాన్ని ఆనుకున్న ప్రాంతాలను విపరీతంగా దెబ్బతీశాయి. 2004 నాటి సునామీ దేశ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తీర ప్రాంత నిర్వహణ (సీజెడ్‌ఎం) నియమాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా విపత్తుల నష్ట ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. తీరప్రాంత ఆవాసాల్లో నిర్మాణాలు తుపాను ధాటికి తట్టుకునేలా ప్రణాళికలు అమలు చేయాలి. పటిష్ఠ హెచ్చరికల వ్యవస్థ, అత్యవసర సర్వీసులను అందుబాటులో పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా తుపానుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. దేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు అనుబంధంగా కేంద్రప్రభుత్వం 1991లో తీరప్రాంత నియంత్రణ నిబంధనల అమలు కోసం నోటిఫికేషన్‌(సీఆర్‌జెడ్‌)ను తీసుకొచ్చింది. ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటులో అనుమతుల ప్రక్రియలో అడ్డంకిగా ఉన్నాయనే ఉద్దేశంతో సీఆర్‌జెడ్‌ నిబంధనల్లో అనేకమార్లు సవరణలు తీసుకొచ్చారు. దశలవారీగా సవరణలు చేసి నేడు సీఆర్‌జెడ్‌ నిబంధనలు-2019 అమలు చేస్తున్నారు. వీటిని పటిష్ఠంగా అమలు పరచేందుకు వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. సీఆర్‌జెడ్‌ నిబంధనలను పర్యాటక, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దుర్వినియోగం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని పలుమార్లు జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ప్రభుత్వాల్లో చలనం రావడం లేదు.

పరిరక్షణతో భరోసా

అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాలు తీరప్రాంత పరిరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యంతో పోలిస్తే భారత్‌లో చేపడుతున్న చర్యలు చాలా స్వల్పం. హుద్‌హుద్‌ తుపాను తరవాత ప్రభుత్వం బలమైన గాలులు వీచినా తట్టుకునేలా భూగర్భ విద్యుత్‌ సౌకర్యం, పటిష్ఠమైన రహదారులు, షెల్టర్‌ బెల్ట్‌తో తీరం వెంబడి వృక్ష కవచం ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. ఇందుకోసం 2015లో ప్రపంచ బ్యాంకు రుణసాయంతో రూ.2200 కోట్లు ఖర్చు కాగల ఓ భారీ ప్రాజెక్టును అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో రూ.1550 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణ వాటా, రూ.670 కోట్లు రాష్ట్ర వాటాగా ఖర్చు చేయడానికి ఒప్పందం కుదిరింది. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును సెప్టెంబర్‌ 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడువు ముగిసినా అభివృద్ధి పనులు ఏ మేరకు సాగుతున్నాయనే విషయంలో పారదర్శకత కొరవడింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తుపానులతో నష్టపోయిన ప్రాంతాల పునర్నిర్మాణం ప్రక్రియకు చట్టబద్ధత కల్పిస్తారు. దాంతో ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు నిర్దేశిత లక్ష్యాల అమలులో జవాబుదారీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాలను అమలు చేస్తే ప్రభుత్వ వ్యవస్థల జవాబుదారీతనాన్ని పెంచే అవకాశం ఉంటుంది. విపత్తు అధ్యయన సంస్థల అంచనా ప్రకారం, 2050 నాటికి సముద్రమట్టం పెరుగుదలవల్ల భారత్‌లో 3.60 కోట్ల జనాభా తీవ్రమైన వరద తాకిళ్లను ఎదుర్కొనే ప్రమాదముంది. అందుకే తీర ప్రాంత పరిరక్షణపై అత్యంత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. భవిష్యతులో తలెత్తే విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు సన్నద్ధం కావాలి. తీరంలోని ప్రకృతి వనరుల వినియోగం, యాజమాన్యం, నిర్వహణకు పటిష్ఠమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా- సీఆర్‌జెడ్‌ నియమాలను పటిష్ఠంగా అమలు చేసే విధంగా వ్యవస్థలను బలోపేతం చేయాలి. తీర ప్రాంత రక్షణపై దృష్టి పెట్టి భవిష్యత్తులో తుపానులను ధైర్యంగా ఎదుర్కొనే భరోసా ప్రజల్లో కల్పించాలి.

ముంచెత్తుతున్న వరదలు

గడచిన దశాబ్ద కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, గుజరాత్‌, రాజస్థాన్‌, బిహార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలను వరదలు పలుమార్లు ముంచెత్తాయి. తరచూ గోదావరి వరదలవల్ల తెలుగు రాష్ట్రాల్లోని వందలాది గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోతోంది. ఈ ఏడాది ఒక్క జులై నెలలో తెలంగాణలో వరదల తాకిడికి రూ.1400 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. గడచిన అయిదేళ్లలో ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రధాన నగరాలు సైతం ఊహించని వరద తాకిడితో విలవిల్లాడాయి. జలవనరుల ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విచక్షణారహితంగా నదుల్లో సాగుతున్న ఇసుక తవ్వకాలు వాటి సహజ ప్రవాహ గమనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇసుక, ఖనిజాల తవ్వకాలతో నదుల రూపురేఖలు మారి వరదల తాకిడి అధికమవుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పర్వత శ్రేణులు, అడవులు, తీర ప్రాంతాల్లో ప్రకృతి వ్యవస్థలు విధ్వంసానికి గురికాకుండా పర్యావరణ చట్ట నియమాలను కఠినంగా అమలుచేయాలి. అప్పుడే తుపానులు, వరదలతో తలెత్తే విపత్తుల నష్టాన్ని నియంత్రించడం సాధ్యమవుతుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మంగళయాన్‌... సంపూర్ణం!

‣ దిగుబడుల్ని రెట్టింపు చేసే నవ సాంకేతికత

‣ బాలికల శ్రేయస్సే భవితకు మార్గం

‣ మొండిబాకీల భారం... తగ్గితేనే లాభాల బాట!

‣ ఆర్థిక ప్రగతికి ప్రైవేటు పెట్టుబడులు

‣ మాట తప్పి... మంటలు రేపుతున్న అగ్రరాజ్యాలు!

‣ నెరవేరని కల... సంపూర్ణ అక్షరాస్యత!

Posted Date: 18-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం