• facebook
  • whatsapp
  • telegram

పేదరికంపై పోరుబాట

ప్రపంచమంతటా వందల కోట్ల మంది పేదలు తమ దుస్థితి నుంచి బయటపడటానికి గుండె నిబ్బరంతో చేస్తున్న సంఘర్షణను గుర్తించి, గౌరవించడానికి ఐక్యరాజ్యసమితి ఏటా అక్టోబరు 17వ తేదీని దారిద్య్ర నిర్మూలన దినంగా నిర్వహిస్తోంది. హుందాగా జీవించే హక్కు అందరికీ ఉందన్నది ఈ సంవత్సరం నినాదం. అది సాధ్యం కాకపోతే... ప్రాథమిక హక్కులూ నెరవేరవనేది వాస్తవం.

ప్రపంచం ఉత్పత్తి చేస్తున్న ఆహార ధాన్యాలతో ప్రజలందరికీ ఆహారం అందించడం సాధ్యమే అయినా... 81.1 కోట్లమంది ప్రజలకు సరిపడా తిండి దొరకడం లేదు. 4.4 కోట్ల మంది కరవు కోరల్లో చిక్కుకునే రోజు ఎంతో దూరంలో లేదు. 200 కోట్ల మందికి సురక్షిత తాగునీటి సదుపాయం లేదు. 360 కోట్లమందికి సరైన పారిశుద్ధ్య సౌకర్యం లేదు. 130 కోట్లమంది బహువిధ దారిద్య్రంతో సతమతమవుతున్నారు. వారిలో సగం- పిల్లలు, యువతే. 2019లో ప్రపంచంలో 64.8 కోట్లమంది నిరుపేదలు ఉన్నారు. 2020 నాటికి వారి సంఖ్య 7.1 కోట్ల (11శాతం) మేర పెరిగి 71.9 కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు ఇటీవల ‘పేదరికం, సంపద పంపిణీ-2022’ పేరిట వెలువరించిన నివేదికలో వెల్లడించింది. ఈ 7.1 కోట్లమందిలో 80శాతం నిరుపేదలు భారతదేశంలోనే ఉన్నారని తెలిపింది. కొవిడ్‌వల్ల 2021లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 16 కోట్లమంది పేదలయ్యారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సుదూరం

ప్రపంచ పేదరికాన్ని 2030నాటికి మూడు శాతం మేర తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం నెరవేరేలా లేదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారతదేశంలో బహువిధ దారిద్య్రం గురించి 2021 నవంబరులో నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. పోషకాహారం, శిశు మరణాలు, ప్రసవానికి ముందు సేవలు, పాఠశాల హాజరీ, వంటకు వాడే ఇంధనం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్‌, గృహవసతి వంటి 12 అంశాల ఆధారంగా పేదరికాన్ని అంచనా వేసిన నివేదిక అది. భారతదేశ జనాభాలో 25శాతం బహువిధ పేదరికంలో మగ్గుతున్నారని నివేదిక తేల్చింది. ఉత్తరాదిలో బిహార్‌ జనాభాలో పేదలు 52శాతం మేర ఉన్నారు. ఝార్ఖండ్‌లో 42శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 38, మధ్యప్రదేశ్‌లో 37, రాజస్థాన్‌లో 29శాతం చొప్పున ఉన్నారు. దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కేరళ జనాభాలో కేవలం ఒక శాతంకన్నా తక్కువ స్థాయిలో ప్రజలు బహువిధ పేదరికం అనుభవిస్తున్నారు. తమిళనాడులో అయిదు శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 12, కర్ణాటకలో 13, తెలంగాణలో 14, మహారాష్ట్రలో 12, గుజరాత్‌లో 18శాతం చొప్పున ఈ కోవలోకి వస్తారు. ఐక్యరాజ్యసమితి 2030కల్లా సాధించాలని తలపెట్టిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీల)లో మొదటిది- దారిద్య్ర నిర్మూలన. ఇది నెరవేరడంపైనే మిగతా లక్ష్యాలను సాధించడం ఆధారపడి ఉంటుంది. భారత్‌ సహా ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు 2030కల్లా అన్ని ఎస్‌డీజీలను నెరవేరుస్తామని వాగ్దానం చేసినా ఆ కృషికి కొవిడ్‌ మహమ్మారి అడ్డుపడింది. ప్రస్తుత ధోరణులను చూస్తే 2078 సంవత్సరానికి కానీ ప్రపంచదేశాలు ఎస్‌డీజీలను సాధించలేవని తేలుతోంది. అయితే, భారత్‌ మాత్రం 2059 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడం సుసాధ్యంగానే కనిపిస్తోంది.

తీవ్రమైన ఎండలవల్ల గడచిన ఏడాది భారత్‌లో గోధుమ, వరి ఉత్పత్తి తగ్గిపోయింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ సతత హరిత విప్లవాన్ని ప్రతిపాదించారు. జీవావరణానికి భంగం కలగనిరీతిలో చేసే సేద్యమే సతత హరిత విప్లవం. రసాయన ఎరువులను ఉన్నపళంగా విడచిపెట్టకుండా సహజ లేక సేంద్రియ సేద్యాన్ని క్రమంగా పెంచుకొంటూ పోవాలి. భారత్‌లో సాధారణ నిరుద్యోగంకన్నా యువతరంలో నిరుద్యోగం మూడు రెట్లు ఎక్కువ. భారత్‌లో వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించనిదే పేదరిక నిర్మూలన సాధ్యంకాదు. ఆదాయంలో లింగపరమైన అసమానతలను తొలగించాలి. మహిళలు ఇంట్లో చేసుకునే పనిపాటలను ఆర్థికంగా పరిగణనలోకి తీసుకుంటే, అది ఏడాదికి 10 లక్షల కోట్ల డాలర్లుగా లెక్కతేలుతుంది. ఆ మొత్తం ప్రపంచ జీడీపీలో 13 శాతానికి సమానమని ఐక్యరాజ్యసమితి మహిళా ఆర్థిక సాధికారతా సంఘం అంచనా వేసింది. ప్రపంచంలో అన్ని చోట్లా యుద్ధాలు, సాయుధ సంఘర్షణలను నివారించడం దారిద్య్ర నిర్మూలనకు కీలకమవుతుంది. యుద్ధాల కోసం వెచ్చిస్తున్న నిధులను పేదరిక నిర్మూలనకు మళ్లించడం యావత్‌ ప్రజానీకం శ్రేయస్సుకు దోహదం చేస్తుంది. శాంతి లేనిదే దారిద్య్ర నిర్మూలన సాధ్యపడదు.

అక్షరాస్యత కీలకం

వాతావరణ మార్పుల వల్ల వచ్చే దశాబ్దంలో అదనంగా 10 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోతారని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. సంపన్న దేశాలు కర్బన ఉద్గారాలను భారీయెత్తున తగ్గించి వాతావరణ మార్పులను అరికడితే పేదరిక స్థాయులూ తగ్గుతాయి. అల్పాదాయ దేశాల్లో ప్రాథమిక పఠన, లేఖన స్థాయులు పెరిగితే 17.1 కోట్లమంది దుర్భర దారిద్య్ర బాధను తప్పించుకోగలరని యునెస్కో తెలిపింది. వయోజనులందరూ మాధ్యమిక విద్యను పూర్తిచేస్తే ప్రపంచ పేదరికం రేటు సగానికి  తగ్గిపోతుంది. ఆహార భద్రత కల్పించడం దారిద్య్ర నిర్మూలనకు మొదటి మెట్టు. సూక్ష్మ రుణాల ద్వారా కంబోడియా పేదరికాన్ని అధిగమించింది. వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా చైనా 1978 నుంచి 80 కోట్లమందిని పేదరికం నుంచి ఉద్ధరించింది. వ్యవసాయ రంగ అభివృద్ధి దారిద్య్ర నిర్మూలనకు గొప్ప అస్త్రం. డిజిటల్‌ సాంకేతికతలు, ఇంటర్నెట్‌ లభ్యత నవీకరణకు దారితీసి పేదరికం నుంచి ప్రజలు బయటపడటానికి తోడ్పడతాయి. 30 ఏళ్ల క్రితం నుంచి అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినాన్ని పాటిస్తున్నాం. భారత్‌ 2030నాటికి కాకపోయినా వీలైనంత వేగంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి సర్వశక్తులూ కేంద్రీకరించాలి. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర మహోత్సవాలను జరుపుకొనేలోపే భారత్‌ పేదరికం స్థాయులను తగ్గించడంపై దృష్టిపెట్టడం అత్యావశ్యకం.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు

‣ వెంటాడుతున్న ఆహార అభద్రత

‣ పట్టపగ్గాలు లేని డాలర్‌

‣ తీర ప్రాంతాలపై తుపానుల పడగ

‣ మంగళయాన్‌... సంపూర్ణం!

‣ దిగుబడుల్ని రెట్టింపు చేసే నవ సాంకేతికత

‣ బాలికల శ్రేయస్సే భవితకు మార్గం

Posted Date: 18-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం