• facebook
  • whatsapp
  • telegram

యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రత్యర్థులను నిలువరించడానికి ప్రస్తుతం డ్రోన్‌ యుద్ధ శైలిని అనుసరిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంట చైనా తరచూ కవ్వింపులకు పాల్పడుతోంది. ఉగ్రమూకలకు ఆటపట్టు అయిన పాక్‌ నుంచీ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అధునాతన డ్రోన్‌ వ్యవస్థను అందిపుచ్చుకొనేందుకు భారత్‌ కృషి చేస్తోంది.

సైనిక డ్రోన్లతో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వ్యూహాలు కొత్త రూపాన్ని సంతరించుకొంటున్నాయి. రష్యన్‌ టి-72 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్‌ డ్రోన్లను వినియోగించింది. సౌదీకి చెందిన రెండు చమురు బావులపై యెమన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి జరిపారు. అల్‌ఖైదా, తాలిబన్‌ ఉగ్రమూకలు లక్ష్యంగా అఫ్గానిస్థాన్‌ యుద్ధంలో అమెరికా వాటిని విజయవంతంగా వినియోగించింది. ఒకప్పుడు గూఢచర్యం, పర్యవేక్షణ, నిఘా విధులకే పరిమితమైన డ్రోన్లు- ప్రస్తుతం యుద్ధతంత్రాలనే మార్చేస్తున్నాయి. పలు దేశాల సైన్యాల్లో అవి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి.

సమర్థంగా అడ్డుకట్ట

ఖర్చు తక్కువగా ఉండటం, తమ సైనికులకు ఎలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకపోవడం వల్ల పాకిస్థాన్‌, చైనాలు భారత్‌లో ఇబ్బడిముబ్బడిగా డ్రోన్‌ దాడులకే పాల్పడే అవకాశం ఉంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశం. జమ్మూలోని వాయుసేన స్థావరంపై గతేడాది లష్కరే తొయిబా ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి జరిపారు. సరిహద్దుల ఆవలి నుంచి మాదకద్రవ్యాలు, ఆయుధాలను అక్రమంగా భారత్‌లోకి తరలించడానికీ డ్రోన్లను వినియోగిస్తున్నారు. పాక్‌లో మానవ రహిత వైమానిక వాహనాల (యూఏవీల) తయారీ 1997-98లో ప్రారంభమైంది. తుర్కియే, జర్మనీ, ఇటలీ, చైనా తదితర దేశాల నుంచి వివిధ శ్రేణుల్లో యూఏవీలను కొనుగోలు చేయడంపై దాయాది దేశం దృష్టి సారించింది. రివర్స్‌ ఇంజినీరింగ్‌ విధానంలో వాటి ద్వారా సొంతంగా డ్రోన్లను తయారు చేసుకొంటోంది. ప్రస్తుతం పాక్‌ వద్ద చిన్న, మధ్య తరహా యూఏవీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆరు నుంచి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేరుకొనేలా వాటిని రూపొందించింది. పాక్‌ నూనత డ్రోన్‌- వింగ్‌ లూంగ్‌-2ను అగ్ర దేశాల వద్ద ఉన్న ప్రతిష్ఠాత్మక మానవ రహిత యుద్ధ వైమానిక వాహనా(యూసీఏవీ)లతో పోలుస్తున్నారు.

పాకిస్థాన్‌ నుంచి డ్రోన్ల ముప్పు అధికంగా ఉందని నిఘా సంస్థలు హెచ్చరించిన దరిమిలా- భారత్‌ స్వదేశీ సాంకేతికతపై దృష్టి సారించింది. ఇతర దేశాల నుంచీ డ్రోన్ల కొనుగోలును వేగవంతం చేసింది. డ్రోన్ల విషయంలో పాకిస్థాన్‌, చైనాలతో పోలిస్తే భారత్‌ దశాబ్ద కాలం వెనకబడి ఉన్నా- క్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకొంటోంది. ఇటీవల ఇండియా అభివృద్ధి చేసిన స్వార్మ్‌ డ్రోన్లను సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ఆ డ్రోన్ల వ్యవస్థను విధ్వంసక సాంకేతికతగా అభివర్ణిస్తున్నారు. స్వార్మ్‌ డ్రోన్ల సాయంతో సరిహద్దుల్లో చొరబాట్లు, క్షిపణి దాడులు, రాకెట్‌ ప్రయోగాలను సమర్థంగా అడ్డుకోవచ్చు. కృత్రిమ మేధ (ఏఐ)తో లక్ష్యాలను గుర్తించేలా అత్యాధునిక సాంకేతికతతో వెయ్యి స్వార్మ్‌ డ్రోన్లను సైతం భారత్‌ రూపొందించింది. తద్వారా పటిష్ఠమైన డ్రోన్‌ వ్యవస్థ కలిగిన నాలుగో దేశంగా నిలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంట చైనా తరచూ ఉద్రిక్తతలను రాజేస్తోంది. ఆ దృష్ట్యా ఎత్తయిన ప్రాంతాల్లోనూ నిఘాకు పనికొచ్చేలా మరింత ఆధునిక స్వార్మ్‌ డ్రోన్‌ వ్యవస్థ రూపకల్పనకు భారత్‌ సిద్ధమైంది. చైనా ఉత్తర సరిహద్దుల వెంబడి సైన్యం సామర్థ్యాన్ని పెంచడానికి ఇది తోడ్పడుతుంది. వార్‌హెడ్లతో భూమిమీద ఉన్న లక్ష్యాలపై విరుచుకుపడే ఏఎల్‌ఎస్‌ 50 డ్రోన్‌ వ్యవస్థను ఇటీవల పోఖ్రాన్‌లో భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. భారత సైన్యం త్వరితగతిన కొన్ని సాయుధ స్వార్మ్‌ డ్రోన్లను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించినట్లు ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ప్రకటించారు.

స్వదేశీ సాంకేతికతతో...

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రుస్తుం, రుస్తుం-2 పేర్లతో స్వదేశీ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. సొంత జీపీఎస్‌ గగన్‌ను ఉపయోగించి రుస్తుం-2 సామర్థ్యాన్ని పరిశీలించింది. ప్రస్తుతం భారత సాయుధ దళాల వద్ద ఇజ్రాయెల్‌కు చెందిన రెండు వందలకు పైగా మధ్యస్థ ఎత్తులో అధిక సమయం ఎగరగలిగే (ఎంఏఎల్‌ఈ) సెర్చర్‌, హెరన్‌, హెరోప్‌ యూఏవీలు ఉన్నాయి. డీఆర్‌డీఓ స్వదేశీ సాంకేతికతతో ఘటక్‌ యూసీఏవీని సైతం అభివృద్ధి చేస్తోంది. యూఏవీల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచాలని భావిస్తున్నట్లు సైనిక విమానయాన విభాగం డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.కె.సూరి చెబుతున్నారు. పాకిస్థాన్‌, చైనాల నుంచి డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు ఇప్పటికే స్వదేశీ డ్రోన్ల వ్యవస్థ రూపకల్పనపై కృషి చేస్తున్నాయి. ప్రత్యర్థులు ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం లేదా ధ్వంసం చేసే సామర్థ్యం వాటికి ఉంది. ఈ డ్రోన్లు, రొబోటిక్స్‌, లేజర్లు, స్వయంచాలిత విధ్వంసక ఆయుధ వ్యవస్థలు భారత సాయుధ దళాలకు యుద్ధతంత్రంలో సరికొత్త దన్నుగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

- ఎస్‌.నీరజ్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పేదరికంపై పోరుబాట

‣ చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు

‣ వెంటాడుతున్న ఆహార అభద్రత

‣ పట్టపగ్గాలు లేని డాలర్‌

Posted Date: 18-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం