• facebook
  • whatsapp
  • telegram

ఉత్తరకొరియా దూకుడు

ప్రపంచం ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధం, తైవాన్‌ సమస్యతో సతమతమవుతుంటే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నాయకత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ ఏడాది అక్టోబరు వరకు 40కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. ఆ క్షిపణుల్లో కొన్నింటికి దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌ భూభాగాలను తాకే సత్తా ఉంది.

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను తుంగలో తొక్కాయి. గత నెలలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దక్షిణ కొరియా, జపాన్‌లను సందర్శించిన సమయంలో ఉత్తర కొరియా ఒక క్షిపణి పరీక్ష జరిపింది. మరో క్షిపణి జపాన్‌ మీదుగా ఎగిరి సముద్రంలో పడింది. అమెరికా ఏలుబడిలోని పసిఫిక్‌ మహాసముద్ర ద్వీపం గ్వామ్‌ను తాకగల క్షిపణినీ పరీక్షించింది. తన ఆగడాలకు ప్రతిగా అమెరికా, దక్షిణ కొరియాలు సైనిక కవాతులు, నౌకా విన్యాసాలు జరిపితే, వాటిని సాకుగా చూపి ఉత్తర కొరియా మరిన్ని ఆయుధ పరీక్షలకు పాల్పడుతోంది. కొద్ది రోజుల క్రితం ఒక క్షిపణిని కొరియా ద్వీపకల్పానికి, జపాన్‌కు మధ్యనున్న సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఆపైన సముద్రంలోకి ఫిరంగి గుళ్లను పేల్చింది. దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోకి యుద్ధ విమానాలనూ పంపింది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సముద్ర, భూ సరిహద్దుల వెంబడి విమానాలు ఎగరకూడదని, ఆయుధ పరీక్షలు జరపకూడదంటూ గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉత్తర కొరియా యథేచ్ఛగా ఉల్లంఘించింది. 

పరీక్షలకు సమాయత్తం

చైనాలో కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ముగిసిన తరవాత, నవంబరు ఎనిమిది అమెరికా కాంగ్రెస్‌ మధ్యంతర ఎన్నికలు జరిగే ముందు ఉత్తర కొరియా ఏడో అణ్వస్త్ర పరీక్ష జరపడానికి సమాయత్తమవుతోందని గూఢచారి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఆ దేశం వద్ద ఇప్పటికే 50 అణ్వస్త్రాలు ఉన్నాయని అంచనా. తాత, ఉత్తర కొరియా సంస్థాపక అధ్యక్షుడైన కిమ్‌ ఇల్‌ సంగ్‌, తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మాదిరిగానే కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు కూడా అణ్వస్త్రాలను విడనాడే ఆలోచనే లేదనేది సుస్పష్టం. కిమ్‌ 2020లో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణ్వస్త్ర వాహక క్షిపణిని పరీక్షించారు. దీని తరవాత రాత్రిపూట జరిపిన సైనిక కవాతులో సుదూర లక్ష్యాలను ఛేదించగల సరికొత్త క్షిపణిని ప్రదర్శించారు. అణ్వస్త్ర తయారీకి కావలసిన ప్లుటోనియం శుద్ధి కార్యక్రమాన్ని ఉత్తర కొరియా పునఃప్రారంభించిందని 2021లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. ఆ వెంటనే కిమ్‌ సర్కారు దూరశ్రేణి క్రూయిజ్‌ క్షిపణులను, అణ్వస్త్ర వాహక సామర్థ్యం గల హైపర్‌ సోనిక్‌ క్షిపణినీ పరీక్షించింది.

కొన్నేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణు యుద్ధానికి సై అంటే సై అని సవాళ్లు చేసుకున్నారు. వియత్నాంలో ట్రంప్‌తో భేటీ నిష్ఫలంగా ముగియడంతో కిమ్‌ క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర తయారీ సన్నాహాలు పునరుద్ధరించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌ యుద్ధంపైకి ప్రపంచం దృష్టి మళ్ళిన సమయంలో కిమ్‌ తిరిగి దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికాలను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఆయుధ పరీక్షలు ముమ్మరం చేశారు. గతంలో తమ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అంచెలంచెలుగా తగ్గించుకొంటూ వస్తామని, దానికి బదులుగా ఆర్థిక ఆంక్షలను క్రమక్రమంగా తగ్గించాలని కిమ్‌ సర్కారు ప్రతిపాదించింది. కానీ, ఇప్పుడు దాన్ని గాలికి వదిలేసి అణ్వస్త్ర కార్యక్రమాన్ని కొనసాగించదలచింది. అణ్వాయుధ పరిత్యాగానికి చర్చలు కొనసాగిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పదేపదే ప్రతిపాదిస్తున్నా కిమ్‌ దాన్ని పెడచెవిన పెడుతున్నారు. పైగా దక్షిణ కొరియా నుంచి అమెరికా సేనలను ఉపసంహరించాలని, ఈ ప్రాంతం నుంచి యుద్ధ నౌకలు, క్షిపణులను వెనక్కు పంపాలని అమెరికాను డిమాండ్‌ చేస్తున్నారు.

సహకరించే పరిస్థితి కరవు

ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి తరవాత రష్యా, చైనాలతో అమెరికా సానుకూల సంబంధాలు నెరపింది. దీంతో ఆ ప్రధాన రాజ్యాల మధ్య విభేదాలను ఉపయోగించుకుని ఉత్తర కొరియా తన అజెండాను నెరవేర్చుకొనే వీలు లేకుండా పోయింది. కానీ, తాజాగా ఉక్రెయిన్‌, తైవాన్‌ సమస్యల వల్ల ఉద్రిక్తతలు రగులుతున్నాయి. అందువల్ల ఉత్తర కొరియాకు కళ్లేలు బిగించడానికి అమెరికాకు చైనా, రష్యాలు సహకరించే పరిస్థితి లేదు. రేపు ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్ష జరిపినా ఐరాస భద్రతా మండలి చర్య తీసుకోకుండా చైనా, రష్యా అడ్డుపడటం ఖాయం. కాబట్టి కిమ్‌ తన అణ్వస్త్ర ఆశలతో ముందుకెళ్లడానికి అడ్డు ఉండదని భావించాలి. ఉత్తర కొరియా మీదకు అమెరికా దృష్టి మళ్ళితే ఉక్రెయిన్‌, తైవాన్‌ సమస్యలపై అమెరికా ఆసక్తి తగ్గి తమకు వెసులుబాటు చిక్కుతుందని మాస్కో, బీజింగ్‌లు భావించవచ్చు.

- ఆర్య
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సంక్షోభం నేర్పిన పాఠాలకు నోబెల్‌

‣ హిమ సీమలో ఎన్నికల వేడి

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

‣ పేదరికంపై పోరుబాట

‣ చైనాపై జిన్‌పింగ్‌ ఉడుంపట్టు

‣ వెంటాడుతున్న ఆహార అభద్రత

‣ పట్టపగ్గాలు లేని డాలర్‌

Posted Date: 19-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని