• facebook
  • whatsapp
  • telegram

అమెరికా - చైనా చిప్‌ యుద్ధం

 

 

ఒకవైపు ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతుండగానే తైవాన్‌పై యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ప్రపంచం ఇప్పటికే ఆహార, ఇంధన కొరతలతో అల్లాడుతుండగా-అమెరికా, చైనాల మధ్య చిప్‌ల (సెమీకండక్టర్ల) యుద్ధానికి తెరలేచింది. ఇది ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉపద్రవాన్ని తెస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

 

చైనాకు సెమీకండక్టర్లను, వాటి తయారీకి ఉపకరించే యంత్రాలను ఎగుమతి చేయదలచే అమెరికన్‌ కంపెనీలు ముందుగా తన వద్ద లైసెన్సు తీసుకోవాలని ఇటీవల అమెరికా వాణిజ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకమైన ఆంక్షలు గతంలో కొన్ని చైనా కంపెనీలకు మాత్రమే పరిమితం. ఇప్పుడు చైనా దేశమంతటినీ అమెరికా ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. తాజా ఆంక్షలు చైనాకు ఆర్థికంగానే కాకుండా సైనికపరంగానూ కష్టనష్టాలు తెచ్చిపెడతాయి. 21వ శతాబ్ది ఆర్థిక వ్యవస్థకు సెమీకండక్టర్లే ఆయువుపట్టు. అవి లేకపోతే మన స్మార్ట్‌ఫోన్లు మూగబోతాయి. సాధారణ మోటారు వాహనాలతోపాటు ఎలెక్ట్రిక్‌ వాహనాలూ కదలవు. అంతర్జాలం, 5జీ, 6జీ సాంకేతికతతో కూడిన కమ్యూనికేషన్‌ నెట్‌వర్కులు పనిచేయవు. చిప్‌లు లేకుంటే క్వాంటమ్‌ కంప్యూటర్లు, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలు సాధ్యపడవు. వాయు, నౌకా దళాలు, పదాతి దళం, గూఢచర్య యంత్రాంగాలు ఎంత అత్యాధునిక సెమీకండక్టర్లు వాడితే అంత వేగంగా గెలుపు సాధించగలుగుతాయి. జీపీఎస్‌ సాయంతో క్షిపణి ప్రయోగాలకు, అంతరిక్ష ఆయుధాలకు చిప్‌లే పట్టుగొమ్మ.

 

వికేంద్రీకృత పరిశ్రమ

నేటి ప్రపంచంలో చిప్‌ల రూపకల్పన, ప్రత్యేక యంత్రాలపై వాటి తయారీ, ఉత్పత్తి స్థానాల నుంచి ప్రపంచ దేశాలకు సరఫరా అనేవి వేర్వేరు విభాగాలుగా, వేర్వేరు దేశాల్లో స్థిరపడ్డాయి. ఈ విభాగాలన్నింటినీ అదుపు చేయగలవారే భవిష్యత్తును శాసించగలుగుతారు. అమెరికా, చైనాల మధ్య ప్రారంభమైన చిప్‌ యుద్ధం ఈ అదుపు కోసమే. ప్రస్తుతానికి చిప్‌ల రూపకల్పన, ఉత్పత్తి, సరఫరాలపై అమెరికా, దాని మిత్రదేశాలకే పట్టు ఉంది. చిప్‌ డిజైన్‌ అమెరికాలోనూ, వాటి తయారీ యంత్రాలు ఐరోపాలోనూ, ఆ యంత్రాలను ఉపయోగించి సెమీకండక్టర్లను కూర్పు చేసే ఫౌండ్రీలు తైవాన్‌, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాల్లోనూ కేంద్రీకృతమయ్యాయి. అమెరికాను అధిగమించి ప్రపంచంలో అగ్ర శక్తిగా ఎదగాలని లక్షిస్తున్న చైనా- చిప్‌లు లేనిదే తన ఆశయాన్ని నెరవేర్చుకోలేదు. అందుకే స్వదేశంలోనే చిప్‌లను డిజైన్‌ చేసి, ఉత్పత్తి చేయాలని ఇటీవలి కాలంలో గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే అత్యధునాతన చిప్‌ డిజైన్‌, ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికీ అమెరికా, దాని మిత్రుల చేతుల్లోనే కేంద్రీకృతమైంది. తమ ఆధిక్యాన్ని వదులుకోవడానికి అమెరికా కూటమి సిద్ధంగా లేదు.

 

రెండేళ్ల క్రితం చైనా టెలికాం సంస్థ హువావైకి అన్ని రకాల అధునాతన చిప్‌ల ఎగుమతిని అమెరికా నిషేధించింది. ట్రంప్‌ హయాములో మొదలైన ఈ నిషేధాన్ని ఇప్పుడు బైడెన్‌ సర్కారు మరింత విస్తృతం చేస్తోంది. ట్రంప్‌ విధించిన నిషేధం దెబ్బకు హువావై తన అంతర్జాతీయ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో 80 శాతందాకా కోల్పోయింది. దాంతో తన స్మార్ట్‌ ఫోన్‌ విభాగమైన ఆనర్‌ను వేరేవారికి అమ్మేసుకోవలసి వచ్చింది. 5జీ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలన్న కలను కట్టిపెట్టాల్సి వచ్చింది. ఆనర్‌ అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌ నుంచి చిప్‌లు కొని స్మార్ట్‌ ఫోన్లను తయారు చేస్తోంది. హువావై వంటి కంపెనీలపై విధించిన ఆంక్షలను మొత్తం చైనాపై విధించడానికి ఇప్పుడు అమెరికా సమాయత్తమైంది. దీనితోపాటు స్వదేశంలో అధునాతన చిప్‌ల డిజైన్‌, తయారీని ప్రోత్సహించడానికి 5200 కోట్ల డాలర్ల రాయితీలను అమెరికా పార్లమెంటు మంజూరు చేసింది. తైవాన్‌ చిప్‌ ఉత్పత్తి సంస్థ టీఎస్‌ఎంసీ అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో పెద్ద చిప్‌ కర్మాగారాన్ని నెలకొల్పనున్నది. ప్రపంచంలో 90 శాతం అధునాతన చిప్‌లు తైవాన్‌లోనే తయారవుతున్నాయి. రేపు చైనా కనుక తైవాన్‌పై దాడి చేస్తే యావత్‌ ప్రపంచ చిప్‌ల సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది.

 

లోహాలపై చైనా పట్టు

చైనాకు సెమీకండక్టర్లును దక్కనివ్వకుండా చేయాలని అమెరికా చూస్తున్నా- ఆ చిప్‌ల తయారీకి కావలసిన ముడి సరకులపై వాషింగ్టన్‌కు పట్టులేదు. చిప్‌ల తయారీకి కీలకమైన రాగి నిక్షేపాలు చిలీ దేశంలోనే అత్యధికం. వీటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది చైనాయే. అల్యూమినియం, టంగ్‌స్టన్‌ ఉత్పత్తి చైనా చేతుల్లో కేంద్రీకృతమైంది. లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా ఖండ దేశాల్లో ఉన్నాయి. కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌ మదర్‌బోర్డుల తయారీకి అవసరమైన గాలియం లోహ నిక్షేపాల్లో 95శాతం చైనాలోనే ఉన్నాయి. ఏతావతా చిప్‌ల తయారీలో ఉపయోగించే అన్ని లోహాలపై చైనాకే పట్టు ఉంది. అమెరికా దీన్ని ఛేదించడానికి కొత్త వ్యూహాలతో ముందుకురానుంది. భవిష్యత్తులో చిప్‌ల కోసం పోరు సైబర్‌ సీమ నుంచి వాస్తవ ప్రపంచానికి విస్తరిస్తుంది. ఆర్థిక, రాజకీయ, సైనిక పరంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది.

 

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కష్టాల సేద్యంలో కర్షకులు

‣ పోటెత్తుతున్న వరదలు

‣ ఉత్తరకొరియా దూకుడు

‣ సంక్షోభం నేర్పిన పాఠాలకు నోబెల్‌

‣ హిమ సీమలో ఎన్నికల వేడి

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

Posted Date: 25-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం