• facebook
  • whatsapp
  • telegram

కష్టాల సేద్యంలో కర్షకులు

భారత్‌ పెద్దమొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. అందుకు కారణమైన రైతులను మాత్రం సాగు సమస్యలు పీడిస్తున్నాయి. వారు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు దశాబ్దాలుగా విఫలమవుతున్నాయి. మరోవైపు పంట ఉత్పాదకత కొరవడి వారి జీవితాలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారాయి.

వ్యవసాయ రంగంలో మన దేశం అద్భుత ప్రగతిని సాధించినట్లు భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) ఇటీవల వెల్లడించింది. వ్యవసాయ ఉత్పత్తుల పరంగా ప్రపంచంలో తొలి అయిదు స్థానాల్లో నిలిచే దేశాల్లో ఒకటిగా ఇండియా ఎదిగినట్లు తెలిపింది. ఈ మేరకు ‘స్వాతంత్య్రానంతరం భారత వ్యవసాయం’ పేరుతో ఒక నివేదికను వెలువరించింది. దాని ప్రకారం స్వాతంత్య్రం తరవాత ఇండియా ఆహార మిగులును సాధించింది. 1950-51లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 5.1 కోట్ల టన్నులు. 2021-22 నాటికి అది 31.4 కోట్ల టన్నులకు చేరింది. ఈ కాలంలో ఆహార ధాన్యాలు ఆరు రెట్లు, ఉద్యాన పంటలు 11 రెట్లు, చేపల ఉత్పత్తి 18 రెట్లు, పాలు 10 రెట్లు, గుడ్లు 53 రెట్లు పెరిగాయి. 1950-51లో అన్నిరకాల వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తులు 13.5 కోట్ల టన్నులు. 2021-22 నాటికి అవి 130 కోట్ల టన్నులకు చేరాయి. రూ.4.14 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి భారత్‌ చేరింది.

ఐసీఏఆర్‌ నివేదిక భారత్‌ వ్యవసాయ పురోభివృద్ధిని కళ్లకు కడుతోంది. దేశీయంగా అన్నదాతలను మాత్రం సాగు కష్ట నష్టాలు వెంటాడుతున్నాయి. అప్పుల భారంతో ఎంతోమంది కర్షకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, దానికి అనుగుణంగా ఆదాయంలో వృద్ధి లేకపోవడం రైతులకు తీవ్ర సమస్యగా మారింది. ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి. వాటివల్ల చిన్న సన్నకారు రైతులకు సాగు ఆదాయం క్రమేపీ తెగ్గోసుకుపోతోంది. దేశీయంగా మొత్తం కర్షకుల్లో 85శాతానికి పైగా చిన్న సన్నకారు రైతులే. వారు అభివృద్ధి చెందకుండా భారత వ్యవసాయ రంగ సమగ్ర పురోభివృద్ధి సాధ్యం కాదు.

దాదాపు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, నేలలతో పలు పంటల సాగుకు ఇండియా అనుకూలం. పాలు, సుగంధ ద్రవ్యాలు, పప్పులు, జీడిపప్పు, జనపనార ఉత్పత్తిలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. బియ్యం, గోధుమలు, పండ్లు, కూరగాయలు, పత్తి తదితరాల ఉత్పత్తిలో భారత్‌ది విశ్వవ్యాప్తంగా రెండో స్థానం. గణాంకాలు ఘనంగా ఉన్నప్పటికీ దేశంలో అనేక పంటల ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ఫలితంగా చిన్న, సన్నకారు రైతుల జీవితాల్లో ఆర్థిక ఎదుగుదల ఉండటం లేదు. తక్కువ ఉత్పాదకతతో పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడం చాలా సవాళ్లతో కూడుకొన్న విషయం. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు చాలా తక్కువగా ఉంది. రైతుల స్థాయిలో ఆహార శుద్ధి చాలా స్వల్పంగా జరుగుతోంది. దానివల్ల కర్షకుల ఆదాయం వృద్ధి చెందడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందించడంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలు సాగులో వందశాతం యాంత్రీకరణ దిశగా పురోగమిస్తున్నాయి. భారత్‌ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడింది. పెద్ద రైతులు మాత్రమే కొంతమేరకు యంత్రాలను వాడుతున్నారు. సాగులో వస్తున్న సాంకేతిక విప్లవం పేద రైతుల జీవితాలను మార్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇటీవలి కాలంలో భారత్‌లో సాగు రంగానికి సంబంధించి పరిశోధన, అభివృద్ధిపై ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి. చిన్న రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఇలాంటి చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులైన యువకులు అనేక అంకుర సంస్థలను ప్రారంభిస్తున్నారు. సాగులో అధిక ఉత్పాదకత, రాబడికి ఉన్న సంక్లిష్టతలను తొలగిస్తే అన్నదాతలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యవసాయంలో కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు జపాన్‌ రోబోలను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ ఆధారంగా ఎన్నో యంత్రాలను ఆవిష్కరించింది. భారత్‌ వ్యవసాయ రంగంలో నెలకొన్న అనేక సమస్యలకు ఆధునిక సాంకేతికతతో కూడిన యాంత్రీకరణ పరిష్కారం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అది అతి తక్కువ ఖర్చుతో రైతులందరికీ అందుబాటులో ఉంటేనే సరైన ప్రయోజనాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు.

- సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోటెత్తుతున్న వరదలు

‣ ఉత్తరకొరియా దూకుడు

‣ సంక్షోభం నేర్పిన పాఠాలకు నోబెల్‌

‣ హిమ సీమలో ఎన్నికల వేడి

‣ యుద్ధ తంత్రాన్ని మార్చేస్తున్న డ్రోన్లు

Posted Date: 22-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం