• facebook
  • whatsapp
  • telegram

ఐరోపాను బెంబేలెత్తిస్తున్న జీవనవ్యయం

ఉక్రెయిన్‌ యుద్ధం తెచ్చిపెట్టిన ఆహార, ఇంధన కొరతలు ఐరోపా ప్రజలను ఆర్థికంగా దెబ్బకొట్టి, రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం వల్ల ఆదాయాల నిజ విలువ తగ్గి జీవన వ్యయం పెరిగిపోయింది. 19 యూరోజోన్‌ దేశాల్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 9.9 శాతానికి చేరడంతో జీతభత్యాలు పెంచాలని కార్మికులు, ప్రభుత్వ సిబ్బంది సమ్మెబాట పడుతున్నారు.

పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గించడంలో తమ ప్రభుత్వం విఫలమవుతోందని బ్రిటన్‌, ఇటలీలలో ‘యూగవ్‌’ సర్వేలో పాల్గొన్న 82 శాతం ఆగ్రహించారు. అందుకే బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. పలు ఐరోపా దేశాల్లో యూగవ్‌ సర్వే చేసిన వారిలో అత్యధికులు జీవన వ్యయం పెరిగిపోయినందువల్ల కుటుంబ ఖర్చులు తగ్గించుకోవలసి వస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో కుటుంబ బడ్జెట్లకు మరింత కోత తప్పదని భావిస్తున్నారు. బ్రిటన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాదాయ వర్గాల పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించడానికి యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఇంధన ధరలు పెరిగిపోవడంతో బడి బస్సుల రుసుములూ పెరిగి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 10.1 శాతానికి పెరగడంతో రైల్వే, రేవు కార్మికులు, నర్సులు, న్యాయస్థానాల సిబ్బంది జీతాల పెంపు కోసం సమ్మెలు చేస్తున్నారు. కరెంటు బిల్లులు, పెట్రోలు బిల్లులు తడిసి మోపెడయ్యాయని ఇటాలియన్లు ఆరోపిస్తున్నారు. యూరోజోన్‌ అంతటిలోకీ అత్యల్ప ద్రవ్యోల్బణం (6.2 శాతం) నమోదైన ఫ్రాన్స్‌లోనూ రైల్వే, రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగులు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది, చమురు శుద్ధి కర్మాగారాల కార్మికులు జీతాలు పెంచాలంటూ సమ్మెకు దిగారు. నాటో నుంచి ఫ్రాన్స్‌ బయటికి వచ్చేయాలని కోరేవారి సంఖ్య పెరుగుతోంది. 11 శాతానికిపైగా ద్రవ్యోల్బణం నమోదైన జర్మనీలో విమానయాన సంస్థల సిబ్బంది జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 9.3 శాతానికి చేరిన ఆస్ట్రియాలోనూ ఇతర ఐరోపా దేశాల మాదిరిగా ఇంధనంతోపాటు నిత్యావసరాల ధరలూ పెరిగిపోయాయి.

ప్రజలు ఇలా అగచాట్లపాలవుతుంటే చమురు కంపెనీల పని మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంది. 2022 ప్రథమ త్రైమాసికంలో 550 కోట్ల డాలర్ల లాభాలను ప్రకటించిన అమెరికన్‌ సంస్థ ఎక్సాన్‌మొబిల్‌ రెండో త్రైమాసికానికి వచ్చేసరికి 1790 కోట్ల డాలర్ల లాభం వచ్చినట్లు తెలిపింది. నిరుడు 910 కోట్ల డాలర్ల లాభాలను కళ్లజూసిన బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థ ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే అంతకు మూడు రెట్ల లాభాలను ప్రకటించింది. జర్మన్‌, ఆస్ట్రియన్‌ ఇంధన కంపెనీల పరిస్థితీ ఇలాగే ఉంది. ‘ఎక్సాన్‌కు ఎంత లాభాలు వచ్చాయో అందరికీ వెల్లడిస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించడంలో ఉద్దేశం- చమురు కంపెనీలు ప్రజల ఈతిబాధలను సొమ్ము చేసుకుంటున్నాయని హెచ్చరించడమే. చమురు కంపెనీల పని తీరు అమోఘంగా ఉండటం వల్ల వచ్చిన లాభాలు కావివి. మార్కెట్‌పై గుత్తాధిపత్యం వల్ల, ధరలను అడ్డగోలుగా పెంచేయడం వల్ల వచ్చినవి. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చూపి వినియోగదారులను దోచుకోవడం సరికాదని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లేయెన్‌ హెచ్చరించారు. వివిధ రంగాల్లో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేయడం వల్లనే ఐరోపా ప్రజలు జీవనవ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీన్ని తట్టుకోగల స్థాయిలో జీతాలు పెరగడం లేదని ఉద్యోగులు రోడ్డెక్కవలసి వస్తోంది. ఉదాహరణకు 1979-2019 మధ్య అమెరికాలో ధరలు 61.8 శాతం పెరగ్గా జీతభత్యాలు 7.9 శాతం మేరకు పెరిగాయి. ఐరోపా పరిస్థితీ ఇంతే. అందుకే బ్రిటిష్‌, జర్మన్‌ కార్మిక సంఘాలు 10 శాతం వేతన పెరుగుదలను డిమాండ్‌ చేస్తున్నాయి. ఫ్రెంచి కార్మికులైతే ఏకంగా 25 శాతం పెంపుదల కోసం పట్టుబడుతున్నారు. సంక్షోభ సమయంలో కంపెనీలకు గాలివాటంగా వచ్చిపడిన లాభాలపై పన్నులు విధించి, ఆ మొత్తాలను ప్రజా సంక్షేమం కోసం ఖర్చుపెట్టాలనే డిమాండ్‌ ఊపందుకొంటోంది. ఇది కొత్త భావనేమీ కాదు. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ అమెరికన్‌ కంపెనీల గాలివాటం లాభాలపై 95 శాతం పన్ను విధించేవారు. 1980లనాటి చమురు సంక్షోభంలోనూ మితిమీరిన లాభాలపై పన్ను విధించారు. ఇలాంటి లాభాలపై బ్రిటన్‌లో 25 శాతం పన్ను విధిస్తున్నారు. నార్వే పన్నుల ఆదాయం ఈ ఏడాది 50 శాతం పెరుగుతుందని అంచనా. ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా అన్నట్లు లాభాలను అందరూ పంచుకోవాల్సిన సమయం వచ్చేసింది!

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘పునరుత్పాదక’ లక్ష్యాలు... సుదూరం!

‣ మాటల్లోనే... సమానత్వం

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

‣ భాజపా - కాంగ్రెస్‌... మధ్యలో ఆప్‌!

‣ అమెరికా - చైనా చిప్‌ యుద్ధం

‣ కష్టాల సేద్యంలో కర్షకులు

‣ పోటెత్తుతున్న వరదలు

Posted Date: 31-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం