• facebook
  • whatsapp
  • telegram

మాటల్లోనే... సమానత్వం

లింగ దుర్విచక్షణ భారతీయ సమాజంలో అనాదిగా కొనసాగుతున్న ప్రధాన సమస్య. దానివల్ల ఎంతోమంది స్త్రీ శిశువులు అర్ధాంతరంగా కడతేరిపోతున్నారు. ప్రతిభ ఉన్నా చాలామంది అమ్మాయిలు జీవితంలో ఉన్నత స్థానాలను అందుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తుండటం హర్షణీయం. ఈ విషయంలో ప్రగతి మరింతగా చురుకందుకోవాల్సి ఉంది.

భారత్‌లో అమ్మాయిలకు అవకాశాల సంగతి పక్కనపెడితే పుట్టుకలోనూ సమానత్వం కొరవడిన దుస్థితి నెలకొంది. అబ్బాయిలతో పోలిస్తే ఏడాది లోపు అమ్మాయిల మరణాలు అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ అపఖ్యాతిని మూటగట్టుకొంది. ఆడపిల్ల గుండెల మీద కుంపటి అనే ఆలోచన సమాజంలో తీవ్రంగా కొనసాగుతుండటమే దీనికి కారణం. గతంతో పోలిస్తే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2020 నమూనా నమోదు వ్యవస్థ (ఎస్‌ఆర్‌ఎస్‌) నివేదిక ప్రకారం దశాబ్ద కాలంలో పురుష, స్త్రీ శిశు మరణాల రేటు (ఐఎంఆర్‌) జాతీయ సగటు సమాన స్థాయికి (28కి) చేరింది. 2011లో ఇది 43:46 నిష్పత్తిలో ఉండేది. దశాబ్ద కాలంలో శిశు మరణాల రేటులో నలభై శాతానికి పైగా తగ్గుదల నమోదైంది.

మరింత పురోగతి అవసరం

దేశీయంగా పదహారు రాష్ట్రాల్లో అబ్బాయిలతో పోలిస్తే స్త్రీ శిశు మరణాల రేటు గతంలో అధికంగా ఉంది. 2011 నుంచి అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. నేటికీ ఆయా రాష్ట్రాల్లో స్త్రీ శిశు మరణాల రేటు అబ్బాయిలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. ప్రతి వెయ్యి సజీవ శిశు జననాల్లో చోటుచేసుకొనే మరణాల సంఖ్యను శిశు మరణాల రేటుగా చెబుతారు. గ్రామాల్లో స్త్రీ, పురుష శిశు మరణాల్లో వ్యత్యాసం తగ్గినా, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల మరణాల రేటు కొద్దిగా అధికంగానే ఉంది. ప్రతి శిశువుకూ జీవించే, చుట్టూ ఉన్న వనరులను ఆస్వాదించే హక్కు ఉంటుంది. లింగదుర్విచక్షణ అమ్మాయిల పాలిట శాపంగా మారుతోంది. ఇది కడుపులో ఉన్నప్పటి నుంచే మొదలవుతోంది. భారత్‌లో ఎంతోమంది ఆడపిల్లలకు స్కూలు, ఉన్నతవిద్య నేటికీ కలే. అబ్బాయిలు కౌమారాన్ని స్వేచ్ఛను ఆస్వాదిస్తోంటే, ఆడపిల్లలకు మాత్రం ఆంక్షలు మొదలవుతాయి. చదువు, ఉద్యోగం, పెళ్లి, సామాజిక సంబంధాలు ప్రతిదానిలోనూ ఇవి కొనసాగుతాయి. తీవ్ర దుర్విచక్షణ పరిస్థితుల్లో పుట్టి ఏడాదైనా దాటకముందే ఎంతోమంది ఆడపిల్లలు కడతేరిపోతున్నారు. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తున్నా, మరింతగా పురోగతి నెలకొనాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా 35:41, బిహార్‌లో 26:29, అస్సామ్‌లో 35:37 చొప్పున పురుష, స్త్రీ ఐఎంఆర్‌ ఉండటం ప్రభుత్వాలు లింగ సమానత్వంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవశ్యకతను తెలియజెబుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌, హరియాణా, పశ్చిమ్‌బెంగాల్‌, గుజరాత్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లలో స్త్రీలతో పోలిస్తే పురుష శిశు మరణాల రేటే అధికంగా ఉంది. 2011లో ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే పురుష, స్త్రీ శిశు మరణాల రేటు సమాన స్థాయిలో ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులూ దాని సరసన చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో పురుష, స్త్రీ ఐఎంఆర్‌ 24:24గా ఉంది. తెలంగాణలో అది 21:22. హరియాణాలో 2011లో పురుష, స్త్రీ ఐఎంఆర్‌ 41:48 నిష్పత్తిలో ఉండేది. 2020 నాటికి అది 29:27కి తగ్గింది. కేరళలో పురుష శిశు మరణాల రేటు అమ్మాయిలతో పోలిస్తే అధికంగా 10:3గా నమోదైంది. 

సరైన చర్యలు

అన్ని రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణంలో శిశు మరణాల రేటు అధికంగా నెలకొంటోంది. దీన్నిబట్టి గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను మరింతగా విస్తరించాల్సిన అవసరాన్ని పాలకులు గుర్తించాలి. మగ, ఆడ శిశు మరణాల రేటు అంతరం పట్టణాల్లో అధికంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లో దశాబ్దం క్రితం పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఆడ శిశు మరణాలు కనిపించేవి. 2020 నాటికి చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మారింది. అమ్మాయిల చదువుకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం, వారిపట్ల ఉన్న చిన్నచూపును, నిర్లక్ష్య ధోరణిని మార్చడంలో తీసుకున్న చర్యలు స్త్రీ శిశు మరణాలు దిగిరావడానికి తోడ్పడ్డాయి. అమ్మాయిల సంక్షేమం, అభివృద్ధి కోసం పాలకులు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. శిశుమరణాల రేటు 20 కన్నా ఎక్కువగా ఉన్న దేశాల్లో, స్త్రీ, పురుష ఐఎంఆర్‌ దాదాపు సమానంగా ఉన్నది భారత్‌లోనే అని ఐక్యరాజ్య సమితి గతంలో వెల్లడించింది. శిశు మరణాలను మరింతగా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రతి అమ్మాయికీ అబ్బాయిలతో సమానంగా జీవితంలో ఎదుగుదలకు సరైన అవకాశాలు దక్కేలా చర్యలు చేపట్టాలి. ప్రసవాల సమయంలో మహిళల భద్రత, పిల్లల ఆరోగ్యాన్ని తరచూ పరీక్షించడం, గర్భిణులకు మెరుగైన ఆహారం అందించడం, శిశు సంరక్షణకు పాలకులు సరైన చర్యలు తీసుకోవడమూ తప్పనిసరి. 

- నీరుకొండ అనూష
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

‣ భాజపా - కాంగ్రెస్‌... మధ్యలో ఆప్‌!

‣ అమెరికా - చైనా చిప్‌ యుద్ధం

‣ కష్టాల సేద్యంలో కర్షకులు

‣ పోటెత్తుతున్న వరదలు

Posted Date: 31-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం