• facebook
  • whatsapp
  • telegram

‘పునరుత్పాదక’ లక్ష్యాలు... సుదూరం!

పర్యావరణ మార్పులపై పోరులో భాగంగా శుద్ధ ఇంధనాల బాట పడుతున్న ఇండియా తాజాగా కీలక మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని మొధేరా దేశంలోని తొలి సంపూర్ణ సౌర విద్యుత్తు వినియోగ గ్రామంగా అవతరించింది. ఓవైపు ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని భయపెడుతుండగా, మరోవైపు వాతావరణంలో ప్రతికూల మార్పులు మానవాళి మనుగడకే సవాలు విసరుతున్నాయి. ఈ దశలో మొధేరా పూర్తిస్థాయి సౌర గ్రామంగా మారడం భారత్‌కు గొప్ప నైతిక బలాన్నిచ్చేదే.

పునరుత్పాదక ఇంధన సామర్థ్య సముపార్జనకు సంబంధించి మన దేశం విధించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రస్తుతం సాధించిన పురోగతి సరిపోదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భవనాలన్నింటిపై సౌర ఫలకాలు ఏర్పాటు కావాలి. పవన, బయోమాస్‌ విద్యుత్తు ప్రాజెక్టులనూ మరింత జోరుగా చేపట్టాలి. అప్పుడే ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నట్లుగా ఇంధన రంగంలో భారత్‌ స్వావలంబన సాధ్యమవుతుంది.

ఇప్పటికీ వెనకబాటే...

దేశంలో 2022 డిసెంబరుకల్లా 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సముపార్జించుకోవాలని 2015లో భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో సౌర, పవన, బయోమాస్‌, చిన్న జలవిద్యుత్‌ ప్రాజెక్టుల వాటా వరసగా 100-60-10-5 గిగావాట్ల చొప్పున ఉండాలని ప్రణాళికలు రచించింది. సంబంధిత పనుల్లో ప్రస్తుత పురోగతిని బట్టి చూస్తే ఈ ఏడాది చివరికల్లా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకొనే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు 116 గిగావాట్ల సామర్థ్యం మాత్రమే మన సొంతమైంది. ఈ విషయంలో మన దేశంతో పోలిస్తే చైనా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే బీజింగ్‌ 17 గిగావాట్ల సామర్థ్యమున్న సౌర ఫలకాలను బిగించింది. ప్రధానంగా ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ట్రాలు శుద్ధ ఇంధనంపై తగినంత దృష్టి సారించకపోవడం ఇండియాకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్య సముపార్జనలో ప్రస్తుత వేగాన్నే కొనసాగిస్తే- 2022కు సంబంధించిన లక్ష్యాలను చేరుకునేందుకే మధ్యప్రదేశ్‌కు మరో యాభై ఏళ్లకుపైగా పడుతుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలే అవసరమవుతాయి. రాజస్థాన్‌, గుజరాత్‌, తెలంగాణ, కర్ణాటక, అండమాన్‌-నికోబార్‌ దీవులు మాత్రం పునరుత్పాదక ఇంధన సామర్థ్య సముపార్జన లక్ష్యాలను నిర్దేశిత గడువు కంటే కొన్ని నెలల ముందుగానే అందుకొని భేష్‌ అనిపించుకున్నాయి. సౌర విద్యుదుత్పత్తిలో ఫలకాలు అత్యంత కీలకం. వాటి తయారీకి అవసరమైన సోలార్‌ మాడ్యూళ్లు, సెల్‌ల ఉత్పత్తి ఇండియాలో అంతంతమాత్రమే. ఇప్పటికీ గణనీయ స్థాయిలో సోలార్‌ సెల్‌లను మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా వాటి తయారీని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దిగుమతులపై సుంకం విధిస్తుండగా, ఆ పరిణామం సౌర ఫలకాల బిగింపు నెమ్మదించడానికి కారణమైంది. పవన విద్యుదుత్పత్తి సామర్థ్య సముపార్జనలోనూ కొన్నాళ్లుగా పురోగతి లేదు. భూ లభ్యత సహా పలు అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన విధానాలను రూపొందించకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. సౌర విద్యుత్తును కేవలం పగటి వేళల్లో ఉత్పత్తి చేయగలమని, పవన విద్యుత్తును రాత్రుళ్లూ కొనసాగించవచ్చని గుర్తుచేస్తున్నారు. అంతరాయాల్లేని విద్యుత్‌ సరఫరాకు అది దోహదపడుతుందని సూచిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పవన విద్యుత్‌ సామర్థ్య సముపార్జనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు- జల విద్యుత్తును అంతర్జాతీయంగా పునరుత్పాదక ఇంధనంగానే పరిగణిస్తున్నా... పర్యావరణ, సామాజికపరమైన ఆందోళనల కారణంగా మన దేశం దాన్ని ఆ జాబితా నుంచి తొలుత పక్కనపెట్టింది. మూడేళ్ల క్రితం తిరిగి జల విద్యుత్‌ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన వర్గంలో చోటుకల్పించారు. శుద్ధ ఇంధన రంగంలో విధించుకున్న లక్ష్యాల సాధనలో ఇది ఇండియాకు కలిసివచ్చే అంశమే. ఇక సాగు విస్తీర్ణం భారీగా ఉన్న మన దేశంలో ఏటా 50 కోట్ల టన్నుల బయోమాస్‌ తయారవుతుంటుంది. అందులో కొంతభాగాన్ని ఇప్పటికే వినియోగించుకుంటున్నా, మిగులు మొత్తాన్నీ సద్వినియోగం చేసుకోగలిగితే అదనంగా మరింత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సముపార్జించుకోవచ్చని అంచనా. దేశంలో ఉన్న చక్కెర కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలను సరిగ్గా వినియోగించుకుంటే మరో ఎనిమిది గిగావాట్ల సామర్థ్యం మన ఖాతాలో చేరే అవకాశం ఉంటుంది.

సమన్వయం అవసరం

ఇప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిపైనే ఇండియా అతిగా ఆధారపడుతోంది. 2021-22లో దేశంలో మొత్తం విద్యుదుత్పత్తిలో థర్మల్‌ ప్లాంట్ల వాటాయే 75 శాతంగా ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పర్యావరణంలో ప్రతికూల మార్పులను అడ్డుకోవాలన్నా, ఇంధన రంగంలో భారత్‌ స్వావలంబన సాధించాలన్నా ఈ పరిస్థితి మారాలి. ఇందుకోసం జాతీయ సంకల్ప భాగస్వామ్యా(ఎన్‌డీసీ)ల పేరుతో 2015లోనే దేశం లక్ష్యాలు నిర్దేశించుకుంది. సవరించిన ఎన్‌డీసీల ప్రకారం- 2070 కల్లా నెట్‌ జీరో (గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల స్థాయి, వాతావరణం నుంచి వాటిని తొలగించే సామర్థ్యం సమానంగా ఉండటం) దేశంగా అవతరించాలన్నది భారత్‌ లక్ష్యం. 2030కల్లా దేశ విద్యుదుత్పత్తిలో 50 శాతం శిలాజేతర వనరుల నుంచే రావాలని భావిస్తోంది. ఈ లక్ష్యాలను అందుకోవాలంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం అవసరం. హరిత ఇంధన ప్రాజెక్టుల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా భారీగా పెట్టుబడులను సమీకరించాలి. నిజానికి ఈ రంగంలో భారత్‌ తన లక్ష్యాలను చేరుకోవాలంటే ఏటా భారీస్థాయిలో పెట్టుబడులు అవసరం. కానీ ప్రస్తుతం సాధిస్తున్న పెట్టుబడులు తక్కువే. ఇందుకోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి. భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన భూములను పారదర్శకంగా కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. మొధేరాను ఆదర్శంగా తీసుకొని ఇళ్లపై సౌర ఫలకలను అమర్చుకోవడం ద్వారా పౌరులూ తమవంతుగా చేయూత అందించాలి. అలా చేయగలిగితే పునరుత్పాదక ఇంధన సామర్థ్య సముపార్జనకు సంబంధించి మన దేశం విధించుకున్న లక్ష్యాలను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాబోదు.

మందగించిన పురోగతి

భారత్‌ 2030 కల్లా 450 గిగావాట్ల శుద్ధ ఇంధన సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని చేరుకోవాలంటే కొత్తగా నెలకు కనీసం 3.7 గిగావాట్ల సామర్థ్యం చొప్పున జత చేసుకుంటూ వెళ్ళాలి. కానీ 2019 ఏప్రిల్‌ నుంచి ఇండియాలో ఆ సగటు వేగం నెలకు 0.9 గిగావాట్లే ఉంది. నిజానికి సౌర విద్యుత్‌ విషయంలో కొన్నేళ్లు పురోగతి బాగానే ఉన్నా, ఇటీవల మందగించింది.

- మండ నవీన్‌ కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాటల్లోనే... సమానత్వం

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

‣ భాజపా - కాంగ్రెస్‌... మధ్యలో ఆప్‌!

‣ అమెరికా - చైనా చిప్‌ యుద్ధం

‣ కష్టాల సేద్యంలో కర్షకులు

‣ పోటెత్తుతున్న వరదలు

Posted Date: 31-10-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం