• facebook
  • whatsapp
  • telegram

అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

చమురు ఉత్పత్తిని తగ్గించాలన్న సౌదీ అరేబియా నిర్ణయం అగ్రరాజ్యానికి ఏమాత్రం మింగుడుపడటం లేదు. దాంతో ఆ రెండు దేశాల సంబంధాలు అడకత్తెరలో పడ్డాయి. మరోవైపు ‘బ్రిక్స్‌’లో చేరాలని సౌదీ ఆసక్తి చూపుతున్నట్లు వెలువడుతున్న కథనాలు అమెరికాను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా ఆర్థిక స్తోమతను దెబ్బతీయడానికి చమురు ధరలపై పరిమితి విధించాలని అమెరికా పట్టుబడుతోంది. అదే సమయంలో చమురు ధరలను పెంచడానికి రష్యాతో కలిసి చమురు ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. ఇది అమెరికా వ్యూహానికి శరాఘాతంలా మారింది. చమురు ఉత్పత్తి తగ్గిస్తే ధరలు పెరిగి రష్యాకు మరింత ఆదాయం వస్తుంది. నవంబరులో అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్‌) మధ్యంతర ఎన్నికలు జరగనుండటంతో సౌదీ వైఖరి బైడెన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి తలనొప్పిలా తయారైంది. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్‌) నాయకత్వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాతో తమ సంబంధాలను పునఃపరిశీలిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు. దీంతో దశాబ్దాల నుంచి పటిష్ఠంగా కొనసాగుతున్న అమెరికా-సౌదీ బంధం భవితవ్యం ఏమిటనే ప్రశ్న బలంగా ముందుకొస్తోంది. చరిత్రాత్మకమైన తమ సంబంధాలు ఇప్పటికీ పటిష్ఠంగా ఉన్నాయని వాషింగ్టన్‌లో సౌదీ రాయబార కార్యాలయం ప్రకటించింది.

డాలర్‌ ఆధిపత్యానికి గండి

సౌదీ అరేబియా బ్రిక్స్‌ కూటమిలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ప్రకటించడం మరోవైపు కొత్త ప్రకంపనలు పుట్టించింది. అదే జరిగితే, డాలర్‌ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన మొదలైంది. ఎందుకంటే, అన్ని దేశాలూ సౌదీ నుంచి డాలర్లలోనే చమురు కొనేలా గతంలో ఒప్పందం కుదిరినప్పటి నుంచి అమెరికా ఆర్థిక పాటవం ప్రపంచమంతటినీ శాసించసాగింది. ఇప్పుడు డాలర్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి రష్యా, చైనా కంకణం కట్టుకున్నాయి. బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన బ్రిక్స్‌లో సౌదీ అరేబియా నిజంగానే చేరితే అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా తనకున్న విలువను డాలర్‌ కోల్పోతుంది.

సౌదీ అరేబియా ఇప్పటికే చమురు ఉత్పత్తిలో కోత విధించాలని రష్యాతో కలిసి నిర్ణయించింది. దీంతో సౌదీ ఉద్దేశాలపై సందేహాలు మొదలయ్యాయి. నవంబరు నుంచి చమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల పీపాల మేరకు తగ్గించాలని ఒపెక్‌ ప్లస్‌ కూటమి అక్టోబరు అయిదో తేదీన నిర్ణయించింది. ఇటీవలి వారాల్లో అంతర్జాతీయ విపణిలో పడిపోతున్న చమురు ధరలను తిరిగి పెంచడానికి ఈ నిర్ణయం దారితీస్తుంది. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒపెక్‌లో 13 దేశాలు, రష్యాతోపాటు దాని నాయకత్వంలోని 10 చమురు ఉత్పత్తి దేశాలను కలిపి ఒపెక్‌ ప్లస్‌గా వ్యవహరిస్తున్నారు. సౌదీ అరేబియా ఇంతకుముందు అంతర్జాతీయ చమురు ధరలను తగ్గించాలంటే ఉత్పత్తిని ఎక్కువ చేసేది. ధరలను పెంచాలంటే ఉత్పత్తిని తగ్గించేది. అందుకే సౌదీని మార్కెట్‌ పరిభాషలో ‘స్వింగ్‌ ప్రొడ్యూసర్‌’ అనేవారు. చాలా ఏళ్ల నుంచి సరిగ్గా పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల అత్యవసరంగా చమురు ఉత్పత్తిని పెంచే సత్తాను సౌదీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, నైజీరియా, అంగోలాలు ఇప్పటికే కోల్పోయాయి. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో సౌదీ స్వింగ్‌ ప్రొడ్యూసర్‌ పాత్ర నుంచి తప్పుకొంది. అధిక ఆదాయం కోసం చమురు ఉత్పత్తిని తగ్గించి, ధరలు ఎక్కువగా ఉండేలా చూసింది. ఒపెక్‌ ప్లస్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా ఉండాలంటే పీపా చమురు ధరను 90 డాలర్ల వద్ద పట్టి నిలపక తప్పదు. అమెరికా చెప్పినట్లు రష్యా చమురు ధరకు పరిమితి విధిస్తే, రేపు అదే అస్త్రాన్ని తన మీదా ప్రయోగించే అవకాశం ఉందని సౌదీ భయం. అందుకే రష్యాతో కలిసి ఉత్పత్తిని తగ్గించి ధరలు ఎక్కువగా ఉండేలా చూసుకోదలచింది.

ఆర్థిక వ్యవస్థ రక్షణకు...

ఆర్థిక కారణాలు రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్నా సౌదీ, అమెరికా సంబంధాలు తెగతెంపులవుతాయని చెప్పలేం. అమెరికా ఆయుధాలకు అతిపెద్ద కొనుగోలుదారు సౌదీ అరేబియాయే. 2009-2020 మధ్య భారీయెత్తున అమెరికన్‌ ఆయుధాలను సౌదీ కొనుగోలు చేసింది. సౌదీ తన వద్ద ఉన్న మిగులు డాలర్‌ నిల్వలను అమెరికా బాండ్ల కొనుగోలుకు వెచ్చిస్తోంది. సౌదీ భద్రత కోసం అక్కడ అమెరికన్‌ సైనికులను సదా సన్నద్ధంగా ఉంచుతున్నారు. తన బద్ధశత్రువు ఇరాన్‌కు అమెరికా చేరువయ్యే అవకాశాలు సౌదీకి ఆమోదయోగ్యంగా ఉండటం లేదు. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఇరాన్‌ డ్రోన్లు సరఫరా అవుతున్నాయి. బ్రిక్స్‌లో చేరాలని ఇరాన్‌ దరఖాస్తు సైతం పెట్టుకుంది. కాకపోతే, ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు కాబట్టి రష్యాతో సౌదీ, ఇరాన్‌లు ఏకకాలంలో దోస్తీ చేయడం కష్టమనే చెప్పాలి. బహుశా అమెరికాపై ఒత్తిడి పెంచడానికి, సొంత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి మాత్రమే సౌదీ పాలకులు ప్రస్తుతానికి రష్యాతో చేతులు కలుపుతున్నట్లుంది.

- కైజర్‌ అడపా
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

‣ ఐరోపాను బెంబేలెత్తిస్తున్న జీవనవ్యయం

‣ ‘పునరుత్పాదక’ లక్ష్యాలు... సుదూరం!

‣ మాటల్లోనే... సమానత్వం

‣ సమితి ప్రక్షాళన... విశ్వశాంతికి ఆవాహన!

Posted Date: 31-10-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం