• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్కూలు నుంచే సైన్యంలోకి!

ఏఐఎస్‌ఎస్‌ఈఈ - 2023 ప్రకటన విడుదల

రక్షణ రంగంలో సేవలందించాలనే లక్ష్యం కొంతమంది విద్యార్థులకు చిన్నతనంలోనే ఏర్పడుతుంది. అలాంటి వారి ఉజ్వల భవిష్యత్తుకు ఉత్తమ వేదికగా నిలుస్తున్నాయి సైనిక్‌ స్కూళ్లు. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోవచ్చు. చదువుతోపాటు రక్షణ రంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. వ్యక్తిగత క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సైనిక్‌ స్కూల్‌ విద్యార్థులు యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈ, ఇతర డిఫెన్స్‌ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఎక్కువ. వచ్చే విద్యాసంవత్సరంలో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ) - 2023 ప్రకటన వెలువడింది. ఆ వివరాలు చూద్దాం...

సైనిక స్కూళ్ల ప్రవేశ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయి. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 18 స్కూళ్లు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నాయి. వీటిలో ప్రవేశానికీ పరీక్ష తప్పనిసరి.

6వ తరగతిలో ప్రవేశానికి

పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. ఇందులో 125 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు. జీకే (సైన్స్, సోషల్‌) 25, లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌/ తెలుగు/ హిందీ.. నచ్చిన భాష ఎంచుకోవచ్చు) 25, ఇంటెలిజెన్స్‌ 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. సీబీఎస్‌ఈ ఐదో తరగతి సిలబస్‌ నుంచి ఈ ప్రశ్నలు ఉంటాయి. తెలుగు మాధ్యమంలోనూ పరీక్ష రాసుకోవచ్చు. 

9వ తరగతిలో ప్రవేశానికి

400 మార్కులకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. మ్యాథ్స్‌లో 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌ సైన్స్‌ ఒక్కో విభాగం నుంచీ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. సీబీఎస్‌ఈ ఎనిమిదో తరగతి సిలబస్‌ నుంచి వీటిని అడుగుతారు. 

రెండు తరగతుల ప్రవేశాలకు సంబంధించి పరీక్ష సిలబస్‌ వివరాలు ప్రకటించారు. సబ్జెక్టులవారీగా ఆ పాఠ్యాంశాలను చదువుకుంటే సరిపోతుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. వాటికి సమాధానాలను ఓఎంఆర్‌ పత్రంపై గుర్తించాలి. పరీక్షలో అర్హత సాధించడానికి ఆయా సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే మొత్తం మీద 40 శాతం మార్కులు పొందాలి. ఇలా అర్హత మార్కులు సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో సీటుకు ముగ్గురుని చొప్పున వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. అందులో విజయవంతమైనవారిని ఆరు, తొమ్మిదో తరగతుల్లో చేర్చుకుంటారు. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు.  

లాభాలివీ...

దేశంలో ప్రభుత్వ నియామకాల్లో సింహభాగం రక్షణ రంగంలోనే ఉంటున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులతోపాటు సీఏపీఎఫ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ...తదితర విభాగాల్లో క్రమం తప్పకుండా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఎక్కువ నియామకాలు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో జరుగుతున్నాయి. యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ వీటిలో అత్యంత ముఖ్యమైనది. అలాగే ఆర్మీలో గ్రూప్‌ ఎక్స్, వై. నేవీలో సెయిలర్‌-ఎంఆర్, ఎస్‌ఎస్‌ఆర్, ఏఏ. ఎయిర్‌ ఫోర్స్‌లో ఎయిర్‌ మెన్‌ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు ఇంటర్‌ విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. ఈ ప్రకటనలన్నీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వెలువడుతున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకున్నవారికి హైస్కూల్‌ నుంచే సరైన శిక్షణ ఉంటే సులువుగా విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ పరీక్షల్లో సైనిక పాఠశాల నేపథ్యం ఉన్న విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. రక్షణ రంగంలో ఉన్నత స్థాయిలో పనిచేసినవారు ఈ స్కూళ్లను పర్యవేక్షిస్తున్నారు. చదువుతోపాటు అవసరమైన శిక్షణ అందిస్తున్నారు. క్రీడలు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వానికి ప్రాధాన్యముంటుంది. ఈ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ బోధన అందిస్తారు. ఆరో తరగతిలో ప్రవేశానికి బాలికలూ దరఖాస్తు చేసుకోవచ్చు. తొమ్మిదిలో చేరడానికి బాలురకే అవకాశం ఉంది. 

ఎంపిక

ఆఫ్‌లైన్‌ పరీక్షలో చూపిన ప్రతిభ, మెడికల్‌ టెస్టుల ఆధారంగా. 

సీట్లు.. ఫీజు

మొత్తం సీట్లలో 67 శాతం ఆ సైనిక్‌ స్కూల్‌ ఉన్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారికి దక్కుతాయి. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. వీటిలో 58 బాలురకు, 10 బాలికలకు కేటాయించారు. అలాగే తొమ్మిదిలో 22 సీట్లు ఉన్నాయి. కలికిరి సైనిÚ్ స్కూల్‌లో ఆరో తరగతిలో 70 సీట్లు ఉన్నాయి. వీటిలో 60 బాలురకు, 10 బాలికలకు కేటాయించారు. తొమ్మిదిలో 30 సీట్లు ఉన్నాయి. ఈ రెండు పాఠశాలల్లోని 67 శాతం సీట్లకు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడవచ్చు. సైనిక స్కూళ్లలో చేరిన విద్యార్థులు ఫీజు చెల్లించాలి. బోధన, వసతి, భోజనం అన్నీ కలిపి ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు అవసరమవుతాయి. అయితే మెరిట్‌ విద్యార్థులు, అల్పాదాయ వర్గాలకు ఆయా రాష్ట్రాలు స్కాలర్‌షిప్పు అందించడం లేదా ఫీజు నుంచి మినహాయించడం చేస్తున్నాయి. దేశంలో కొత్తగా మొదలవుతున్న వాటిలో ఏపీలో ఆదానీ వరల్డ్‌ స్కూల్‌ నెల్లూరులో ఉంది. ఇందులో ఆరో తరగతిలోకి 50 సీట్లు కేటాయించారు. 

అర్హత

ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. అలాగే మార్చి 31, 2023 నాటికి వయసు 10 నుంచి 12 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2011 - మార్చి 31, 2013 మధ్య జన్మించినవారు అర్హులు. తొమ్మిదిలో చేరాలనుకున్నవారు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. వయసు మార్చి 31, 2023 నాటికి 13 నుంచి 15 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 2008 - మార్చి 31, 2010 మధ్య జన్మించినవారు అర్హులు. 

దరఖాస్తులు: నవంబరు 30 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. 

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.500. మిగిలిన అందరికీ రూ.650.

పరీక్ష తేదీ: జనవరి 8 

పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో... హైదరాబాద్, కరీంనగర్‌. 

వెబ్‌సైట్‌: https://aissee.nta.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

‣ విద్యకు విదేశీ సొబగులు

‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

Posted Date : 01-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌