• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

ఉచితంగా ఉద్యోగ నైపుణ్యాలు పెంచుకునే మార్గాలు

విద్య, ఉద్యోగం... ఎందులోనైనా సరే అభివృద్ధిపథంలో అడుగులు వేయాలంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా నిరంతర సాధన అవసరం. అది ఒక విద్యార్థిగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు... ఒక ఉద్యోగిగా సంస్థలో మరింత ఉన్నతి సాధించేందుకు బాటలు వేస్తుంది. ఈ ఆలోచనతోనే ఇప్పుడు చాలామంది రెగ్యులర్‌ డిగ్రీలకు అదనంగా వివిధ కోర్సులు చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ కోర్సులు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నాయి. అందులోనూ వీటిని ఉచితంగా అందిస్తున్న ప్లాట్‌ఫామ్‌లతో విద్య, ఉద్యోగంలో మరింత ముందుకు వెళ్లగలం. అలాంటి వాటిలో మేలైన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకుందామా...

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో దేన్నయినా ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం అనే అంశానికి బాగా ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఈ వేదికలకూ మరింత ఆదరణ లభిస్తోంది. అయితే వందలకొద్దీ కోర్సులు లభించే వీటిలో... మన అవసరానికి తగినవాటిని, ఆసక్తిని ప్రతిబింబించేవాటిని ఎంచుకోవడం చాలాముఖ్యం. ఎక్కడ ఏయే అంశాలు/ కోర్సులను ఎలా బోధిస్తున్నారనేది తెలుసుకోవడం కూడా ప్రధానమే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ కోర్సులు ఎంచుకునే విషయంలో గుర్తింపును పరిగణనలోకి తీసుకోవడం మెరుగైన పద్ధతి. నిర్దేశిత గుర్తింపు ఉన్న సంస్థల కోర్సులు ఎంచుకుని చదువుకుంటే తగిన ప్రయోజనం ఉంటుంది.

ఎన్నో అంశాలు...

ఈ సంస్థల్లో అచ్చంగా కోర్సుల బోధనకే స్థాపించినవి, ప్రభుత్వంతో అనుసంధానమై పనిచేసేవి, దిగ్గజ కంపెనీలకు అనుబంధంగా నడిచేవి... ఇలా అన్నీ ఉన్నాయి. వీటి ద్వారా ప్రపంచంలో ఏ సబ్జెక్టు గురించైనా నేర్చుకునే అవకాశం ఉంది. మ్యాథ్స్, సైన్స్, ఎకనామిక్స్, కంప్యూటింగ్, హెల్త్‌కేర్, ఏఐ, సోషల్‌ మీడియా మార్కెటింగ్, డేటా సంబంధిత సబ్జెక్టులు... ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆయా సంస్థలు కొన్ని కోర్సులను ఉచితంగా నేర్పిస్తుండగా.. మరికొన్నింటికి కొంత రుసుము వసూలు చేస్తున్నాయి. రోజులు - వారాల వ్యవధి నుంచి ఏడాది కాల వ్యవధి వరకూ ఈ కోర్సులున్నాయి.

స్వయం

ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ పోర్టల్‌. ఇక్కడ ఏ అంశం గురించైనా లెక్కకు మించి కోర్సులు చదువుకోవచ్చు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పోర్టల్‌ కావడంతో ఇందులో చదివినవారికి విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యం దక్కుతుంది. ధ్రువపత్రానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రాక్టికల్‌ స్కిల్‌ ఆధారిత కోర్సులైన అడ్వాన్స్‌డ్‌ సీ++, ఇన్‌కం ట్యాక్స్, లా అండ్‌ ప్రాక్టీస్‌ వంటి ఎన్నో అంశాలు చదువుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://swayam.gov.in/

ఫ్యూచర్‌లెర్న్‌..

ఐటీ, సాఫ్ట్‌వేర్‌.. ఈ రంగాలకే కాకుండా సంప్రదాయ కోర్సులు చేసే వారికి ఉపయోగపడే ప్లాట్‌ఫామ్‌ ఇది. ప్రముఖ యూనివర్సిటీలతో అనుసంధానమై పనిచేస్తోంది. వాటి అధ్యాపకుల ద్వారా విభిన్న రంగాలకు చెందిన అంశాలను ఇందులో నేర్చుకోవచ్చు. బిజినెస్, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్, ఆర్ట్స్, మీడియా వంటి రంగాల్లో రాణించాలనుకునే వారికి ఇది చక్కని వేదిక. కొన్ని కోర్సులు ఉచితంగా లభించే ఈ ప్లాట్‌ఫామ్‌ను అపరిమితంగా వినియోగించాలి అనుకుంటే కొంత నెలవారీ రుసుము చెల్లించాలి. 

వెబ్‌సైట్‌: https://www.futurelearn.com/

మైక్రోసాఫ్ట్‌ లెర్న్‌..

మైక్రోసాఫ్ట్‌ అందించే సర్టిఫికెట్‌ కోర్సులు చేయాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఇంజినీర్, డేటా ఇంజినీర్, డేటా అనలిస్ట్, డెవలపర్‌ వంటి పలు కెరియర్‌ ప్రాధాన్యం గల కోర్సులు చేసే అవకాశం ఉంది. కోర్సు స్థాయిని బిగినర్, అడ్వాన్స్‌డ్‌గా విభజించారు. అభ్యర్థి తనకున్న పరిజ్ఞానం బట్టి ఎందులో చేరాలో నిర్ణయించుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://learn.microsoft.com/en-gb/

సెమ్‌రష్‌ అకాడమీ

ప్రస్తుతం సోషల్‌ మీడియా ఎంతో కీలకంగా మారింది. దీని ఆధారంగా ఉద్యోగాలూ పెద్దసంఖ్యలో లభిస్తున్నాయి. ఈ కొత్తతరహా ఉద్యోగాలను ఎలా అందుకోవచ్చో సెమ్‌రష్‌ అకాడమీలో నేర్చుకోవచ్చు. ఇదేకాక చాలా నూతన అంశాలపై కోర్సులు నడిపిస్తున్న దీనిలో చేరేందుకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు. చాలావరకూ కోర్సులు ఎలాంటి ఫీజూ లేకుండానే చేసే అవకాశం ఉంది. ఎస్‌ఈవో, కంటెంట్‌ మార్కెటింగ్‌ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నారు. 

వెబ్‌సైట్‌: https://www.semrush.com/

ఉడాసిటీ

డిజిటల్‌ టెక్నాలజీ రంగాలైన డేటా సైన్స్, ఎంఎల్, క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ వంటి అనేక అంశాల్లో నైపుణ్యలేమిని పూరించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెబుతోందీ సంస్థ. కోర్సు చేసిన వెంటనే ఉద్యోగం సాధించేలా ‘జాబ్‌ రెడీ డిజిటల్‌ స్కిల్‌ కోర్సుల’ను ఈ ప్లాట్‌ఫామ్‌ అందిస్తోంది. డిజిటల్‌ ఫ్రీలాన్సింగ్‌ వంటి కొన్ని కోర్సులు ఇందులో ఇప్పటికే మంచిపేరు సంపాదించాయి.

వెబ్‌సైట్‌: https://www.udacity.com/

లింక్డిన్‌ లెర్నింగ్‌ 

చాలామందికి లింక్డిన్‌ ప్రొఫైల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థగానే తెలుసు. అయితే ఇందులోనూ వివిధ నైపుణ్యాలపై కోర్సులు నేర్పిస్తున్నారు. దీన్ని ఒక నెల వరకూ ఉచితంగా ఉపయోగించుకుని, ఆపైన వాడుతున్న తీరునుబట్టి కొంత సబ్‌స్క్రిప్షన్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది. బిజినెస్, టెక్నాలజీ, క్రియేటివ్‌ అనే విభాగాలను ఏర్పాటుచేసి పదుల కొద్దీ కోర్సులను అందుబాటులో ఉంచిందీ సంస్థ. అంశాలను లోతుగా చర్చిస్తూ, ప్రతి చిన్న విషయాన్నీ చర్చించేలా వీటిని రూపొందించింది. 

వెబ్‌సైట్‌: https://www.linkedin.com/

గ్రో విత్‌ గూగుల్‌

గూగుల్‌ సంస్థ తరఫున అందిస్తున్న కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. డిజైనింగ్‌ రంగానికి ఇప్పుడు ఎంతో డిమాండ్‌ ఉంది. దాన్ని ఇక్కడ సులభంగా నేర్చుకునేలా అవకాశం కల్పించారు. వ్యక్తులకే కాక, సొంతంగా మొదలైన చిన్న వ్యాపారాలకూ ఇందులో కోర్సులు ఉన్నాయి. అంటే ఉద్యోగాలు చేయాలి అనుకునేవారే కాకుండా, వ్యాపారాలు చేయాలి అనుకునే వారూ ఎన్నో విలువైన విషయాలు దీని ద్వారా నేర్చుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://tinyurl.com/yckxac4r

సింప్లీలెర్న్‌

విశ్వవిద్యాలయాలతోనే కాకుండా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ బ్లూప్రింట్‌ వంటి కంపెనీలతోనూ కలిసి పనిచేస్తోందీ సంస్థ. తద్వారా కెరియర్‌ ఓరియంటెడ్‌ కోర్సులు అందిస్తోంది. డిజిటల్‌ మార్కెటింగ్, ఫుల్‌స్టాక్‌ జావా డెవలప్‌మెంట్‌ అంశాలతోపాటు బిజినెస్‌ అనలిటిక్స్, అప్లయిడ్‌ డేటా సైన్స్‌ విత్‌ పైతాన్, పవర్‌ బీఐ, డేటా అనలిటిక్స్‌ వంటి వివిధ కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంది. 

వెబ్‌సైట్‌: https://www.simplilearn.com/

ఖాన్‌ అకాడమీ 

ఇది లాభార్జన లేకుండా కేవలం విద్యాసముపార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ. ఇందులో ప్రీ రికార్డెడ్‌ వీడియో క్లాసులు లభిస్తాయి, లేదా నిర్దేశిత సమయంలో ఒకేసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు బోధిస్తుంటారు. ఈ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని కోర్సులు వ్యక్తిగత పర్యవేక్షకుల సాయంతో నేర్చుకునే అవకాశం కూడా ఉంది. గణితం, సైన్స్, ఎకనమిక్స్, ఆర్ట్స్, హిస్టరీ, కంప్యూటింగ్‌ వంటి పలు కోర్సులు ఇందులో పూర్తిస్థాయిలో నేర్చుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://www.khanacademy.org/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యకు విదేశీ సొబగులు

‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

Posted Date : 01-11-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌