• facebook
  • whatsapp
  • telegram

చమురు ధరల పోటుతో భారత్‌కు తీరని చేటు

చమురు ధరలు పెరిగినప్పుడల్లా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంవల్ల ధరలు త్వరలో పీపాకు 140 డాలర్లకు చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ చమురు అవసరాల్లో 86 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్న భారతదేశానికి దిగుమతుల బిల్లు, దాంతోపాటే కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరిగిపోనున్నాయి. ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువై   నప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చనే ఆందోళనా వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది మొదట్లో పీపా చమురు ధర 130 డాలర్లకు చేరినా సెప్టెంబరులో 85 డాలర్లకు తగ్గింది. కొవిడ్‌వల్ల చమురుకు గిరాకీ తగ్గి ధరలు పడిపోయాయి. ఇప్పుడు గిరాకీ పెరుగుతున్నందువల్ల నవంబరు నుంచి ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల పీపాల మేర తగ్గించాలని ‘ఒపెక్‌ ప్లస్‌’ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా గిరాకీకి తగిన సరఫరా లేక ధరలు పైపైకి పోనున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దుర్వార్త. యావత్‌ ప్రపంచానికీ ద్రవ్యోల్బణ భయాన్ని పెంచుతోంది. భారత్‌ దిగుమతి చేసుకునే చమురు ధర పీపాకు 10 డాలర్ల చొప్పున పెరిగితే కరెంటు ఖాతా లోటు 1400 కోట్ల నుంచి 1500 కోట్ల డాలర్ల వరకు పెరుగుతుంది. అది జీడీపీలో 0.4 శాతానికి సమానం. కరెంటు ఖాతా లోటు ఎక్కువగా ఉంటే, అంటే దిగుమతులు పెరిగితే ఆ బిల్లులు చెల్లించడానికి డాలర్లు కావాలి. దానికోసం రిజర్వు బ్యాంకు ఇదివరకటికన్నా ఎక్కువ రూపాయలు పోసి డాలర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఫలితంగా డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుంది. రూపాయి విలువ పడిపోతే ఏవో కొన్ని రంగాలు మినహా యావత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల ఫలితాలను చవిచూడవలసి వస్తుంది. చమురు ధర 10శాతం పెరిగితే భారత్‌లో టోకు ధరల సూచీ 0.9శాతం పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ లెక్కగట్టింది. ఫలితంగా వినియోగ ధరలూ పెరుగుతాయి. ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతం లోపు కట్టడి చేయాలన్న రిజర్వు బ్యాంకు సంకల్పం నెరవేరడం కష్టమవుతుంది.

కోసుకుపోనున్న ఆదాయం

పీపా చమురు ధర 10 డాలర్ల మేర పెరిగితే జీడీపీ వృద్ధి రేటు 10 బేసిస్‌ పాయింట్లు కోసుకుపోతుంది. కొవిడ్‌ విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న భారతదేశానికి ఇది చేదు వార్త. 2022లో పీపా చమురు ధర 77.31 డాలర్లుగా, 2023లో 71.29 డాలర్లుగా ఉంటుందని ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ అంచనావేసింది. చమురు ధర 70-75 డాలర్ల మధ్య ఉంటుందని భారత ఆర్థిక సర్వే కూడా భావించింది. కానీ ఇప్పుడు చమురు ధర 93 డాలర్లకు చేరింది. అది 100 డాలర్లను మించితే భారత్‌లో ద్రవ్యోల్బణం అదనంగా 52 నుంచి 65 బేసిస్‌ పాయింట్ల వరకు పెరుగుతుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం  వల్ల పొటాష్‌, యూరియా ఎరువుల ధరలు పెరిగిపోయాయి. రైతులకు ఉపశమనంగా ప్రభుత్వం ఎరువుల సబ్సిడీని పెంచితే అదనపు ఆర్థిక భారం పడుతుంది. ఈ అనుకోని ఖర్చులను తట్టుకోవడానికి బడ్జెట్‌లో మార్పుచేర్పులు చేయాల్సి వస్తుంది. అందుకే భారత జీడీపీ వృద్ధిరేటు ముందనుకున్నదానికన్నా తక్కువగా ఉండబోతోంది. 2022-23లో భారత్‌ వృద్ధి రేటు 10.3శాతంగా ఉంటుందని లోగడ అంచనావేసిన ఒక అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, ఇప్పుడు దాన్ని 8.5శాతానికి తగ్గించింది. చమురు దిగుమతుల బిల్లు పెరగడంవల్ల 2022-23 సంవత్సరానికి పన్ను వసూళ్లు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం కోసుకుపోతుంది. అదీకాకుండా ఇటీవలి నెలల్లో విదేశీ సంస్థాగత మదుపరి సంస్థ(ఎఫ్‌ఐఐ)లు భారత్‌లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడం దీనికి ప్రధాన కారణం.

దీర్ఘకాలిక ఒప్పందాలు కీలకం

చమురు ఉత్పత్తిని తగ్గించడం వల్ల సరఫరా తగ్గి ధరలు పెరగడం నిజమే కానీ, అంతర్జాతీయంగా చమురుకు గిరాకీ తగ్గితే ధరలు  దిగిరాకతప్పదు. కొవిడ్‌ తరవాత రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వచ్చిపడినందువల్ల ప్రపంచ దేశాల అభివృద్ధి రేటు మందగించి చమురుకు గిరాకీ తగ్గే సూచనలు బలంగా ఉన్నాయి. చైనా జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోనున్నందువల్ల ఆ దేశం నుంచి చమురుకు గిరాకీ తగ్గనున్నదని అంచనా. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా చమురు దిగుమతులను తగ్గించుకొంటే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు దిగిరాక తప్పదు. అలా జరుగుతుందా లేదా అన్నది అనిశ్చితమే కానీ, చమురు దిగుమతుల బిల్లు పెరిగితే భారత ఆర్థికాభివృద్ధికి బ్రేకులు పడటం మాత్రం ఖాయం. దీన్ని నివారించడానికి భారత్‌- ప్రధాన చమురు ఎగుమతి దేశాలతో దీర్ఘకాల ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తన వ్యూహాత్మక చమురు నిల్వలను బాగా పెంచుకోవాలి. ఆర్థికంగా గడ్డు స్థితిని అధిగమించడానికి భారత్‌ ద్రవ్య సరఫరాను తగ్గించి, వ్యవస్థాపరమైన లోపాలను సరిదిద్దాలని ఐఎంఎఫ్‌ సిఫార్సు చేసింది. పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, నగదు బదిలీలను, మౌలిక వసతులపై పెట్టుబడి వ్యయాన్ని పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవచ్చని సూచించింది. కార్మిక, భూ మార్కెట్లలో సమస్యలను, లోపాలను పరిష్కరించి, విద్యా ప్రమాణాలను పెంచడం ద్వారా వ్యవస్థాగత బలహీనతలను నిర్మూలించాలని తెలియజెప్పింది. మహిళా కార్మిక భాగస్వామ్యాన్నీ పెంచాలని సిఫార్సు చేసింది. ఎన్ని సమస్యలున్నా పటిష్ఠ విధానాలతో వాటిని అధిగమించవచ్చు. ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేయాలి.

తరిగిపోనున్న విదేశ మారకం!

చమురు దిగుమతుల బిల్లు పెరిగినప్పుడు ఆ భారాన్ని వినియోగదారులపై మోపకుండా తానే భరించాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే- అది ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించి వ్యయాన్ని పెంచుతుంది. ఆదాయంకన్నా వ్యయం ఎక్కువైతే విత్త సంబంధ లోటు పెరిగిపోతుంది. అది ఆర్థిక వ్యవస్థకు హానికరం. భారత్‌ వద్ద భారీగా విదేశ మారక ద్రవ్య నిల్వలు ఉండటం వల్ల కష్టకాలాన్ని గట్టెక్కడం సాధ్యమేనని భావించలేం. పెరిగిన చమురు దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరపాలి కాబట్టి ఈ నిల్వలు తరిగిపోనున్నాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణమూ పెరిగి, దాన్ని కట్టడి చేయడానికి రిజర్వు బ్యాంకు వడ్డీ రేటు పెంచాల్సి వస్తుంది. ఫలితంగా పెట్టుబడులకు బ్యాంకు రుణాలు పుట్టక దేశాభివృద్ధి మందగిస్తుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్కూలు నుంచే సైన్యంలోకి!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

‣ విద్యకు విదేశీ సొబగులు

‣ కేసుల కొండపరిష్కారాలకు గుదిబండ

‣ అడకత్తెరలో అమెరికా - సౌదీ సంబంధాలు

‣ ప్రపంచానికి సవాలు రువ్వుతున్న ద్రవ్యోల్బణం

Posted Date: 04-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం