• facebook
  • whatsapp
  • telegram

తరిగిపోతున్న వన్యప్రాణి జనాభా

 

 

గడచిన అయిదు దశాబ్దాల కాలంలో ప్రపంచ వన్యప్రాణి జనాభా మూడింట రెండు వంతులకు పైగా క్షీణించింది. ప్రపంచ వన్యప్రాణి నిధి ‘లివింగ్‌ ప్లానెట్‌-2022’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం- వెన్నెముక కలిగిన క్షీరద, పక్షి, సరీసృప, ఉభయచర జాతుల సంఖ్య సగటున 69శాతం మేర తగ్గిపోయింది. జంతుజాలాన్ని రక్షించాలంటే అన్ని దేశాలు సమైక్య కార్యాచరణకు దిగాలి.

 

వివిధ జంతు జాతులు వాటి పరిసరాల్లోని ఒత్తిళ్లకు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో తెలిపే ఒక సమగ్ర కొలమానమే ‘లివింగ్‌ ప్లానెట్‌’ నివేదిక. వన్యప్రాణుల మనుగడకు- వాటి ఆవాసాలు నాశనం కావడం, శీతోష్ణస్థితి మార్పులు అతిపెద్ద సవాళ్లుగా పరిణమించాయని ఇటీవల విడుదలైన ఆ నివేదిక పేర్కొంది. అరణ్యాల్లో మితిమీరిన మానవ జోక్యం, కాలుష్యం, వ్యాధులు వంటివి ఇతర కారణాలని వెల్లడించింది. మానవుల కారణంగా వాతావరణంలో నెలకొన్న మార్పులు, జీవ వైవిధ్యానికి ముప్పు ముంచుకురావడం- వన్యప్రాణుల భవిష్యత్తుకు ఆందోళనకరంగా పరిణమించాయని వెల్లడించింది. జూలాజికల్‌ సర్వేఆఫ్‌ లండన్‌ సహకారంతో 5,230 జాతుల స్థితిగతులను ప్రపంచ వన్యప్రాణి నిధి అధ్యయనం చేసింది. 2018 సంవత్సరపు గణాంకాల ఆధారంగా ఆ అధ్యయనం జరిగింది. అధ్యయనంలో ఆందోళన రేకెత్తించే పలు అంశాలు వెల్లడయ్యాయి.

 

లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాల్లోని వన్యప్రాణి జనాభా సగటున 94శాతం మేర తగ్గిపోతోంది. ప్రతి సంవత్సరం 2.5శాతం తరుగుదల రేటుతో వన్యప్రాణుల జనాభా క్షీణిస్తోంది. అమెజాన్‌ నదిలోని పింక్‌ రివర్‌ డాల్ఫిన్‌ జనాభా 65శాతం కుదించుకుపోయింది. మాంసం కోసం జరుగుతున్న వేట కారణంగా... కాంగోలోని కహుజి-బీగా జాతీయ పార్కులోని తూర్పు లోతట్టు గొరిల్లాల జనాభా 1994-2019 సంవత్సరాల మధ్య కాలంలో 80శాతం మేర క్షీణించింది. దక్షిణ, పశ్చిమ ఆస్ట్రేలియాల్లో ఉండే సీలయన్‌ జనాభా 1977-2019 సంవత్సరాల మధ్య 64శాతం దాకా తగ్గిపోయింది. వేట, చేపల వలల్లో పట్టుబడటం, సముద్రపు చెత్తలో చిక్కుకుపోవడం, వ్యాధులు వంటి కారణాలతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మంచినీటి ఆవాసాల్లో నివసించే జాతుల జనాభాలు 83శాతం మేర క్షీణించాయి. ఆవాస నష్టం, జల చరాల వలసలను అడ్డుకునే విధంగా నిర్మాణాలను చేపట్టడం వంటివి వాటి జనాభా తరిగిపోవడానికి ప్రధాన కారణాలు. కారు చీకట్లో కాంతిరేఖలా అల్ప సంఖ్యలోనైనా... కొన్ని జాతుల జనాభాలో పురోగతి నెలకొంది. కాంగోలోని వీరూంగా పర్వతాల్లో నివసించే గొరిల్లాల సంఖ్య 2010 సంవత్సరంలో 480. వాటి సంఖ్య 2015-16 నాటికి 604కు పెరిగింది. 2020లో వెలువడిన ప్రపంచ వన్యప్రాణి నిధి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణి నష్టం సగటున 68శాతంగా నమోదైంది. 1998 నుంచి ప్రపంచ వన్యప్రాణి నిధి ‘లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక’ పేరుతో ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ పర్యావరణ ఆరోగ్య పరీక్షా నివేదికను తయారుచేస్తోంది. ఈ నివేదికకు ప్రధానంగా ఆధారమైన లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌ జంతు జనాభాల సంఖ్యల్లో ఏర్పడే తేడాలను కొలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఆవరణ వ్యవస్థల బాగోగులను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. 

 

అడవుల్లో వన్యప్రాణుల ఉనికి, వాటి పాత్ర ఎంతో ముఖ్యమైనవి. అటవీ ఆవరణ వ్యవస్థ, ఆహారపు గొలుసులో భాగంగా ఉంటూ- పునరుత్పత్తిలో, అడవుల అభివృద్ధిలో వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయి. వన్యప్రాణి నష్టం అటవీ నష్టానికి, తద్వారా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. మానవుడితోపాటు జీవజాలమంతటినీ ఈ మార్పులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. మిగిలి ఉన్న అటవీ ఆవరణ వ్యవస్థలను, వన్యప్రాణుల రక్షణను పెంపొందించి, వాటి తరుగుదలను నిరోధించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు... వాటి జనాభా క్రమేపీ పుంజుకొనేందుకు అవసరమైన చర్యలనూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వన్యప్రాణి నిధికి చెందిన అమెరికా ప్రతినిధి కార్టర్‌ రాబర్ట్స్‌ పేర్కొన్నట్లు- వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు భాగస్వామ్యం వహించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. వన్యప్రాణి రక్షణకు అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తక్షణావసరం. ప్రమాదకర స్థాయిలో తరిగిపోతున్న వన్యప్రాణుల జనాభాను పరిరక్షించేందుకు మాంట్రియల్‌లో ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు ‘కాప్‌-15’ పరిష్కారాలను చూపగలదని వన్యప్రాణి ప్రేమికులు ఆశిస్తున్నారు. ఆ సదస్సులో మొక్కలు, జంతువులను కాపాడటానికి ఒక సరికొత్త ప్రపంచ వ్యూహాన్ని చర్చించనున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన కార్యాచరణకు సదస్సు పూనుకొంటేనే ‘కాప్‌-15’ లక్ష్యాలు నెరవేరగలవు. 

 

- జి.ఆర్‌.మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

‣ ఆఫ్రికాబంధం... బహుళ ప్రయోజనకరం!

‣ చమురు ధరల పోటుతో భారత్‌కు తీరని చేటు

‣ స్కూలు నుంచే సైన్యంలోకి!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

Posted Date: 04-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం