• facebook
  • whatsapp
  • telegram

బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ దేశాధినేత లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా విజయం సాధించారు. ఆయన రాకతో బ్రెజిల్‌లో ప్రజాస్వామ్యానికి మేలు చేకూరుతుందని, దేశానికి పూర్వ వైభవం వస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇండియాతో ద్వైపాక్షిక బంధం బలోపేతానికీ ఆయన సముచిత ప్రాధాన్యమిస్తారన్న అంచనాలున్నాయి.

లాటిన్‌ అమెరికా దేశం బ్రెజిల్‌లో ఇటీవలి అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేకెత్తించాయి. హోరాహోరీగా సాగిన పోరులో ప్రస్తుత అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోపై లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా స్వల్ప మెజారిటీతో నెగ్గారు. లూలాగా సుపరిచితులైన ఆయన బ్రెజిల్‌ అధ్యక్ష పీఠం ఎక్కనుండటం ఇది మూడోసారి. గతంలో 2003 నుంచి 2010 దాకా ఆ బాధ్యతలను లూలా నిర్వర్తించారు. వరసగా మూడు దఫాలు అధ్యక్షుడిగా కొనసాగేందుకు బ్రెజిల్‌ చట్టాలు అనుమతించవు. అందువల్లే 2011లో పదవికి ఆయన దూరం కావాల్సి వచ్చింది.

ఒడుదొడుకులను దాటి...

వాస్తవికవాది అయిన లూలా, గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రెజిల్‌లో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పలు సరకులకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. దాన్ని ఆసరాగా చేసుకుని దేశీయంగా ఉత్పాదకతను పెంచడంతోపాటు వ్యాపారానుకూల విధానాలను అనుసరించి దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించారు. బ్రెజిల్‌లో దాదాపు మూడు కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థలను ప్రక్షాళించాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో వర్ధమాన దేశాల వాణికి ప్రాధాన్యం పెరగాలని బలంగా వాదించారు. అధ్యక్ష పీఠాన్ని వీడిన తరవాత లూలా వ్యక్తిగతంగా అనేక ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. గొంతు క్యాన్సర్‌తో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అవినీతి, నగదు అక్రమ చలామణీ అభియోగాలు రుజువు కావడంతో 2017లో ఆయనకు 12 ఏళ్ల జైలుశిక్ష ఖరారైంది. 18 నెలలు కారాగారంలో గడిపిన తరవాత, నిరుడు మార్చిలో శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంతో ఆయన రాజకీయ పునరాగమనానికి మార్గం సుగమమైంది. మరోవైపు అధ్యక్ష పీఠాన్ని లూలా వీడిన తరవాత బ్రెజిల్‌ ఆర్థిక పురోగతి మందగించింది. దేశంలో పుష్కలంగా అందుబాటులో ఉన్న నీటి వనరులు, వ్యవసాయ భూమి, యువ జనాభాను లూలా మాదిరిగా ఇతరులు దేశ ఆర్థిక వృద్ధికి సద్వినియోగం చేసుకోలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఇక కొవిడ్‌ దెబ్బకు బ్రెజిల్‌ విలవిల్లాడింది. దేశంలో దాదాపు ఆరున్నర లక్షలకుపైగా ప్రజలను ఆ మహమ్మారి బలి తీసుకుంది. దానికితోడు బోల్సొనారో హయాములో అమెజాన్‌ అడవుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగిందన్న ఆరోపణలున్నాయి. 2019-2021 మధ్య బ్రెజిల్‌లో 12 వేల చదరపు మైళ్ల అమెజాన్‌ అడవి కనుమరుగైంది. ఫలితంగా ప్రపంచ పర్యావరణానికి తీవ్ర హాని కలిగిందని నిపుణులు వాపోయారు. తన మద్దతుదారులు అమెజాన్‌ అడవుల్లో అక్రమ మైనింగ్‌ చేపట్టేందుకు బోల్సొనారో పరోక్షంగా సహకారం అందించారన్న ఆరోపణలు జోరుగా వినిపించాయి. లూలా పదవిలో ఉన్నప్పుడు అమెజాన్‌ అడవుల కోసం ప్రత్యేకంగా సంరక్షణ నిధిని ఏర్పాటు చేశారు. అమెజాన్‌ అడవుల సంరక్షణపై ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఆయన హామీ ఇచ్చారు. దేశంలో పెరుగుతున్న పేదరికం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూలాంశాలకు ముకుతాడు వేయడమూ లూలా ముందున్న ప్రధాన సవాళ్లు.

భారత్‌తో బంధానికి ప్రాధాన్యం

లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్‌. ఇండియాకు ఆ ప్రాంతంలో అది అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఔషధాలు, గగనతలం, అంతరిక్షం, రక్షణ, పశు సంవర్ధకం, ఇంధనం, ఆటొమొబైల్‌, ఐటీ తదితర రంగాల్లో పరస్పర సహకారంతో ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 2021-22లో బ్రెజిల్‌కు భారత్‌ ఎగుమతుల విలువ దాదాపు రూ.53 వేల కోట్లు. దిగుమతుల వాటా రూ.47 వేల కోట్లు. లూలా పునరాగమనంతో ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ మరింత పెరిగే అవకాశముంది. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దిల్లీతో వ్యూహాత్మక బంధాన్ని కాంక్షిస్తూ అనేక చర్యలు చేపట్టారు. 2004లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2007, 2008ల్లోనూ ఇండియాలో పర్యటించారు. బ్రిక్స్‌కు ఆయన బలమైన మద్దతుదారు. ఇండియా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలతో కూడిన ఐబీఎస్‌ఏ ఫోరాన్ని పటిష్ఠంగా మార్చేందుకూ ప్రయత్నించారు. బ్రెజిల్‌, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఉన్న దక్షిణ అమెరికా వాణిజ్య కూటమి- మెర్కోసుర్‌తో దిల్లీకి ప్రాధాన్య వాణిజ్య ఒప్పందం(పీటీఏ) ఉంది. దాని స్థానంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరితే కూటమితో వాణిజ్య లావాదేవీలు మరింత సులభతరమవుతాయి. ఆ వైపుగా లూలా చొరవ తీసుకోవాల్సి ఉంది. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఆశిస్తున్న ఇండియా వంటి జి-4 సహచర దేశాలతో కలిసి ఐరాసలో సంస్కరణల కోసం బలమైన వాణి వినిపించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో వర్ధమాన దేశాల ప్రయోజనాలను పరిరక్షించే నిర్ణయాలు వెలువడేలా దిల్లీతో కలిసి లూలా పనిచేయాలి.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

‣ ఆఫ్రికాబంధం... బహుళ ప్రయోజనకరం!

‣ చమురు ధరల పోటుతో భారత్‌కు తీరని చేటు

‣ స్కూలు నుంచే సైన్యంలోకి!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

Posted Date: 04-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం