• facebook
  • whatsapp
  • telegram

తైవాన్‌తో ఉపయుక్త బంధం

తయారీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదగాలని భారత్‌ ఆకాంక్షిస్తోంది. ఇండియాలో నెలకొన్న సమస్యలు అందుకు అవరోధంగా నిలుస్తున్నాయి. తైవాన్‌ సహకారంతో భారత్‌ తన ఆకాంక్షను నెరవేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, చైనాలోని చాలా విదేశీ సంస్థలు అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నాయి. పటిష్ఠమైన మౌలిక వసతులు కలిగిన ఇతర దేశాల్లో తమ విభాగాలను ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. భారత్‌ దాన్ని సదవకాశంగా మలచుకోవాలని చూస్తోంది. అయితే, ఇండియాలో రవాణా వ్యయం విపరీతంగా ఉండటం, తయారీ రంగం బలహీనత వంటివి ఆటంకాలుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, భారత్‌లో లాజిస్టిక్‌ (సరకుల బట్వాడా) వ్యయం చాలా అధికం. దానికి తోడు అరకొర రవాణా సౌకర్యాలు, సరైన గిడ్డంగులు లేకపోవడం, అవినీతి, రాజకీయాలు, కఠిన పన్ను విధానాలు వంటివి ఇబ్బందికరంగా పరిణమించాయి.

భారత్‌ జీడీపీలో తయారీ రంగం వాటా 2020-21లో 17.4శాతం. చైనాలో అది 26.8శాతం. ఇటీవలి కాలంలో ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) పెరిగాయి. అవి అధికంగా ఎలెక్ట్రానిక్స్‌ తయారీ సేవలు (ఈఎంఎస్‌), టెలీకమ్యూనికేషన్లు (మొబైల్‌ ఫోన్ల తయారీ) వంటి వాటిలోనే కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా తయారీ గొలుసులను మరింత విస్తృతం చేసే అవకాశం దక్కడంలేదు. ఈ తరుణంలో తైవాన్‌ వంటి వాటి సహకారంతో ఇండియా తన తయారీ గొలుసులను ప్రపంచ గిరాకీకి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తైవాన్‌ ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి చెన్‌ చెర్న్‌-కాయ్‌ భారత్‌ పర్యటన ఇందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు. డెబ్భై మందితో కూడిన వాణిజ్య ప్రతినిధి బృందంతో చెన్‌ త్వరలో భారత్‌కు రానున్నారు. ఇండియా-తైవాన్‌ మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా ఆర్థిక సహకారం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు.

తైవాన్‌ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సాంకేతికత, విజ్ఞాన ఆధారిత సంస్థలపై ఆధారపడి ఉంది. కృత్రిమ మేధ, సమాచార భద్రత, 5జీ, సెమీకండక్టర్లు తదితరాల్లో తన నైపుణ్యాలను భారత్‌తో పంచుకోవడానికి తైవాన్‌ ఇప్పటికే సిద్ధమైంది. ఇండియా ప్రవేశపెట్టిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) వంటి వాటి ద్వారా తైవాన్‌ కంపెనీలు, వాటికోసం పనిచేసే ఇతర సంస్థలు భారత్‌ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉంది. తైవాన్‌లో భారీ ఎలెక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌, లోహ, గనుల దిగ్గజం వేదాంత సంయుక్తంగా గుజరాత్‌లో సెమీకండక్టర్‌ కర్మాగారాన్ని నిర్మిస్తుండటం అందులో ముందడుగుగా చెప్పవచ్చు. అక్కడ సిలికాన్‌ వేఫర్ల(పొరల)ను తయారు చేస్తారు. సెమీకండక్టర్‌ రంగంలో వాటి పాత్ర కీలకం. 2025 కన్నా ముందే వాటి తయారీని ప్రారంభించాలని సంకల్పించారు. మెమొరీ, పవర్‌ చిప్‌ల వంటి చాలా వాటిలో సిలికాన్‌ వేఫర్లను వినియోగిస్తారు. సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా భారత్‌ ఎదగడానికి తైవాన్‌ సహకారం ఎంతగానో తోడ్పడుతుంది. రసాయనాలు, సిలికాన్‌ వేఫర్లు, ఫొటో-మాస్కులు వంటి అధునాతన, సున్నితమైన పరికరాల తయారీదారులను సైతం భారత్‌ ఆకర్షించడానికి అవకాశం లభిస్తుంది.

తైపీ, దిల్లీల ద్వైపాక్షిక వాణిజ్యం 2006లో 200 కోట్ల డాలర్లు. 2021 నాటికి అది 770 కోట్ల డాలర్లకు చేరింది. తైవాన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై(ఎఫ్‌టీఏ) భారత్‌ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఎఫ్‌టీఏ వల్ల ఇండియా కన్నా తైవాన్‌కే అధికంగా ప్రయోజనం కలుగుతుంది. దానిద్వారా నూట నలభై కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌ మార్కెట్లో తైవాన్‌ నేరుగా పాగా వేయడానికి అవకాశం లభిస్తుంది. అయితే, చైనాతో ఇండియా సంబంధాలు బలహీనమవుతున్న తరుణంలో తైవాన్‌తో అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చైనా విస్తరణ వాదాన్ని నిలువరించడానికి తైవాన్‌ సైతం వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ‘లుక్‌ ఈస్ట్‌’ విధానంలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలు, పర్యావరణ అంశాల్లో తైవాన్‌తో సహకారాన్ని పెంచుకోవడానికి భారత్‌ ఇప్పటికే చర్యలు చేపట్టింది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటం వల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్ర స్థానంగా తైవాన్‌ విరాజిల్లుతోంది. ప్రపంచానికి కీలకమైన సరఫరా గొలుసుల భాగస్వామిగా నిలుస్తోంది. ఈ తరుణంలో చెన్‌ పర్యటనను మరింత ప్రయోజనకరంగా భారత్‌ మలచుకోవడం తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

- ఎస్‌.నీరజ్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తరిగిపోతున్న వన్యప్రాణి జనాభా

‣ బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

‣ ఆఫ్రికాబంధం... బహుళ ప్రయోజనకరం!

‣ చమురు ధరల పోటుతో భారత్‌కు తీరని చేటు

‣ స్కూలు నుంచే సైన్యంలోకి!

‣ అదనంగా నేర్చుకో.. అవకాశాలు అందుకో!

Posted Date: 04-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం