• facebook
  • whatsapp
  • telegram

గల్ఫ్‌తో చైనా చెట్టపట్టాల్‌

 

 

ఆర్థిక, రాజకీయ, సైనిక బలాలతో ఇతర దేశాలపై ఆధిపత్యధోరణి ప్రదర్శిస్తున్న చైనా- పశ్చిమాసియాలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గల్ఫ్‌ దేశాల్లో భారీ పెట్టుబడులతో వాణిజ్య కార్యకలాపాలను విస్తరిస్తోంది. భారత ఆర్థిక ప్రయోజనాలకు పశ్చిమాసియా కీలకం. ఈ ప్రాంతంలో డ్రాగన్‌ ఆర్థికంగా, భౌగోళికంగా బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నందువల్ల, భారత్‌ సొంత ప్రయోజనాలు కాపాడుకోవడంపై మరింత దృష్టి సారించాల్సి ఉంది.

 

సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)తో చైనా బంధం బలపడుతోంది. ఈ రెండు దేశాలతో డ్రాగన్‌ వాణిజ్యం విలువ అయిదేళ్లలో నాలుగింతలు పెరిగి, 2021 నాటికి దాదాపు రూ.16.55 లక్షల కోట్లకు చేరింది. ఆ దేశాలకు ఇప్పుడు చైనాయే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సౌదీ చమురుకు దశాబ్దకాలంగా అతిపెద్ద కొనుగోలుదారు చైనాయే. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఇటీవల రూ.33 లక్షల కోట్ల విలువైన వాణిజ్యం, పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. చైనా విదేశీ వాణిజ్యానికి అతిపెద్ద సరకు రవాణా కేంద్రంగా యూఏఈ అవతరించింది. యూఏఈలో నాలుగు వేలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. యూఏఈ సైతం చైనాలో 650 ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టింది.

 

విస్తరణే ధ్యేయంగా...

ఈ ఏడాది ఆగస్టులో సౌదీ కంపెనీ అరామ్‌కో, చైనా పెట్రోలియం కెమికల్‌ కార్పొరేషన్‌ (సినోపెక్‌) మధ్య భారీ ఒప్పందం కుదిరింది. చమురుశుద్ధిలో సహకారం, ఇంజినీరింగ్‌ సేవలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటివన్నీ ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందం చైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బీఆర్‌ఐ)కు పశ్చిమాసియాలో ఊపునిచ్చే అంశం. సౌదీ సైతం తన ‘విజన్‌ 2030’ ప్రణాళికను బీఆర్‌ఐతో అనుసంధానిస్తోంది. బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ, యూఏఈలతో కూడిన గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ), చైనా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు చర్చలు చివరిదశలో ఉన్నాయి. గల్ఫ్‌ నుంచి చమురు దిగుమతుల్ని గణనీయంగా తగ్గించుకొన్న అమెరికాకు క్రమంగా ఈ ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు సన్నగిల్లాయి. దీంతో ఇక్కడ అమెరికా పెద్దన్న పాత్ర మసకబారింది. మరోవైపు వస్తు రవాణా, ఆర్థిక సేవల పరంగా యూఏఈ వంటి దేశాలు ఆసియా, పాశ్చాత్య దేశాలకు అనుసంధాన కేంద్రాలుగా వృద్ధి చెందాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకొనేలా చైనా అయిదేళ్లుగా వాణిజ్య దౌత్యంలో దూకుడు ప్రదర్శించింది. ప్రస్తుతం చైనాకు గల్ఫ్‌ ప్రాంతం కీలకంగా మారింది. పశ్చిమాసియాలో అమెరికా భద్రతా ప్రయోజనాలు క్షీణిస్తుండటంతో, చైనా ఇక్కడి కీలకమైన వస్తురవాణా జలమార్గాలపై పట్టుకోసం ప్రయత్నిస్తోంది. ఆఫ్రికాలోని జిబౌటిలో ఇప్పటికే నౌకాదళ స్థావరం నెలకొల్పింది. యెమన్‌, జిబౌటీల మధ్య ఉన్న బాబ్‌-ఎల్‌-మండేబ్‌ జలసంధిపై నియంత్రణకు తహతహలాడుతోంది. ఈజిప్టులోని సూయజ్‌ కెనాల్‌ ప్రాంతీయ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అక్కడా భాగస్వామిగా మారింది. పాకిస్థాన్‌లో గ్వదర్‌ నౌకాశ్రయం అభివృద్ధితో పాటు చెంతనే ఉన్న జివానీలో మరో నౌకాస్థావరం నిర్మిస్తోంది. ఇలా ఎర్ర సముద్రం నుంచి హిందూ మహాసముద్రం వరకు ఆధిపత్యం కోసం ప్రణాళికను అమలుచేస్తోంది.

 

భారత్‌ సైతం...

భారత్‌ సైతం అరేబియా సముద్రంలో ప్రయోజనాల రీత్యా ఒమన్‌ను చేరదీస్తోంది. అక్కడి డ్యూకమ్‌ నౌకాశ్రయ సముదాయంలో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోంది. ఈ నౌకాశ్రయంతో జీసీసీ రైల్వే నెట్‌వర్క్‌ అనుసంధానమై ఉంటుంది. ఒమన్‌లో భారత్‌ ప్రత్యేక ఆర్థిక సహకారంతో ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నిర్మాణంలో ఉంది. ఇదే సెజ్‌కు చైనా కొంత ఆర్థిక సహాయం చేసి భాగస్వామిగా చొరబడింది. ఒమన్‌-భారత్‌ మధ్య నౌకాయానం, సైనిక సహకారం, భద్రతకు సంబంధించిన అవగాహన ఒప్పందాలున్నాయి. ఈ బంధం అరేబియా సముద్రంలో చైనా దూకుడును నిలువరించేందుకు ఎంతవరకు దోహదపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాను, ముఖ్యంగా జీసీసీని భారత్‌ వ్యూహాత్మక భాగస్వామిగానే చూస్తోంది. గల్ఫ్‌-భారత్‌ మధ్య దృఢమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. గల్ఫ్‌ నుంచి ప్రవాస భారతీయులు పంపే మొత్తం భారత్‌కు కీలకం. యూఏఈ నుంచి మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంధన అవసరాల రీత్యా సౌదీతో సన్నిహిత సంబంధాలు తప్పనిసరి. అయితే ఈ ప్రాంతంలో భారత్‌ పెట్టుబడులు చైనాతో పోలిస్తే చాలా తక్కువ. పశ్చిమాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో మరింత పురోగతి, ప్రణాళికలు అవసరం. అక్కడ భారతీయ పెట్టుబడులు గణనీయంగా పెరిగితేనే మన పరపతి, ప్రాధాన్యం ఇనుమడిస్తాయి. ఈ ఏడాది ఆగస్టులో బైడెన్‌ చొరవతో ఐ2యూ2 (ఇండియా, ఇజ్రాయెల్‌, యూఎస్‌, యూఏఈ) కూటమి ఏర్పాటైంది. ఈ కూటమితో ఆర్థికంగా, భద్రతాపరంగా సభ్యదేశాలకు ఒనగూడే ఫలితాలపై ఇంకా స్పష్టత రాలేదు. భారత్‌కు విశ్వసనీయ భాగస్వామిగా భావిస్తున్న ఇజ్రాయెల్‌ సైతం ఐ2యూ2లో ఉండటం మనకు కలిసివచ్చే అంశం. గల్ఫ్‌తో పటిష్ఠమైన బంధానికి ఈ కూటమి కూడా భారత్‌కు ఓ అవకాశమే!

 

- సీహెచ్‌.మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూతాపం... పుడమికి శాపం!

‣ సేద్యంలో డ్రోన్ల విప్లవం

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

‣ తైవాన్‌తో ఉపయుక్త బంధం

‣ తరిగిపోతున్న వన్యప్రాణి జనాభా

‣ బ్రెజిల్‌ పీఠంపై మరోసారి లూలా

‣ ఆర్థిక ఉత్తేజానికి సత్వర పెట్టుబడులు

Posted Date: 09-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం