• facebook
  • whatsapp
  • telegram

ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

 

 

భారతదేశం అనాదిగా అవినీతి, నిరక్షరాస్యత, మహిళల పట్ల నిరాదరణ, పేదరికం, అసమానతలు, మత కలహాలతో ఉక్కిరిబిక్కిరయింది. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాల ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను జరుపుకొంటున్న తరుణంలోనూ ఈ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

 

భారత్‌ వలసరాజ్యంగా ఉండగానే 1945లో ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది. అప్పటికే చైనా ‘సంస్థాపక సభ్యత్వ’ హోదాలో ఉంది. భారత్‌లో పిన్న వయస్కుల నుంచి పెద్దల వరకు అత్యధిక ప్రజానీకం వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల్లోనే ఉపాధి పొందేవారు. చదువు లేకపోవడంవల్ల వారు ఇతర వృత్తి, ఉపాధులను చేపట్టలేకపోయారు. 1950లలోనే తీవ్ర సమస్యగా గుర్తించిన నిరుద్యోగం ఇప్పటికీ సమసిపోలేదు. ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 20శాతంగా ఉన్న నిరుద్యోగం-నేడు 28.26 శాతానికి పెరిగింది.

 

దూసుకుపోయిన చైనా

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు గణతంత్ర రాజ్యమైన చైనా జనాభా 54 కోట్లు. అప్పటి భారత జనాభా 33 కోట్లే. ప్రస్తుతం రెండు దేశాల జనాభా దాదాపు సమానం(140 కోట్లు)గా ఉంది. కమ్యూనిస్టు పాలనలో చైనాలో అక్షరాస్యత 96.84 శాతానికి పెరిగింది. భారత్‌లో అక్షరాస్యత ఇంకా 77.78 శాతం వద్దనే తచ్చాడుతోంది.  భారత్‌తో పోలిస్తే చైనాలో నిరుద్యోగం చాలా తక్కువ. 1987లో చైనా జీడీపీ (27,297 కోట్ల డాలర్ల) కన్నా భారత జీడీపీ (27,903 కోట్ల డాలర్లు) కాస్త హెచ్చు. 1990లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. నాడు చైనా తలసరి ఆదాయం 318 డాలర్లయితే భారత్‌    తలసరి ఆదాయం 368 డాలర్లు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. 2022లో భారత్‌ జీడీపీ 3.31 లక్షల కోట్ల డాలర్లు. కాగా, చైనా జీడీపీ 18.46 లక్షల కోట్ల డాలర్లు. నేడు ప్రపంచంలో అమెరికా తరవాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగింది. ఒకప్పుడు చైనా కన్నా పైమెట్టు మీదున్న భారత్‌ నేడు ఎంతో వెనకబడిపోయింది. దీనికి కారణాలు అనేకం. భారతదేశం ప్రధానంగా సేవా రంగానికి ప్రాధాన్యం ఇవ్వగా, చైనా పారిశ్రామికీకరణకు పెద్ద పీట వేసింది. ప్రపంచీకరణను ఉపయోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులను దేశదేశాలకు ఎగుమతి చేసి అపారంగా విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించింది. నష్టాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను భారత్‌ మూసివేస్తుంటే, చైనా ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించింది. పారిశ్రామిక   రంగానికి అగ్ర ప్రాధాన్యమివ్వడం వల్ల భారీ పరిశ్రమలకు తోడుగా అనేక అనుబంధ పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు పెరిగాయి. సాంకేతిక నిపుణులతోపాటు ఓ మోస్తరు అక్షరాస్యులకూ పరిశ్రమల్లో ఉపాధి దొరికింది. దానికి భిన్నంగా భారతీయ యువత ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి, ఐటీ రంగ ఉద్యోగాలకు ప్రాధాన్యమిచ్చింది. ఇంతచేసినా భారతదేశం అటు హార్డ్‌వేర్‌లో కానీ, ఇటు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో కానీ అగ్రశక్తిగా ఎదగలేకపోయింది. భారత్‌ తన జీడీపీలో 30శాతాన్ని మాత్రమే పెట్టుబడిగా పెడుతుండగా, చైనా    50శాతాన్ని పెట్టుబడి వ్యయంగా ఉపయోగిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగ వాటా 20శాతానికి లోపే ఉండగా, చైనాలో అది 30శాతం. ప్రపంచ కర్మాగారంగా ఎదగడం ద్వారా చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది.

 

పరిశ్రమలపై దృష్టి సారిస్తేనే...

భారత్‌లో అడుగడుగునా అవినీతి తాండవించడం దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు. స్వదేశంలో అవకాశాలు లేక భారతీయ విద్యావంతులు, వృత్తి నిపుణులు 1960ల నుంచి విదేశాలకు వలసపోతున్నారు. మేధా వలస భారత్‌ ప్రగతికి ఏమాత్రం మంచిది కాదు. మౌలిక వసతులు కొరవడటం వల్ల పరిశ్రమల స్థాపనకు వ్యవస్థాపకులు ముందుకురావడం లేదు. భారత్‌లో పారిశ్రామిక ప్రగతికి ఇది పెద్ద అడ్డంకి. రాజకీయంగా ఏకాభిప్రాయం లేకపోవడమూ దేశాభివృద్ధిని వెనక్కు లాగుతోంది. నాయకత్వ లోపం, యువతను నిపుణ సైన్యంగా తీర్చిదిద్దాలనే పట్టుదల లోపించడం, మహిళా కార్మిక భాగస్వామ్యం బహు తక్కువగా ఉండటంవల్ల భారత్‌ అగ్ర ఆర్థిక శక్తిగా ఎదగలేకపోతోంది. చైనా మాదిరిగా ఎగుమతులు చేయలేకపోతున్న భారతదేశం వంట నూనెల వంటి వ్యవసాయ ఉత్పత్తులనూ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్నాయి. ఉపాధి, వ్యాపార అవకాశాలను విస్తరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ వంటి పథకాలను చేపట్టినా ఏ రంగంలోనూ చెప్పుకోదగిన పురోగతి కనిపించడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటిలో పారిశ్రామికోత్పత్తికి పెద్దపీట వేయాలి. పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నిరంతర పరిశోధన-అభివృద్ధి ద్వారా కొత్త సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. తద్వారా జీడీపీని అంచెలంచెలుగా పెంచడం సాధ్యమవుతుంది.

 

- శ్రీరాం చేకూరి

(ఆర్థిక, విదేశీ వాణిజ్య నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

‣ గల్ఫ్‌తో చైనా చెట్టపట్టాల్‌

‣ భూతాపం... పుడమికి శాపం!

‣ సేద్యంలో డ్రోన్ల విప్లవం

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం