• facebook
  • whatsapp
  • telegram

భూసార రక్షణతో ఆహార భద్రత

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం అందించాలంటే పంటల ఉత్పత్తి పెరగాలి. ఈ క్రమంలో మరింత సాగుభూమి కోసం వనాలను నిర్మూలించడం సరికాదని ఇటీవలి నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆహార భద్రత సాధించాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా 2012తో పోలిస్తే 2050 నాటికి ఆహార డిమాండ్‌ 50శాతం అధికమవుతుందని ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో పంటల ఉత్పత్తికి, పశుపోషణకు 60 కోట్ల హెక్టార్ల దాకా సాగు భూమి అదనంగా అవసరమవుతుందని అంచనా వేసింది. ఆ భూమి ప్రస్తుతం అడవులు, ఇతర క్లిష్టమైన పర్యావరణ వ్యవస్థలతో నిండి ఉందని వెల్లడించింది. అయితే, ఆహార గిరాకీని తీర్చడానికి వ్యవసాయ దిగుబడులను పెంచడంతోపాటు ఇతర చర్యలు కీలకమని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నివేదిక తెలిపింది. అటవీ విస్తీర్ణం భారీగా తగ్గకుండా ఆహార భద్రతను పెంచేందుకు భూసారాన్ని పునరుద్ధరించాలని సూచించింది.

ప్రపంచవ్యాప్తంగా 2000-2018 మధ్య చోటుచేసుకున్న అటవీ నిర్మూలనలో 90శాతం వ్యవసాయ విస్తరణ కోసమే జరిగింది. ఇది జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వ్యవసాయం, అడవుల సంరక్షణను సమన్వయం చేసుకుంటూ స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవాలని ఎఫ్‌ఏఓ నివేదిక చెప్పింది. అందులో ప్రభుత్వాల పాత్ర కీలకమని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఎఫ్‌ఏఓ ప్రపంచ అటవీ వనరుల మదింపు నివేదిక ప్రకారం రెండు దశాబ్దాల్లో విశ్వవ్యాప్తంగా 42 కోట్ల హెక్టార్ల మేర అడవులు నాశనమయ్యాయి.

అనేక కారణాల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా అడవుల నిర్మూలన కొనసాగుతూనే ఉంది. దాంతో వాటిపై ఆధారపడిన జీవజాతులు అంతరించిపోతున్నాయి. వనాలు తరిగిపోవడానికి ప్రధానంగా వ్యవసాయ భూముల విస్తరణతో పాటు ఇతర అంశాలూ కారణమవుతున్నాయి. వనాల్లో పశువులను మేపడం వల్ల 2001-2015 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు కనుమరుగైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పలు కారణాల వల్ల 2019 మార్చి నుంచి రెండేళ్లలో బ్రెజిల్‌లో లక్ష హెక్టార్లకు పైగా అటవీ నష్టం సంభవించింది. కలప డిమాండును తీర్చడానికే ఏటా ప్రపంచంలో 3.80 లక్షల హెక్టార్ల అడవులను నరికివేస్తున్నట్లు అంచనా. గనుల తవ్వకం, కార్చిచ్చుల కారణంగానూ భారీగా అడవుల విధ్వంసం జరుగుతోంది. ఫలితంగా హరిత గృహ వాయు ఉద్గారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేల నీటి నిల్వ సామర్థ్యమూ తెగ్గోసుకుపోతోంది. ఇప్పటికే సాగు భూమిలో 52శాతం నేల కోత వల్ల ప్రభావితమైంది. ఇండియాలో 2018-19 నాటికి 9.78 కోట్ల హెక్టార్ల భూసారం క్షీణతకు గురైనట్లు ఇస్రో ఆధ్వర్యంలోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ విడుదల చేసిన ‘ఎడారీకరణ, భూసార క్షీణత అట్లాస్‌’ తేటతెల్లం చేసింది. పోషకాలు కలిగిన నేల లేకపోవడం వ్యవసాయ దిగుబడులపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఆహార అభద్రత ముమ్మరిస్తోంది.

నిస్సారంగా మారిన 2.6 కోట్ల హెక్టార్ల భూమిని 2030 నాటికి సారవంతం చేసుకోవడానికి ఇండియా కృషి చేస్తోంది. భారత్‌ మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం 24.62 శాతం. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశమైన ఇండియా- అడవులను సంరక్షించుకుంటూ ఆహారభద్రతపై దృష్టి సారించాలి. మరోవైపు శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధి సైతం అడవులకు ముప్పుగా మారాయి. నానాటికీ పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చడానికి పంటల ఉత్పాదకతను పెంచాలి. ఇది అదనపు భూమి అవసరాన్ని కొంతమేర తగ్గిస్తుంది. అడవుల నిర్మూలననూ నివారించడానికి తోడ్పడుతుంది. అటవీ నిర్మూలనను నివారించడంలో బ్రెజిల్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయు ఉద్గారాలను కట్టడి చేయడంలో బ్రెజిల్‌ ఎంతగానో తోడ్పడుతోంది. అదే సమయంలో పేదరికం, ఆకలి, అసమానతలను తగ్గించడంలోనూ ఆ దేశం పురోగతి సాధించింది. అడవుల నరికివేతపై తాత్కాలిక నిషేధం, చట్టాలను కఠినంగా అమలుచేయడం, బలమైన నాయకత్వం వంటివి అక్కడ సత్ఫలితాలను ఇచ్చాయి. మిగిలిన దేశాలూ వ్యవసాయ దిగుబడుల పెంపు, అడవుల సంరక్షణపై సరైన దృష్టి సారించాలి. భూసారం దెబ్బతినకుండా కాచుకోవాలి. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహార భద్రతనూ సాధించవచ్చు.

- సతీష్‌బాబు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అప్పుల కుప్పలు... భావి తరాలకు తిప్పలు!

‣ ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

‣ గల్ఫ్‌తో చైనా చెట్టపట్టాల్‌

‣ భూతాపం... పుడమికి శాపం!

‣ సేద్యంలో డ్రోన్ల విప్లవం

‣ అమెరికా - పాక్‌ అవకాశవాద పొత్తు

Posted Date: 18-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం