• facebook
  • whatsapp
  • telegram

జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!


 

సంపన్న, పారిశ్రామిక దేశాలు; బలీయ వర్ధమాన దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న కూటమే జీ20. ఈ ఏడాది కూటమి శిఖరాగ్ర సదస్సు ఇండొనేసియాలోని బాలిలో నేటి నుంచి రెండు రోజులపాటు జరగనుంది. డిసెంబరు నుంచి భారత్‌ ఈ కూటమికి అధ్యక్షత వహించనుంది. ఈ సందర్భంగా పలు సమస్యల పరిష్కారానికి వర్ధమాన దేశాలు ఇండియాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నాయి.

 

డాట్‌కామ్‌ బుడగ బద్దలై, ఆసియా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దరిమిలా- 1999లో జీ20 కూటమి ఏర్పాటైంది. తొలుత ఆయా దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు సమావేశమై సంక్షోభాన్ని పరస్పర సహకారంతో ఎదుర్కొందామని తీర్మానించారు. అప్పటినుంచి జీ20 ప్రతినిధులు ఏటా సమావేశమై ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సమస్యలపై చర్చిస్తూ వస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభం వరకు ఇలానే కొనసాగింది. 2008లో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడంతో పరిష్కారాల సాధనపై జీ20 దృష్టి పెట్టింది. అప్పటి నుంచి ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల బదులు దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులతో జీ20 సదస్సులు జరుగుతున్నాయి. ప్రపంచార్థికాన్ని స్థిరీకరించి పటిష్ఠం చేసే విధానాలను కలిసికట్టుగా చేపడదామని సదస్సుల్లో తీర్మానిస్తున్నారు. క్రమేపీ వాణిజ్యం, వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయాభివృద్ధి, అవినీతిపై పోరు, ఇంధన భద్రతలూ జీ20 అజెండాలో వచ్చి చేరాయి.

 

సంపన్న, వర్ధమాన దేశాల సంగమం

ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా జీ20 దేశాలదే. 75శాతం అంతర్జాతీయ వాణిజ్యం ఈ దేశాల మధ్యే జరుగుతోంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే నివసిస్తున్నారు. జీ20 సంఘానికి ఏటా ఒక సభ్య దేశం అధ్యక్షత వహించడం సంప్రదాయం. ఈ ఏడాది ఇప్పటివరకు ఇండొనేసియా జీ20 అధ్యక్ష స్థానంలో ఉంది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి భారత్‌ పగ్గాలు స్వీకరిస్తుంది. వచ్చే ఏడాది నవంబరు 30 వరకు (సంవత్సర కాలం) గ్రూప్‌ ఆఫ్‌ 20 కూటమికి భారత్‌ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సభకు ఆతిథ్యమిస్తుంది. వచ్చే ఏడాదికి అజెండా నిర్ణయించడంతో పాటు అనేక సభలు, సమావేశాలూ నిర్వహిస్తుంది. కూటమికి ఇంతవరకు శాశ్వత సచివాలయం లేదు. జీ20లో ఇప్పుడు రెండు విభాగాలు ఉన్నాయి. ఆర్థిక విభాగంలో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు కలిసి చర్చించుకుని కీలక తీర్మానాలు చేస్తారు. ‘షెర్పా’ విభాగంలో నీతిఆయోగ్‌ మాజీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి అమితాబ్‌ కాంత్‌ వంటి పాలనా నిపుణులు ఉంటారు. వీరు ఆర్థిక విభాగ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. 2023 సంవత్సర జీ20 శిఖరాగ్ర సభ ప్రతీక చిహ్నాన్ని (లోగోను) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఆవిష్కరించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలని జీ20 లక్షిస్తోంది. సంపన్న, పారిశ్రామిక, ప్రధాన వర్ధమాన దేశాల సంగమంగా భాసిల్లుతోంది. భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకొంది. స్వాతంత్య్ర శతజయంతి ఉత్సవాలకు ఇంకా 25 ఏళ్ల అమృత కాలం ఉంది. ఈ కాలంలో మానవ సంక్షేమమే ప్రధానంగా- సమ్మిళిత, సుసంపన్న భారతదేశ నిర్మాణానికి కృషి జరుగుతుంది. జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ వచ్చే సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో 32 విభిన్న రంగాల్లో 200 సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ సందర్భంగా ఉజ్జ్వల భారతీయ సంస్కృతి కళ్లకు కడుతుంది.

 

సవాళ్లెన్నో...

సమ్మిళిత, సమాన, సుస్థిరాభివృద్ధి సాధనకు జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ కృషిచేస్తుంది. మహిళా సాధికారత, ప్రజలకోసం డిజిటల్‌ మౌలిక వసతులు, సాంకేతికాభివృద్ధి, వాతావరణ మార్పుల నిరోధానికి నిధులు, అంతర్జాతీయ ఆహార భద్రత, ఇంధన భద్రతలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ లక్ష్యాల సాధనకు జీ20 దేశాల మధ్య ఉన్న విభేదాలను అధిగమించడం భారత్‌ ముందున్న ప్రధాన సవాలు. ఈ విభేదాల వల్లనే ఇటీవల జీ20 విశ్వసనీయత సన్నగిల్లింది. దాన్ని పునరుద్ధరించడానికి భారత్‌ పట్టుదలగా కృషిచేయాలి. వాతావరణ మార్పుల నిరోధం, ప్రజారోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను మానవ కల్యాణం కోసం వినియోగించడం చాలా ముఖ్యం. దీనికి అవసరమైన అంతర్జాతీయ నియమ నిబంధనలను రూపుదిద్దడానికి జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ కృషి చేయాలి. వికేంద్రీకృత ఫైనాన్స్‌, క్రిప్టో కరెన్సీ, ఫైనాన్స్‌ రంగంలో బడాటెక్‌ సంస్థల ప్రవేశం వల్ల పెను మార్పులు వస్తున్నాయి. దీనికి తోడు ఈ-కామర్స్‌ డిజిటల్‌ విపణి విస్తరిస్తోంది. దేశాల ఎల్లలు చెరిగిపోతున్నాయి. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకుని నయా నిబంధనల చట్రాన్ని రూపొందించడానికి జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌ చొరవ తీసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ‘బ్రెట్టన్‌ఉడ్స్‌’ ఒప్పందం కింద అమెరికా, ఐరోపాలు ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను నెలకొల్పాయి. నేటి డిజిటల్‌ ప్రపంచానికి అనువైన ఆర్థిక సంస్థల ఏర్పాటుకు ప్రయత్నించడానికి జీ20 వేదికను భారత్‌ ఉపయోగించుకోవాలి. ఉక్రెయిన్‌ యుద్ధంపై స్వతంత్ర వైఖరి అవలంబించిన భారతదేశం డిజిటల్‌ సీమలో అనితర సాధ్య విజయాలను అందుకొంది. కొవిడ్‌ మహమ్మారిని విజయవంతంగా అధిగమించి ప్రపంచానికి టీకాలు, మందుల సరఫరాదారుగా నిలిచింది. జీ20 అధ్యక్ష హోదాలో ప్రపంచ సారథుల్లో స్థానం పొందే అవకాశం భారత్‌కు లభిస్తోంది.

 

లాంఛనం కాదు...

కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి అంశాలవల్ల ఆహార, ఇంధన సరఫరాలు విచ్ఛిన్నమై- అతలాకుతలమైన ప్రపంచాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి. జీ20కి అధ్యక్షత వహించడమనేది ఏదో దౌత్యపరమైన లాంఛనమని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. అది ప్రపంచం భారత్‌ మీద ఉంచిన నమ్మకానికి, కొత్త బాధ్యతకు నిదర్శనం. జీ7, జీ77, జీ20, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ... ఇలా పేర్లు ఏవైనా అన్ని అంతర్జాతీయ వేదికలూ తమను గండం నుంచి గట్టెక్కించాలని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ స్థితిలో అటు సంపన్న, ఇటు వర్ధమాన దేశాలు రెండింటితో సన్నిహిత, సత్సంబంధాలు కలిగిన భారతదేశం నుంచి ప్రపంచం చాలా ఆశిస్తోంది. జీ20 అధ్యక్ష పదవి నిర్వహించేటప్పుడు భారత్‌ ఈ గురుతర బాధ్యతను గుర్తుంచుకుని కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

‣ మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

‣ సుస్థిరాభివృద్ధికి సైన్సే సోపానం

‣ ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం