• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధికి సైన్సే సోపానం

 

 

సామాజిక వికాసం, శాంతి సాధనలో విజ్ఞానశాస్త్రానిది కీలక పాత్ర. దాన్ని గుర్తిస్తూ ఏటా నవంబరు తొమ్మిదో తేదీ నుంచి అంతర్జాతీయ సైన్స్‌, శాంతి వారోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రపంచమంతటా సభలు, చర్చలు జరుపుతున్నారు. 

 

ఆధునిక యుగంలో వ్యవసాయం, వైద్యం, జలవనరుల వినియోగం, ఇంధనం, పర్యావరణ రక్షణ, కమ్యూనికేషన్‌ సౌకర్యాలకు శాస్త్రసాంకేతిక విజ్ఞానాలే చోదకశక్తులు. మధుమేహం, క్యాన్సర్‌ వంటి వ్యాధులకు జన్యు చికిత్సలను రూపొందించడానికి శాస్త్రజ్ఞులు నిరంతరం పరిశోధనలు సాగిస్తున్నారు. బ్యాక్టీరియా నుంచి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం శాస్త్ర పరిశోధనలవల్లే సాధ్యపడింది. ప్రపంచ జనాభాకు ఏటా అదనంగా 8.2 కోట్ల మంది జతపడుతున్నారు. ఇంతగా విస్తరిస్తున్న జనాభాకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందించడం చాలా కష్టమైన విషయం. దీన్ని సుసాధ్యం చేయడంలో సైన్స్‌ నిర్వహించగల పాత్ర అత్యంత కీలకమైంది. సంఘర్షణలను నివారించి, శాంతిని సంరక్షించడం ద్వారా సుస్థిరాభివృద్ధి సాధించడానికి సైన్స్‌, టెక్నాలజీలను సమర్థంగా వినియోగించుకోవాలి.

 

సహకారం అవసరం

కొత్త పరిశ్రమలు స్థాపించి, ఉపాధి అవకాశాలను విస్తరించడానికి అధునాతన శాస్త్ర, సాంకేతికతలే శరణ్యం. నేడు భూగోళంపై దాదాపు 800 కోట్లమంది నివసిస్తున్నారు. వీరికి ఆహారం, ఇంధనం, జీవనోపాధి సమకూర్చే క్రమంలో కాలుష్యం పెరుగుతూ వాతావరణం పెనుమార్పులకు లోనవుతోంది. ఈ తరుణంలో భూమిని భద్రమైన ఆవాసంగా పునరుద్ధరించడానికి సైన్స్‌, టెక్నాలజీలే మూలాధారం. శిలాజ ఇంధనాలకు బదులు పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడంలో సైన్స్‌ ఇప్పటికే కీలక పాత్ర వహిస్తోంది. ఈ అంశంలో విజ్ఞానశాస్త్ర ప్రాధాన్యం పోనుపోను మరింత అధికం కానుంది. తద్వారా సామాజిక అభివృద్ధిలో సైన్స్‌ కొత్త శకాన్ని ప్రారంభించనుంది. ప్రపంచ దేశాలు రోదసి రంగంలో సాధిస్తున్న విజయాల వెనక శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.

 

అంతర్జాతీయ శాంతి సూచీలో కొన్నేళ్లుగా ఐస్‌ల్యాండ్‌ మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ ఏడాది తొలి ఏడు స్థానాలను ఐరోపా దేశాలే దక్కించుకున్నాయి. సుస్థిరాభివృద్ధి జరిగితేనే సంఘర్షణలు సద్దుమణిగి శాంతి నెలకొంటుంది. హరిత ఇంధనాలతో ఆర్థికాభివృద్ధి, తద్వారా ఉద్యోగ వ్యాపార అవకాశాల విస్తరణకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలు తోడ్పడతాయి. కాబట్టి విద్యాలయాల్లో మౌలిక శాస్త్రాల బోధనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రాథమిక దశ నుంచే శాస్త్ర, సాంకేతిక విభాగాల్లో మౌలిక సూత్రాలను అవగాహన చేసుకునే విద్యార్థులు తరవాత ఇంజినీర్లుగా, శాస్త్రజ్ఞులుగా రాణించగలుగుతారు. అందుకే పాఠశాల స్థాయిలో సైన్స్‌, టెక్నాలజీ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. మౌలిక శాస్త్ర పరిశోధనలకు ఉన్నత విద్యాసంస్థలు అగ్రాసనం వేయాలి.

 

శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాల్లో పైచేయి సాధించడానికి దేశాల మధ్య అవాంఛనీయ పోటీ నెలకొంది. దీనికి బదులు పరస్పర సహకారం అవసరం. అధునాతన శాస్త్ర, సాంకేతిక పరిశోధన ఫలాలను దేశాలు పంచుకోవాలి. అది ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మరోవైపు భారతదేశం శాస్త్ర, సాంకేతిక పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)కి ఎక్కువ నిధులు కేటాయించాలి. ప్రస్తుతం దేశ జీడీపీలో ఏటా 0.7 శాతాన్ని మాత్రమే ఆర్‌అండ్‌డీపై ఖర్చుపెడుతున్నాం. దీన్ని కనీసం మూడు శాతానికి పెంచాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విజ్ఞానంతో ప్రపంచం నుంచి పేదరికాన్ని పారదోలవచ్చు. ఈ సత్తా సమకూరిన మొదటి తరం మనదే. సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేసుకునే సామర్థ్యం సైతం మనకే ఉంది. చిన్న సన్నకారు రైతులకు అధునాతన సాంకేతికతలను అందించడం ద్వారా పేదరిక నిర్మూలన, సుస్థిరాభివృద్ధి సిద్ధిస్తాయి. అది స్వదేశంలో, అంతర్జాతీయ సమాజంలో శాంతికి సోపానమవుతుంది.

 

సముద్రాలపై ఆధిపత్యం

శాస్త్రజ్ఞులు భూగర్భ, ఉపరితల జల వనరులను సమర్థంగా వినియోగించుకునే రీతులపై పరిశోధన జరుపుతున్నారు. నీటి నాణ్యత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. భూగోళంపై ఉన్న నీటిలో 71శాతం సముద్రాల్లోనే ఉంది. సముద్రాలే భూ వాతావరణాన్ని నియంత్రిస్తున్నాయి. వర్షాలకు మహాసముద్రాలే మూలాధారం. వాటిలోని మత్స్య వనరులు మానవుడికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. సముద్రాల్లో ఖనిజ సంపద సైతం అపారం. అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా సముద్ర మార్గాల్లోనే సాగుతోంది. సముద్రాలపై పట్టుకు దేశాలు యుద్ధాలకూ దిగుతాయి. ప్రస్తుతం ఇండో-పసిఫిక్‌పై ఆధిపత్యం కోసం నడుస్తున్న పోటీ సంఘర్షణకు దారితీసే ప్రమాదం పొంచి ఉంది. ఇకపై సముద్ర శాస్త్రాలకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం ద్వారా మానవాళికి గరిష్ఠ ప్రయోజనం చేకూర్చాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

‣ భూసార రక్షణతో ఆహార భద్రత

‣ అప్పుల కుప్పలు... భావి తరాలకు తిప్పలు!

‣ ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

Posted Date: 18-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం