• facebook
  • whatsapp
  • telegram

మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

ఆధునిక సాగు పద్ధతులను ఆచరించి, మార్కెట్‌ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఐరోపా దేశాల రైతులు లాభాలు పొందుతున్నారు. అక్షరాస్యులు కావడం, ప్రభుత్వాల తోడ్పాటు వారికి ఇతోధికంగా ఉపయోగపడుతున్నాయి. భారత్‌లోనూ అన్నదాతలు ఆధునిక సాంకేతికతలను పూర్తిస్థాయిలో వినియోగించుకొన్నప్పుడే సాగు రంగం పురోగమిస్తుంది.

భారత్‌తో పోలిస్తే విస్తీర్ణంలో ఎంతో చిన్నదైన ఇజ్రాయెల్‌ ప్రపంచ మామిడి పండ్ల ఎగుమతుల్లో అగ్రస్థానం సాధించింది. మామిడి ఉత్పత్తిలో రారాజుగా ఇండియాకు పేరున్నా... పంటను అంతర్జాతీయ మార్కెట్లకు సకాలంలో తీసుకువెళ్ళడంలో ఇజ్రాయెల్‌ సఫలమవుతోంది. ఫలితంగా ఎగుమతుల్లో మనకంటే ఎంతో ముందుంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అధికోత్పత్తులు సాధించడంతో పాటు, ఉత్పత్తికి సరైన మార్కెట్లను అన్వేషించడం ఎంతో కీలకమని ఇజ్రాయెల్‌ సాగుశైలి ప్రపంచానికి పాఠాలు నేర్పుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే మన పద్ధతులను ఎంతో మార్చుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిర్దేశించిన ఆహార ప్రమాణాలను పాటించకపోతే మన ఎగుమతులు తిరస్కరణకు గురవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలకు అవసరమైన సమయంలో ఉత్పత్తులు చేరేలా మన ఎగుమతుల వ్యూహం ఉండాలి. ఈ విషయంలో ఇజ్రాయెల్‌, థాయ్‌లాండ్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు అనుసరిస్తున్న సాంకేతికతను, మార్కెట్‌ వ్యూహాలను భారతీయ రైతులు అధ్యయనం చేసి ఆచరణలో పెట్టాలి. ఇందులో భాగంగా బిగ్‌డేటా ఎనలిటిక్స్‌ సాయంతో ఉత్పత్తి-మార్కెట్‌-ఎగుమతి వ్యూహాలను ఖరారు చేసుకోవాలి.

అంకుర సంస్థల తోడ్పాటు

ఒక పంటకాలంలో సేకరించిన సాగు వివరాలు తరవాతి సీజన్‌కు, భవిష్యత్‌ అవసరాలకు ఉపకరిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా రైతులు పంట పండించే క్రమంలో- గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. నేడు ఎన్నో అంకుర సంస్థలు ‘డేటా ఎనలిటిక్స్‌’ సేవలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఒక నేలలోని భూసార పరిస్థితులకు అనుగుణంగా పంట రకాలను ఎంపిక చేసుకుని సరిపడా ఎరువులను వాడే అవకాశం ఈ పద్ధతివల్ల రైతులకు దక్కుతుంది. గతంలో ధరల వివరాలు, ఏయే దేశాలకు మన ఉత్పత్తులను ఏ నెలల్లో పంపిస్తే మంచి ధరలు దక్కుతాయి వంటి అంశాలపట్లా స్పష్టత వస్తుంది. దానివల్ల రైతులు తమ పంట కాలాన్ని కాస్త అటు ఇటుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. భారత్‌లో ‘ఫైలో’ అనే అంకుర సంస్థ చీడపీడల నివారణ మార్గాలను నిర్దేశిస్తోంది. రైతులకు సమగ్ర పంట ప్రణాళికను అందిస్తోంది. ఈ ప్రణాళికలను అనుసరిస్తూ ఆధునిక సేద్య విధానాలను ఆచరించడం ఎంతో అవసరం. పంటకు అవసరమైన మేర మాత్రమే నీరు, ఎరువులు, క్రిమిసంహారకాలను అందించడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు.

ఎలాంటి రసాయనాలనూ వాడని సేంద్రియ ఉత్పత్తులకు విదేశాల్లో ఎంతో గిరాకీ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా సుస్థిర, సేంద్రియ సాగు విధానాలను అనుసరించడాన్నే ‘ప్రెసిషన్‌’ వ్యవసాయంగా వ్యవహరిస్తారు. ఒక పొలంలోని ఒక భాగం పల్లంగా మరో భాగం కాస్త ఎత్తుగా ఉండవచ్చు. ఈ కారణంగా సూర్యరశ్మి పొలంలోని అన్ని భాగాలకూ సమానంగా సోకని పరిస్థితి ఉండవచ్చు. ఫలితంగా మొత్తం పొలానికి ఒకే రకమైన ఫలితాలను ఆశించలేం. దీనికి విరుగుడుగా ఇటలీకి చెందిన ‘అగ్రికోలస్‌’ అనే అంకుర సంస్థ పంటల యాజమాన్యాన్ని మెరుగుపరచేందుకు ప్రెసిషన్‌ సేద్య పద్ధతులను ప్రవేశపెట్టింది. పొలంలోని అన్ని భాగాల్లో మొక్కల పత్రహరితం, పంటపై సూర్యరశ్మి పడుతున్న తీరు, నీటి ఎద్దడి పరిస్థితులు, మొక్కల్లోని పోషకాల స్థితి, పంట ఎదుగుదల తదితర అంశాల్లో సమస్యలుంటే తగిన పరిష్కారాలను సూచిస్తోంది. డ్రోన్లు తీసే త్రీడీ చిత్రాలను సెన్సర్ల సాయంతో నిశితంగా పరిశీలించి మొక్కల ఆరోగ్యం, పోషకాల అవసరం తదితర వివరాల గురించి తెలుసుకోవచ్చు. సకాలంలో సత్వర నివారణ చర్యలతో పంటల యాజమాన్య ఖర్చులు తగ్గించుకుని లాభపడేలా సాంకేతిక పరిజ్ఞానం రైతులకు తోడ్పడుతోంది. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం సేద్యంలో ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్నాయి. ప్రకృతి విపత్తుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించడం మన చేతిలో ఉంది. తుపానులు, సూర్యరశ్మి పడే రోజులు, వర్షం కురిసే అవకాశాలు వంటి ముందస్తు సమాచారంతో రైతుల్ని మేల్కొలిపేలా ఉపగ్రహ ఆధారిత సేవలు పలు అంకుర సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా రైతులకు అందుతున్నాయి.

సంస్కరణలు అత్యవసరం

ఒకవైపు సాగురంగంలో సాంకేతికత విప్లవం సృష్టిస్తుంటే ప్రభుత్వాలు తదనుగుణంగా రైతుల్ని సంసిద్ధం చేయలేకపోతున్నాయి. ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) ఏర్పాటు ద్వారా సంఘటితంగా రైతులు మెరుగైన ఆదాయాలు పొందుతారని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కొంతవరకు అది వాస్తవమే అయినా, అందుకు అవసరమైన ఆధునిక వసతుల కల్పన జరిగితేనే ప్రయోజనం ఉంటుంది. ఉత్పత్తికి విలువ జోడించి విక్రయించడంపై అవగాహన పెంచాలి. ఎగుమతి అవకాశాలను గుర్తించి తదనుగుణంగా రైతుల్ని ప్రోత్సహించాలి. లాభసాటి ధర అందేలా ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకువెళ్ళే సమయం, ఆ మేరకు పంటకాలాన్ని మార్చుకునే వ్యూహాలను రైతులకు అందించాలి. అన్ని పంటలకూ లాభసాటి ధరలు దక్కేలా ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ వ్యవస్థలో సంస్కరణలు తేవడం అత్యవసరం. రైతుల ఆదాయం పెరగాలంటే గ్రామ స్థాయిలో వారిని సంఘటితం చేసి వారి నైపుణ్యాలకు పదునుపెట్టాలి. సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు కొంతకాలం ఆర్థికంగా వారికి చేయూతనివ్వాలి. రైతులు ఎగుమతి ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తేనే సాగురంగంలో ఆధునిక భారతావనిని ఆవిష్కరించవచ్చు!

సాగులో సాంకేతిక విప్లవం

వ్యవసాయ రంగంలో 5జీ సాంకేతికత విప్లవం సృష్టిస్తోంది. రోబోలు, యంత్రాలను సెన్సర్ల సాయంతో మరింత వేగంగా, నైపుణ్యంతో పని చేయించేలా 5జీ సాంకేతికతను ఉపయోగించుకోవడంపై కొన్ని సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాల నుంచి హైస్పీడ్‌ అంతర్జాలం సాయంతో పంటలకు సంబంధించి మరింత కచ్చితమైన సమాచారాన్ని పొందుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ‘ఎలెనెక్స్‌’ అనే సంస్థ సేద్యంలో వాడే యంత్రాలకు సంబంధించిన కొత్తరకం సెన్సర్లను రూపొందిస్తోంది. బ్యాటరీతో నడిచే పరికరాల ద్వారా పంటల ఎదుగుదల, నీటి సరఫరా, పీడనం, నీటి నాణ్యత, ఉష్ణోగ్రతల్ని లెక్కించి కచ్చితమైన సమాచారాన్ని రైతులకు అందిస్తోంది. అమెరికాకు చెందిన ‘అగ్రిలింక్స్‌’ సంస్థ ‘ఫ్లెక్స్‌’ అనే వ్యవస్థ ద్వారా పంటల పర్యవేక్షణపై తాజా సమాచారాన్ని అందిస్తోంది. తక్కువ బ్యాండ్‌విడ్త్‌తో అయిదు మైళ్ల పరిధిలో రైతుల మొబైల్‌ ఫోన్లకు ఈ తరహా సమాచారాన్ని చేరవేస్తోంది.

- అమిర్నేని హరికృష్ణ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సుస్థిరాభివృద్ధికి సైన్సే సోపానం

‣ ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

‣ భూసార రక్షణతో ఆహార భద్రత

‣ అప్పుల కుప్పలు... భావి తరాలకు తిప్పలు!

‣ ఆవిష్కరణలకు ప్రోత్సాహం... ప్రగతికి మార్గం

‣ ఒకే భూమి... ఒకే కుటుంబం... భవిత ఉజ్జ్వలం!

Posted Date: 18-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం