• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ... పుడమికి సంరక్షణ!

నానాటికీ తీవ్రతరమవుతున్న పర్యావరణ మార్పులతో ప్రకృతి విపత్తులు ముమ్మరిస్తున్నాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పంట భూములు దెబ్బతింటున్నాయి. దానివల్ల పుడమిపై మానవాళి జీవనం నరక ప్రాయంగా మారుతోంది.

వాతావరణ మార్పుల పెను ప్రభావాలు పుడమిపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి విపత్తులు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో దాదాపు ప్రతిరోజూ భారత్‌ ఏదో ఒక రకంగా ప్రకృతి విపత్తును చవిచూసింది. ఈ మేరకు శాస్త్రీయ, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) నివేదిక ఇటీవల ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ప్రకృతి విపత్తుల వల్ల తొమ్మిది నెలల్లో దేశీయంగా రెండున్నర వేల మందికి పైగా అసువులు బాశారు. పద్దెనిమిది లక్షల హెక్టార్లలో పంటలు ప్రభావితమయ్యాయి. నాలుగు లక్షల గృహాలు ధ్వంసమయ్యాయి. డెబ్భై వేల పశువులు చనిపోయాయి. ఈ విధ్వంసం మొత్తం ప్రకృతి మార్పుల ఫలితమేనని సీఎస్‌ఈ, డౌన్‌ టు ఎర్త్‌ పత్రికల సంయుక్త పరిశీలన స్పష్టం చేసింది.

పెను విధ్వంసం

ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి సెప్టెంబరు నెలాఖరుదాకా భారత్‌లో 242 భీతావహ ప్రకృతి విపత్తులు తలెత్తాయి. దేశంలోని ఒకటి లేదా అనేక ప్రాంతాలు ఉష్ణ, శీతల గాలులు, తుపానులు, భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల బారిన పడ్డాయి. మధ్యప్రదేశ్‌ అత్యధిక ప్రకృతి విపత్తులను చవిచూసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికంగా 359 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల కుండపోత వానలు అధికమయ్యాయి. 1953-2018 మధ్య కాలంలో భీకర వర్షాలు, వరదల వల్ల ఇండియాలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఇటీవల జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) అధ్యయనం తేల్చింది. ఈ నష్టంలో యాభై శాతం చివరి పదేళ్లలోనే సంభవించింది.

అమెరికా, చైనా తరవాత 1990 నుంచి ప్రకృతి విపత్తులు అధికంగా ఎదుర్కొంటున్న మూడో దేశంగా భారత్‌ నిలుస్తోంది. వాటివల్ల 2001 నుంచి దేశీయంగా వంద కోట్ల మంది ప్రభావితమయ్యారు. దాదాపు 83 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఫలితంగా భారత్‌ దాదాపు రూ.13 లక్షల కోట్ల మేర నష్టపోయిందని, జీడీపీలో ఇది ఏకంగా ఆరు శాతానికి సమానమని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్‌బీఐ) నివేదిక నిరుడు స్పష్టం చేసింది. పర్యావరణ మార్పుల వల్ల నదీ పరీవాహక ప్రాంతాల్లో తీవ్రస్థాయి వరదలు అధికమయ్యాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరదలు చుట్టుముట్టి ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయి. వాటివల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఇరవై లక్షల మంది ప్రభావితమయ్యారు. ఈ ఏడాది జులైలో తలెత్తిన వరద ముంపు కారణంగా తెలంగాణ రాష్ట్రం రూ.1,400 కోట్ల మేర నష్టపోయింది. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ముంబయి వంటి నగరాలూ ఇటీవల అధికంగా వరదల బారిన పడుతున్నాయి. రాబోయే రోజుల్లో జనాభా అధిక శాతం నగరాల్లోనే కేంద్రీకృతం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కుంచించుకుపోతున్న జల వనరులు, అక్రమ నిర్మాణాలతో నగరాలు వరద విలయంతో విలవిల్లాడే ముప్పు దాపురించింది. దీన్ని నివారించాలంటే పట్టణ ప్రణాళికలు పటిష్ఠంగా అమలు కావాలి. భారీ వర్షాలు అధికమైన క్రమంలో దేశీయంగా పిడుగులు సైతం పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొంటున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 1967-2019 మధ్య కాలంలో భారత్‌లో పిడుగుల బారిన పడి లక్ష మంది మరణించారు. ప్రకృతి విపత్తుల మొత్తం మరణాల్లో అవి 33శాతం!

మేల్కొలుపు అవసరం

మానవాళిపై పడగవిప్పిన ప్రకృతి విపత్తులను నిలువరించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. అందుకోసం అడవుల విస్తీర్ణాన్ని పెంచాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని వీలైనంతగా తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని పెంచాలి. కర్బన ఉద్గారాలను తగ్గించకపోతే 2100 సంవత్సరం నాటికి హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీల సెల్సియస్‌ మేర ఎగబాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే కుండపోత వానలు, భీకర వరదలతో పెను విలయం తప్పదన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అరేబియా సముద్ర ఉష్ణోగ్రతలూ ఇటీవల పెరగడం తుపానుల ముప్పును యాభైశాతం మేర పెంచింది. పుడమి పరిరక్షణను కోరి ‘కాప్‌’ వంటి అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తున్నారు. వాటిలో చేసే తీర్మానాలను ప్రపంచ దేశాలు సక్రమంగా అమలు చేయడంలేదు. భవిష్యత్‌ తరాలు భూమిపై మనుగడ సాగించాలంటే ఉష్ణోగ్రతలకు కళ్లెం వేయడం తప్పనిసరి. ఇందుకోసం కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం; పుడమిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత! 

- మైత్రేయ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పొరుగుపై చైనా దూకుడు

‣ జీ20 అధ్యక్షత... భారత్‌పై గురుతర బాధ్యత!

‣ కశ్మీర్‌పై అమెరికా ద్వంద్వ వైఖరి

‣ మార్కెట్‌ వ్యూహాలతో లాభసాటి సేద్యం

‣ సుస్థిరాభివృద్ధికి సైన్సే సోపానం

‣ ఉపప్రణాళికల అమలులో లొసుగులెన్నో!

‣ పేదలకు దక్కని ఉచిత న్యాయం

Posted Date: 18-11-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం