• facebook
  • whatsapp
  • telegram

పీడన గుప్పిట్లో స్త్రీ

స్త్రీలపై హింసా నిరోధక దినోత్సవం. మహిళలకు స్వేచ్ఛ పెరిగిందని; ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ గొప్పగా వింటుంటాం. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపే. నేటికీ అన్ని రంగాల్లో స్త్రీలపై దుర్విచక్షణ, పీడన, హింస కొనసాగుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా దుర్విచక్షణ, అసహనం, హింస... అన్నిచోట్లా వారిపై కనిపిస్తూనే ఉన్నాయి. మగవారికి దీటుగా పోటీ ప్రపంచంలో నిలబడుతున్నా ఎన్నో రూపాల్లో వారు వేదనకు గురవుతున్నారు. వికృతమైన చూపులు, వ్యంగ్యపు మాటలు, అనుమానించడం, అవమానించడం, వదంతులు పుట్టించి అప్రతిష్ఠ పాలు చేయడం... ఇలా ఎన్నో విధాలుగా మహిళలు పీడనను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మానవహక్కుల ఉల్లంఘనలే అని ఐక్యరాజ్య సమితి ఉద్ఘాటిస్తోంది. ఐరాస నివేదిక ప్రకారం నిరుడు ప్రపంచవ్యాప్తంగా 24.3 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక దాడులకు గురయ్యారు. ప్రతి పది మందిలో ముగ్గురు స్త్రీలు భర్తల చేతిలో హింసను ఎదుర్కొన్నారు. వారిలో విద్యావంతులే అధికం.

కఠిన చట్టాలున్నా...

పితృస్వామ్య భావజాలం నిండిన సమాజంలో ప్రతి విషయానికీ మహిళలనే బాధ్యులను చేసి శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తున్నారు. మన చుట్టూ ఉన్న అమ్మ, అక్క, చెల్లి... ఇలా ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో ఈ హింసను అనుభవించినవారే. నిరక్షరాస్యత, కుటుంబ పరిస్థితులు, ప్రేమ, పెళ్ళి, ఉపాధి వంటివి స్త్రీలు పీడనను ఎదుర్కోవడానికి కారణమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, పోర్నోగ్రఫీ, మద్యపానం, మాదకద్రవ్యాలు, పేదరికం, ఆడపిల్లల నిస్సహాయత వంటివీ వారిపై హింసను ప్రేరేపిస్తున్నాయి. అభివృద్ధిలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలు, జీవనశైలిలో మార్పులు సైతం స్త్రీల భద్రతపై కొంత ప్రభావం చూపుతున్నాయి. వీటన్నింటినీ నాలుగు దశాబ్దాల కిందటే ఐరాస గుర్తించింది. అందుకే స్త్రీల రక్షణ, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ఏటా నవంబరు 25ను ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసా నిరోధక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజున స్త్రీలకు తమ హక్కులపై అవగాహన కల్పిస్తారు. 2030 నాటికి స్త్రీలు, బాలికలపై లింగ పరమైన హింసను నిర్మూలించాలనే లక్ష్యంతో నేటి నుంచి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అయిన డిసెంబరు 10 వరకు ప్రపంచవ్యాప్తంగా పదహారు రోజుల పాటు క్రియాశీల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది.

ఇల్లు, కార్యాలయం అనే తేడా లేకుండా అన్ని చోట్లా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు శారీరకంగా, లైంగికంగా, మానసికంగా ఏదో ఒక రూపంలో హింసను అనుభవిస్తున్నారు. మరోవైపు ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా వారిపై అకృత్యాలు ఆగడంలేదు. ఇటీవల దిల్లీలో కాల్‌సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధావాకర్‌ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనతో సహ జీవనం చేస్తున్న ఆఫ్తాబ్‌ను పెళ్ళి చేసుకోవాలని కోరినందుకు మాదకద్రవ్యాల మత్తులో అతడు శ్రద్ధాను అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. స్త్రీలపై ఇలాంటి హేయ నేరాలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నో ఉద్యమాలు, ఆలోచనలు, చర్చోపచర్చల అనంతరం గృహహింసకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చట్టం తెచ్చారు. అయినా గృహిణులపై దాడులు ఆగడంలేదు. దోషులకు సరిగ్గా శిక్షలు సైతం పడటంలేదు. ఎంతో మంది స్త్రీలకు గృహ హింస నిరోధక చట్టంపై సరైన అవగాహన కొరవడింది. దేశంలో 29శాతం మహిళలు గృహహింసను ఎదుర్కొంటున్నట్లు అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఐరాస నివేదికల ప్రకారం 18 నుంచి 34 ఏళ్ల లోపు మహిళలే అధికంగా హింసను ఎదుర్కొంటున్నారు. కరోనా తరవాత ఉద్యోగాల కోత, ఆర్థిక ఇబ్బందులు వంటివాటితో చాలామంది మహిళల స్థితిగతులు దిగజారిపోయాయి. కొవిడ్‌ అనంతరం మహిళలపై గృహహింస పెరిగినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. అంతర్జాతీయంగా మానవ హక్కుల ఉల్లంఘనల్లో మహిళలపై హింసే తొలి స్థానంలో నిలుస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సామాజిక రుగ్మత

ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదకొండు నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక తన సన్నిహితులు లేదా సొంత కుటుంబీకుల చేతుల్లోనే బలవుతున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీలపై సామాజిక మాధ్యమాల ద్వారానూ హింస పెరిగిందని ఆయన వెల్లడించారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పటిష్ఠ చట్టాలను రూపొందించి సమర్థంగా అమలు చేయాలని సూచించారు. మహిళలపై హింసను ఒక సామాజిక రుగ్మతగా పరిగణించాలి. దీన్ని నివారించాలంటే మార్పు మన ఇంటి నుంచే మొదలుకావాలి. మహిళలు సైతం నిండైన ఆత్మవిశ్వాసంతో తమపట్ల దుర్విచక్షణ, పీడనలపై బలంగా గళం వినిపించాలి. ప్రతిఒక్కరూ అక్షరాస్యులై ఆర్థిక సాధికారత సాధించాలి. తమ రక్షణ కోసం తెచ్చిన చట్టాల సమగ్ర అమలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిన అవసరమూ ఉంది.

- స్వాతి కొరపాటి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భాగ్యనగరం... హరిత శోభితం!

‣ సమస్యల ఊబిలో రేపటి పౌరులు

‣ భద్రతతోనే మహిళా సాధికారత

‣ వణికిస్తున్న ప్రకృతి విపత్తులు

‣ జీ20 నాయకత్వం బృహత్తర అవకాశం

‣ ద్వైపాక్షిక బంధానికి కొత్త చివుళ్లు

‣ నీరుగారుతున్న సహ చట్ట స్ఫూర్తి

Posted Date: 26-11-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం