• facebook
  • whatsapp
  • telegram

హరిత ఆర్థికంతోనే భవిత

పర్యావరణహిత పురోభివృద్ధే ప్రాథమ్యం కావాలి

ఉత్తరాఖండ్‌లో మంచుకొండ విరిగిపడి జలప్రళయం సంభవించింది. అమెరికాలోని టెక్సాస్‌ వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో గడ్డ కట్టించే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పును నిలువరించే తక్షణ చర్యలు తీసుకోనట్లయితే- రాబోయే కాలంలో మానవాళి మనుగడనే ఇది ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. ప్రతి సెకనుకూ ఒక ఫుట్‌బాల్‌ మైదానం అంత అడవి ఈ భూమినుంచి అంతరించిపోతోందని అంచనా. రానున్న ఉపద్రవాన్ని గుర్తించిన దేశాలు ఇప్పటికే మేల్కొని- వాతావరణ మార్పును అడ్డుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇది ఆశావహ పరిణామం. భారత్‌ వంటి దేశాలు సైతం పర్యావరణ ప్రతికూలమైన పాతకాలపు ఆర్థిక వృద్ధి మూసల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలి. సుస్థిర అభివృద్ధికి దోహదపడే నూతన వనరులను గుర్తించాలి. 

తరుముతున్న విపత్తులు

వాతావరణ మార్పుల ఫలితంగా భూమిపై తరచూ అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి. ఆకస్మిక వరదలు వెల్లువెత్తుతాయి. కరవుకాటకాలు సంభవిస్తాయి. ఇలాంటి విధ్వంసకర దుష్ప్రభావాలవల్ల పేద దేశాలే అత్యంత అధికంగా దెబ్బతింటాయి. గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు 1990లో 24.8 బిలియన్‌ టన్నులు ఉండగా, 2017నాటికి అవి 50.8 బిలియన్‌  టన్నులకు రెట్టింపు అయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒక టన్ను కర్బన ఉద్గారాల సామాజిక వ్యయం 100 డాలర్లు ఉంటుందని  ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్‌ అవార్డు గ్రహీత  జోసెఫ్‌ స్టిగ్లిజ్‌ లెక్కగట్టారు. ఆర్థిక వ్యవస్థపై వీటి నివారణ చర్యల భారం తీవ్రంగానే ఉంటుంది. ఉదాసీనంగా ఉండిపోతే, సమాజం ఎదుర్కోవలసి వచ్చే ప్రకృతి విపత్తులు బీభత్సంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అటు సమాజాన్నీ ఇటు ఆర్థికాన్నీ రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇది నిజంగా సవాలే. ఎందుకంటే.. రేపటి విపత్తును కచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదు. వాతావరణ మార్పు విషయంలో ఇది మరీ కష్టం. కాలుష్యం, గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాలు ఎంత ఎక్కువైతే వాటి విపరిణామాలు అంత అధికమవుతాయి. అవి ఎంత అధికమైతే వాటిని ఎదుర్కోడానికి అయ్యే వ్యయాలూ అంత పెరుగుతాయి. చివరకు ఇదొక విష వలయంగా మారిపోతుంది. ప్రపంచం ఇప్పటికే సుస్థిర హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోంది. ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టదలచే  పారిశ్రామికవేత్తలకు, దేశాలకు నిధుల లభ్యత క్రమంగా పెరుగుతోంది. 

హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ పరివర్తన వేగవంతం కావాలి. ఇందుకు వీలుగా ప్రభుత్వ చట్టాలూ నిబంధనలూ మారాలి. ప్రాజెక్టుల రుణ సమీకరణ అర్హతల్లో మార్పులు తీసుకురావాలి. బ్యాంకులతో సంప్రదించి ప్రభుత్వం ఒక నియమావళిని రూపొందించాలి. పర్యావరణ కాలుష్యం, గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల కొలమానం ఆధారంగా రుణాలు ఇవ్వాలి. కేవలం నిర్మాణ కాలంలోనే కాకుండా, ప్లాంటు జీవితకాలంలో అది వెలువరించే మొత్తం ఉద్గారాలను పరిగణనలోకి తీసుకునేలా- ప్రస్తుత పర్యావరణ ప్రభావ మదింపునకు భిన్నంగా నూతన నిబంధనలు ఉండాలి. పరామితులకు అనుగుణంగా ఉంటేనే రుణాలు అందించాలి.  వడ్డీ రేట్లకూ ఈ అర్హతలను వర్తింపజేయాలి. అదేవిధంగా, క్రెడిట్‌ రేటింగును ఉద్గారాలతో ముడిపెట్టాలి. ఈ చర్య పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. అదుపు తప్పిన సంస్థలు తమ మితి మీరిన ఉద్గారాలకు పరిహారంగా కర్బన పరపతి హక్కులు (కార్బన్‌ క్రెడిట్స్‌) కొనుగోలు చేసేలా విధానం ఉండాలి.  పర్యావరణ అనుకూల సాంకేతికతలు ఉపయోగించి కర్బన ఉద్గారాలు తగ్గించుకున్న సంస్థలకు ఆ మేరకు కర్బన పరపతి హక్కులు లభించాలి. వాటిని విక్రయించుకుని అవి లబ్ధి పొందుతాయి. ప్రస్తుతం ఒక వ్యాపార సంస్థకు రుణం ఇచ్చే ముందు రుణదాతలు దాని ‘పరపతి యోగ్యత’ను చూస్తున్నారు. అలాగే ఒక  సంస్థ వల్ల వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో సూచించే ‘దుర్బలత్వ సూచీ’ (వల్నరబిలిటీ ఇండెక్స్‌)నీ పరిగణనలోకి తీసుకోవాలంటూ ఇటీవల ఒక ప్రతిపాదన వచ్చింది.  ఈ విధమైన వినూత్న విధానాలు రూపొందించి అమలు చేసినప్పుడే పర్యావరణాన్ని నాశనం చేసే వ్యాపారాలు, ఉత్పత్తి ప్రక్రియలు నిలిచిపోతాయి.  

స్వచ్ఛ ఇంధనం దిశగా...

ధనిక దేశాలు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఐఎఫ్‌సీ వంటి బహుపాక్షిక సంస్థలు, అంతర్జాతీయ బ్యాంకులు ఆయా వ్యాపార సంస్థలకు నిధులు సమకూర్చి బదులుగా వాటి మూలధనంలో వాటాలను తీసుకునే ఆనవాయితీ ఉంది. అదే తరహాలో ‘ప్రకృతి రుణాలు’ (డెట్‌ ఫర్‌ నేచర్‌ స్వాప్స్‌) ఇవ్వడం మరో మంచి విధానం అవుతుంది. ఈ తరహా రుణం తీసుకునే దేశం భారీ విస్తీర్ణంలో అడవులను, ఇతర జీవ వైవిధ్య ప్రాంతాలను రుణదాతల పేరిట రిజర్వ్‌ చేసి వాటిని పరిరక్షిస్తుంది. బొలీవియా అడవులను కాపాడటానికి  ప్రపంచ వన్యప్రాణి నిధి (వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌- డబ్ల్యుడబ్ల్యూఎఫ్‌) 1984లో మొదటగా ఈ ‘ప్రకృతి రుణాల’ ప్రతిపాదనను సూచించింది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాల్లోని దాదాపు 30దేశాలకు ఇలా రుణాలు ఇచ్చారు. ప్యారిస్‌ క్లబ్‌ సభ్య దేశాలైన యూఎస్, జర్మనీ, ఇతర ధనిక ఐరోపా దేశాలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాయి. స్వచ్ఛ ఇంధనానికి, స్వచ్ఛ ఉత్పత్తి కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థలకు, ముఖ్యంగా బంజరు భూములు వినియోగించుకునే ప్రాజెక్టులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం- ప్రభుత్వం పరిశీలించాల్సిన మరో పరిష్కార మార్గం. ఇటీవలి కాలంలో కాల్వలు, సరస్సులపై సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ప్రోత్సహించడం ఉత్తమ విధానం అవుతుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి వాడే సాంకేతికత వ్యయం బాగా తగ్గిపోయినందున పెట్టుబడిదారులకు ఇది అదనపు ఆకర్షణ అవుతుంది. 

భూమి రాత మార్చే సంప్రదాయేతర విద్యుత్తు

ప్రపంచ సంప్రదాయేతర ఇంధన రంగం 2019లో 282 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది, ఈ మొత్తంలో 138 బిలియన్‌ డాలర్లు పవన విద్యుత్తుకు, 131 బిలియన్‌ డాలర్లు సౌరశక్తికి సమకూరాయి. 2010నుంచి 2019 వరకు గడిచిన పదేళ్ల కాలాన్ని చూసినట్లయితే- 2.6 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఈ రంగంలోకి ప్రవహించాయి. సంప్రదాయేతర ఇంధనాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2020 అంతానికి 2600 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. మొత్తంగా ప్రపంచ విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యంలో ఇది 38 శాతానికి సమానం. ఈ వాటా 2030 నాటికి 55 శాతానికి, 2050 నాటికి 74 శాతానికి పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 


 

Posted Date: 02-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం