• facebook
  • whatsapp
  • telegram

  ప్రకృతి ఒడిలో పదిలంగా...

దీపం చుట్టూ ముసిరే పురుగులు ఈమధ్య తగ్గిపోతున్నట్లున్నాయి కదూ. వానాకాలంలో కిటికీ అద్దాల మీద కమ్ముకునే పురుగులు, వేసవిలో పండ్ల మీద వాలే ఈగలు కూడా మునుపటంత జోరుగా కనిపించడం లేదు. ఈతరం పట్టణ బాలలు మిణుగురు పురుగులను చూసైనా ఉండరు. తుమ్మెదల ఝంకారాలు, కీచురాళ్ల గోల కూడా పెద్దగా వినిపించడం లేదు. అంతరిస్తున్న క్రిమికీటక జీవ వైవిధ్యానికి సూచనలివి...
భూగోళంపైని జీవజాలంలో సగానికిపైగా క్రిమికీటకాలే. ప్రపంచంలో మొత్తం 55 లక్షల కీటక జాతులు ఉంటే, వాటిలో 40 శాతం మరికొన్ని దశాబ్దాల్లో అంతరించిపోవచ్చని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే గడచిన 25 ఏళ్లలో 40 శాతం తేనెటీగలు అదృశ్యమయ్యాయని అధ్యయనాల్లో తేలింది. మొక్కలు, కీటకాలు పరస్పరాశ్రితంగా పరిణామం చెందాయి. అడవులు క్రమంగా అంతరించిపోవడం కీటకాల పాలిట శాపమవుతోంది. తేనెటీగలు, తుమ్మెదల వంటి కీటక జాతులు లేనిదే మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగదు. ఈ కీటకాలు వ్యాపింపజేసే పుప్పొడి వల్లనే ప్రపంచంలోని 124 ప్రధాన పంటల్లో 75 శాతం, పూలమొక్కల్లో 94 శాతం మనుగడ సాగించగలుగుతున్నాయి. భూమిపైనున్న 700 కోట్ల మానవ జనాభా మనుగడకు కీటకాలే శరణ్యం. పరపరాగ సంపర్కం లేనిదే మామిడి, నిమ్మ, నారింజ, ఆపిల్‌, బొప్పాయి, పుచ్చ తదితర పండ్లు; ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, బెండకాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ వంటి కూరగాయలు; కొబ్బరి కాయలు, సెనగలు, బాదం, జీడిపప్పు, చాక్లెట్‌, కాఫీ వంటివి కూడా దొరకవు. వీటితోపాటు మసాలా దినుసులు, తేనె, లక్క, పట్టు, కొన్ని మందుల కోసం కూడా కీటకాలపై ఆధారపడుతున్నాం. పొద్దుతిరుగుడుతో పాటు పలు రకాల నూనెగింజలు సైతం పరపరాగ సంపర్క కీటకాల వల్లనే లభ్యమవుతున్నాయి. కీటకాలను ఆహారంగా తీసుకునే మానవ తెగలు చాలానే ఉన్నాయి. 113 దేశాల్లోని మూడువేల జాతుల ప్రజలు 1,500 కీటక జాతులను భుజిస్తున్నారు. కీచురాళ్లు, గొల్లభామలు, చీమలు తదితరాలు వీరికి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి.


స్వచ్ఛతా సారథులు
చెత్తాచెదారం, మలమూత్రాలు, మృత కళేబరాలు, ఇతర విసర్జకాలను క్షయింపజేసి మట్టిలో కలిపే పేడ పురుగులు, ఇతర క్రిములు లేనిదే భూసారం పెరగదు. చిమ్మెటలు, సీతాకోక చిలుకలు, చీమలు, కందిరీగలు, తుమ్మెదలు, తేనెటీగల్లో మూడోవంతు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఐరోపా, అమెరికాల్లో జరిగిన అధ్యయనాలు హెచ్చరించాయి. భారతదేశంలో బ్రిటిష్‌ పాలన కాలంలో జరిగిన సర్వే తప్ప స్వతంత్ర భారతంలో కొత్త అధ్యయనాలేవీ జరగకపోవడం విడ్డూరం. బ్రిటిష్‌ ఇండియా సర్వేలో పేర్కొన్న అనేక కీటక జాతులు ఇప్పటికే అదృశ్యమయ్యయి. ప్రపంచమంతటా క్షీరదాలు, పక్షులు, సరీసృపాలకన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా క్రిమికీటకాలు అంతరించిపోతున్నాయి. కీటకాలు లేకపోతే వాటిని తిని బతికే పక్షులు, చేపలు, పాములు, బల్లులు మరింత వేగంగా అంతరిస్తాయి. క్రిమికీటకాలు ఏటా 2.5 శాతం చొప్పున కనుమరుగవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరో వందేళ్లలో అవి పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. మంచినీటి చెరువులు, వాగుల్లో సహజంగా పోషకాలు తక్కువగా ఉంటాయి. వాటిలో తూనీగలవంటి క్రిమికీటకాలు పడినప్పుడు నీటిలో కర్బనం, భాస్వరం, నత్రజనిపాళ్లు పెరిగి చేపలకు ఆహారంగా మారతాయి. కీటక నాశనుల వల్ల ఈమధ్య చెరువులు, వాగుల పక్కన తూనీగల సందడి తగ్గిపోయింది. ఎరువులు, క్రిమి సంహారక మందులతో చేసే సాంద్ర వ్యవసాయ విస్తరణ పక్షులు, క్రిమి కీటకాల పాలిట మృత్యువుగా మారుతోంది. పెరుగుతున్న మానవ జనాభా కోసం అడవుల నరికివేత, పట్టణాల విస్తరణ కీటకాలకు శాపాలయ్యాయి. సెల్‌ ఫోన్లు తేనెటీగల సంచారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని 2010నాటి అధ్యయనం వెల్లడించింది. అన్నింటినీ మించి భూతాపం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలూ క్రిమికీటకాలకు చేటు తెస్తున్నాయి. భూతాపం వల్ల వర్షపాతంలో మార్పులు వస్తూ వృక్షసంపదకు చేటు తెస్తున్నాయి. వనాలతోపాటు వాటిని ఆశ్రయించుకున్న క్రిమికీటకాలూ కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పంటపొలాల చుట్టూ పొదలు, చెట్ల గుబుర్లు ఉండేవి. పొలంగట్ల మీద ఆముదం తదితర మొక్కలను పెంచేవారు. ఇప్పుడు వాటన్నింటినీ కొట్టేయడంతో మైళ్ల పర్యంతం చెట్టూచేమా లేకుండా బోడిగా పంటపొలాలే కనిపిస్తున్నాయి. 1950, 60లలో మొదలైన ఈ ధోరణి ఇటీవలి దశాబ్దాల్లో మరింత ముమ్మరమైంది. వంకాయ తోటల సమీపంలో పొదలు, చెట్లు 28 శాతం మేరకు, ఆవ పంట సమీపంలో 17 శాతం మేరకు తగ్గినప్పుడు పరపరాగ సంపర్కం క్షీణించి పంట దిగుబడి పడిపోతున్నట్లు భారతీయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గడచిన 20 ఏళ్లలో నియోనికోటినాయిడ్‌, ఫైప్రోనిల్‌ తరగతులకు చెందిన సరికొత్త కీటకనాశనుల వాడకం పెరగడంతో తేనెటీగలు, నేలలోని క్రిములు నాశనమైపోతున్నాయి. లద్దె పురుగులు అదృశ్యమై నేల నిస్సారమవుతోంది. నియోనికోటినాయిడ్స్‌ను ఐరోపాలో నిషేధించినా అవి దొడ్డిదోవలో భారత్‌లో ప్రవేశిస్తున్నాయి. ఈ పురుగు మందుల వల్ల పంట పొలాల సమీపంలోని అభయారణ్యాల్లోనూ 75 శాతం కీటకాలు నశించినట్లు జర్మనీలో అధ్యయనాలు తేల్చాయి. మనిషి మనుగడకు, ఆరోగ్యానికీ పురుగులు కీలకం. ఉదాహరణకు బొద్దింకలంటే అందరికీ అసహ్యమే కానీ, అవి మానవ విసర్జనలను నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొన్ని వ్యాధుల మీద యాంటీబయాటిక్స్‌ పనిచేయని పరిస్థితి వచ్చేసింది. బొద్దింకలు అనేక అంటువ్యాధులను తట్టుకునే శక్తిని సంతరించుకున్నందువల్ల అవి కొత్త రకం యాంటీ బయాటిక్స్‌ తయారీకి వనరుగా ఉపయోగపడవచ్ఛు అందుకే కొత్త యాంటీ బయాటిక్స్‌ కోసం మొక్కలు, శిలీంధ్రాల్లో వెదకడంతోపాటు బొద్దింకలపైనా పరిశోధనలు చేయాలని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.


విస్తృత కార్యాచరణ
1992నాటి జీవ వైవిధ్య ఒప్పందం జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పరపరాగ సంపర్క కీటకాల సంరక్షణకు పరిశోధకులు ఉపక్రమించాలని ఘోషిస్తోంది. తదనుగుణంగా పాశ్చాత్య దేశాల్లో క్రిమికీటకాల మీద జరిగిన అధ్యయనాల వల్ల విస్తృత సమాచారం అందుబాటులోకి వచ్చి తదుపరి కార్యాచరణకు వేదికగా ఉపయోగపడుతోంది. ఆ స్థాయిలో సమాచారం భారత్‌లో కాని, ఇతర ఆసియా దేశాల్లో కాని లభ్యం కావడం లేదు. ముందే చెప్పుకొన్నట్లు మన సమాచారం బ్రిటిష్‌ పాలన కాలంనాటిది. ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. సాటి ఆసియా దేశాల్లోని పరిశోధకులతో చేయి కలపాలని భారత్‌ నిర్ణయించింది. భారత జంతుశాస్త్ర సంఘం సహకారంతో కలకత్తా విశ్వవిద్యాలయం, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, బెంగళూరులోని జాతీయ జీవశాస్త్ర అధ్యయన కేంద్రం నేటి నుంచి 29 వరకు కలకత్తా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆసియా పరపరాగ సంపర్క పరిరక్షణ సదస్సు నిర్వహిస్తాయి. ఆసియాలో పరిశోధకుల యంత్రాంగాన్ని ఏర్పరచడానికి అక్కడ చొరవ తీసుకుంటారు. పరపరాగ సంపర్కుల సమాచార సేకరణను ముమ్మరం చేయడానికి చేతులు కలుపుతారు. కీటకాల మనుగడకు తద్వారా మానవాళికి ముంచుకొస్తున్న ముప్పును నివారించే ఆసియా స్థాయి కృషికి ఈ సదస్సు శ్రీకారం చుడుతుంది.


అందరి బాధ్యత
పుప్పొడిని వ్యాపింపజేసే కీటకాలకూ మనుషుల్లానే ఆహారం, ఆశ్రయం, నీరు, సంతానాన్ని పెంచడానికి భద్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అవసరం. పరపరాగ సంపర్కానికి కీలకమైన ఈ కీటకాలను సంరక్షించడానికి పెరటి తోటలో, పాఠశాల ప్రాంగణాల్లో, సామాజిక ఉద్యానాల్లో మనంచేయగలిగినది ఎంతో ఉంది.
* ఏడాది పొడవునా పుష్పించే రకరకాల పూల మొక్కలను నాటాలి. అవి పరపరాగ సంపర్కానికి తోడ్పడే కీటకాలకు తేనె, పుప్పొడిని అందిస్తాయి. పూల మొక్కలను తోట అంతా చెల్లాచెదరుగా పెంచకూడదు. ఒక్కోచోట రెండు మూడు మొక్కల చొప్పున పెంచితే అవి గుబురుగా పెరిగి తుమ్మెదలను, సీతాకోక చిలులకను ఆకర్షిస్తాయి.
* స్థానిక మొక్కల జాతులను విరివిగా పెంచండి. అవి స్థానిక క్రిమికీటకాలకు నెలవులు. స్థానిక నేలలు, సూర్యకాంతి, తేమదనాల్లో మన మొక్కలు, కీటకాలు సహజంగా వర్ధిల్లుతాయి కాబట్టి పరపరాగ సంపర్కం తేలిగ్గా విస్తరిస్తుంది.
* కీటకాల జీవిత దశలన్నింటికీ ఆధారంగా నిలిచే వివిధ జాతుల మొక్కలను పెంచాలి. లార్వా నుంచి గొంగళి పురుగు, దాని నుంచి సీతాకోక చిలుక పుడుతుంది. ఈ దశలన్నింటికీ ఆహారం అందించే మొక్కలను పెంచాలి.
* క్రిమిసంహారక మందులను వాడరాదు. సేంద్రియ క్రిమినాశనులు సైతం పరపరాగ సంపర్క కీటకాలకు హాని చేయవచ్ఛు ఒకవేళ ఏవైనా కీటక నాశనులను చల్లాల్సి వస్తే సీతాకోక చిలుకలు, తుమ్మెదలు సాయ గూళ్లకు చేరే సాయం సమయాల్లో చల్లండి.
* తోటలో, సామాజిక ఉద్యానాల్లో కొంత భాగాన్ని పిచ్చి మొక్కలకు వదిలేయండి. విశాలమైన సామాజిక వనాల్లో కొంత భాగాన్ని ప్రకృతికి వదిలేస్తే చిన్న అడవిలా తయారవుతుంది. అది పుప్పొడిని వ్యాపింపజేసే కీటకాలకు చక్కని నెలవుగా మారుతుంది.
* తోటలో ఒకచోట విశాలమైన పళ్లెంలో నీరు ఉంచండి. దాని మీద కీటకాలు వాలి దాహం తీర్చుకుంటాయి. లేదా చిన్న బురద నీటి మడుగు ఏర్పరచండి. అందులో కొంత ఉప్పు కణికెలు, కొయ్య మసి కలపండి. ఆ నీరు సీతాకోక చిలుకలు, తుమ్మెదలకు కావలసిన సూక్ష్మ పోషక పదార్థాలను అందిస్తుంది.
* తోటను మరీ శుభ్రంగా ఉంచవద్ధు రాలిన ఆకులను అలానే నేల మీదే మగ్గనివ్వాలి. ఒక మూల కొయ్య మొద్దులను పాతితే అవి తుమ్మెదలు, తేనెటీగలకు ఆశ్రయమిస్తాయి.

- వరప్రసాద్‌

Posted Date: 27-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం