• facebook
  • whatsapp
  • telegram

మంచుకొండలకు పెనుప్రమాదం

పర్యావరణానికి ‘అభివృద్ధి’ శాపం

హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నా- అభివృద్ధి ఆరాటంలో మనిషి వాటిని పట్టించుకోవడం లేదు. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కొంటున్నానని గ్రహించడం లేదు. మానవ కార్యకలాపాలు, వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు హిమాలయాల్లోని సున్నిత సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల హిమనదాలు కరిగిపోతూ పర్వతాల నుంచి జల ప్రవాహాలు ఉద్ధృతంగా కిందకు వచ్చిపడుతున్నాయి. ఆకస్మిక కుంభవృష్టి, మెరుపు వరదల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాననీటి జోరును అడ్డుకోగల అడవులు హరించుకుపోతున్నాయి. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌లో కేవలం రెండు వారాల వ్యవధిలో మట్టిపెళ్లలు విరిగిపడి పదుల సంఖ్యలో జనం మరణించడం- ప్రకృతి మనకు పంపిన తాజా హెచ్చరిక!

ఒకే బాటలో భారత్‌, చైనా

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌ రౌంథీ హిమనద ప్రాంతంలో కొండచరియలు, మంచు గడ్డలు విరుచుకుపడ్డాయి. దాంతో ఆ హిమాలయ రాష్ట్రంలోని రిషిగంగ నదికి ఉద్ధృతంగా వరదలు వచ్చిపడ్డాయి. వరదల తాకిడికి మొదట ఒక వంతెన తునాతునకలైంది. అక్కడి నుంచి వరద నీరు రిషిగంగ జల విద్యుత్కేంద్రానికి చెందిన ఒక బ్యారేజీ మీద పడి దాన్నీ ధ్వంసం చేసింది. ఆ తరవాత తపోవన్‌ విష్ణుగఢ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు బ్యారేజీ క్షణాల్లో నాశనమైంది. ఈ ప్రాజెక్టుకు చెందిన సొరంగాన్ని మట్టీ రాళ్లూ కప్పేశాయి. తరవాత వరదనీరు అలకనంద నది మీద కట్టిన వంతెనను కూల్చేసింది. ఈ జల ప్రళయంలో 72 మంది మరణించారు. దాదాపు 100మంది గాయపడ్డారు. హిమాలయ నదులకు మానవుడు కృత్రిమంగా అడ్డుకట్టలు వేసినందుకు ప్రతిఫలమిది! మానవ కార్యకలాపాలు విధ్వంసకరంగా మారాయని ప్రకృతి హెచ్చరించడం ఇదే మొదటిసారి కాదు. 2013లో చోరాబారీ హిమనదం కరిగిపోవడంతో మందాకినీ నది ఆకస్మిక వరదతో పోటెత్తింది. పైనుంచి వచ్చిపడిన టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, బురద నీటితో ప్రఖ్యాత శైవక్షేత్రం కేదార్‌నాథ్‌ మునిగిపోయింది. ఈ హిమాలయ సునామీలో దాదాపు అయిదు వేల మంది మరణించారు. అపార ఆస్తి నష్టం చోటుచేసుకొంది. అయినా మానవుడికి కనువిప్పు కలగడంలేదు. సిక్కిం నుంచి ఉత్తరాఖండ్‌ వరకు ఆనకట్టలు, రహదారుల నిర్మాణానికి డైనమైట్లు వాడుతున్నారు. ఆ పేలుళ్ల ధాటికి ఎగిరిపడుతున్న మట్టీ రాళ్లను బుల్‌డోజర్లతో కిందనున్న హిమాలయ నదుల్లోకి నెట్టేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను రెండు లైన్ల రహదారితో కలిపే చార్‌ధామ్‌ ప్రాజెక్టుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది దేశ ఉత్తర సరిహద్దులో చైనా ముప్పును ఎదుర్కోవడానికి తోడ్పడే వ్యూహాత్మక ప్రాజెక్టు కావడం గమనార్హం. పన్నెండు వేల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు కింద 900 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు. చైనా దురాక్రమణను అడ్డుకోవడానికి భారత సేనలు, ట్యాంకులు, వాహనాలను సరిహద్దుకు వేగంగా తరలించడానికి ఈ రహదారి ఉపకరిస్తుంది. చార్‌ధామ్‌ ప్రాజెక్టు కోసం కొండలు తవ్వడం, కొండ వాలుల్లో చెట్లను నరికివేయడం, పాత రోడ్లను వెడల్పు చేయడం ముమ్మరమైంది. వానలు, వరదలు వచ్చినప్పుడు నీటి ఉద్ధృతిని అడ్డుకొనేది చెట్లే. కానీ, అవి క్రమంగా నశించిపోతుండటంతో హిమాలయ రాష్ట్రాల్లో హిమనద క్షయం వల్ల వచ్చిపడుతున్న మెరుపు వరదలను అడ్డుకొనే దిక్కు లేకుండా పోతోంది. హిమనదాలు కరిగి రిషిగంగ, తపోవన్‌ ప్రాజెక్టులు దెబ్బతిన్నా జలవిద్యుత్కేంద్రాల నిర్మాణం ఆగడం లేదు. నేడు భారత్‌, చైనాలలో దాదాపు 300 ఆనకట్టలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు బ్రహ్మపుత్ర నది మీద చైనా ఒక మెగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీనివల్ల భారత్‌, బంగ్లాదేశ్‌లకు తీరని నష్టం జరుగుతుందన్న ఆందోళనను బీజింగ్‌ ఖాతరు చేయడం లేదు. ప్రాజెక్టులపై పట్టును సడలించడానికి చైనాయే కాదు, భారత్‌ సైతం సుముఖంగా లేదు.

కరిగి నీరవుతున్న హిమనదాలు

జాతీయ భద్రత, దేశాభివృద్ధి పేరిట సాగిపోతున్న రహదారులు, జల విద్యుత్కేంద్రాల నిర్మాణంతో ప్రస్తుతానికి ప్రయోజనాలు కనిపిస్తున్నా- పరిస్థితి ఎల్లవేళలా ఒకేలా ఉండదు. వాతావరణ మార్పులతో హిమనదాలు వేగంగా కరిగిపోతుండటంతో ఈ శతాబ్దం మధ్యనాళ్లకే తీవ్ర నష్టాలు ఎదురుకానున్నాయి. హిమనదాల నుంచి నదుల్లోకి ప్రవహించే నీరే వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు, విద్యుదుత్పాదన, పారిశ్రామికోత్పత్తి, రవాణా రంగాలకు జీవనాధారం. గంగ, బ్రహ్మపుత్ర, సింధు నదులకు హిమనదాల రూపంలో ఘనీభవించిన మంచు ప్రాణాధారం. 2000 సంవత్సరంలో భారత్‌, బంగ్లాదేశ్‌లలో గంగా-బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల జీడీపీ దాదాపు రూ.31 లక్షల కోట్లని అంచనా. 2050 నాటికి ఇది 12 రెట్లకు పైగా పెరగనున్నది. ప్రస్తుతం హిమాలయ జీవనదులు దాదాపు 13 కోట్ల మంది రైతులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ఎండాకాలంలో హిమనదాలు కరగడం వల్ల వచ్చే నీరు నిరాటంకంగా వ్యవసాయానికి అందుతోంది. రేపు హిమనదాలు అదృశ్యమైతే ఎంత నష్టం సంభవిస్తుందో ఊహించలేం! గడచిన రెండు దశాబ్దాల్లో సంభవించిన వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ హిమనదాలు ఏటా 267 గిగాటన్నుల నీటిని కోల్పోతున్నాయి. భూతాపం పెరుగుతున్నప్పుడు ఆరంభంలో హిమనదాలు ఎక్కువ నీటిని విడుదల చేస్తాయి. దానివల్ల నదుల్లో వరద ప్రవాహం పెరుగుతుంది. దాన్ని చూసి అంతా బాగుందనుకోవడం పొరపాటు. రేపు హిమనదాలు అదృశ్యమైతే నదులూ వట్టిపోతాయి. ఈలోగా హిమనదాల నుంచి వచ్చే నీటితో సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంతాలు మునిగిపోతాయి. భూతాపాన్ని ఎంత వేగంగా అరికడితే అంత వేగంగా భూమి, నదులు కోలుకొంటాయి. ఆ లోపు అభివృద్ధి పేరిట అడ్డూఆపూ లేకుండా పర్యావరణ ధ్వంసానికి పాల్పడకుండా సమతౌల్య ప్రగతి విధానాలను రూపొందించి అమలు చేయాలి.

చార్‌ధామ్‌ ప్రాజెక్టు కలకలం

ఎనిమిదేళ్ల క్రితం సంభవించిన ఉత్తరాఖండ్‌ వరదలను పురస్కరించుకొని కేంద్రం ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ఆ రాష్ట్రంలో తలపెట్టిన 23 జలవిద్యుత్‌ ప్రాజెక్టులను విరమించుకోవాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. దాన్ని భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదనడానికి చార్‌ధామ్‌ ప్రాజెక్టే ఉదాహరణ! హిమాలయ పర్యావరణాన్ని ఈ ప్రాజెక్టు దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల సంఘం హెచ్చరించినా- ఫలితం లేకుండా పోయింది. చార్‌ధామ్‌ ప్రాజెక్టు కోసం రోడ్డును పది మీటర్ల మేరకు విస్తరించడం హిమాలయ పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని స్థానికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలోనే న్యాయస్థానం రోడ్డు వెడల్పు అయిదున్నర మీటర్లకు మించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. అయితే, చైనా ముప్పును కాచుకోవాలంటే రోడ్డు వెడల్పు పది మీటర్లు ఉండటం అవసరమని, దేశ భద్రతకు అది కీలకమని ప్రభుత్వం వాదిస్తోంది.

Posted Date: 26-08-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం