• facebook
  • whatsapp
  • telegram

కొండలకూ వ్యర్థాల ముప్పు

ప్రపంచ పర్వతాల దినోత్సవం

ప్రకృతి శక్తికి, సమగ్రతకు, సౌందర్యానికి పర్వతాలు ప్రతిరూపాలు. భూఉపరితలంపై 27శాతాన్ని పర్వతాలు ఆక్రమించాయి. సుమారు 110 కోట్ల జనాభాకు పర్వతాలు, పర్వతపాద భూభాగాలు ఆవాస స్థానంగా ఉన్నాయి. వీరిలో 90 శాతానికి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం మానవాళిలో సగానికి పైగా పర్వత పర్యావరణ వ్యవస్థల నుంచి లభిస్తున్న నీటి వనరులపై ఆధారపడి బతుకుతున్నారు. అందుకే యునెస్కో వీటిని ప్రపంచ నీటి కోటలు(వాటర్‌ టవర్స్‌)గా అభివర్ణించింది. ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో అనేకం పర్వతాల నుంచి వచ్చే మంచినీటిపైనే ఆధారపడ్డాయి. జీవనదుల పుట్టుక పర్వతప్రాంతాల్లోనే చోటు చేసుకొంది. విశ్వవ్యాప్తంగా ఉన్న కీలకమైన జీవవైవిధ్య ప్రాంతాల్లో 30శాతం పర్వతాల్లోనే ఉన్నాయి. ఇక జల, సౌర, పవనశక్తి వంటి వనరులకు అవి కేంద్రస్థానాలు. పర్వత వ్యవసాయంలో ఆచరించే పద్ధతులు మైదాన ప్రాంతాల వ్యవసాయ పద్ధతుల కన్నా అతి తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తూ నేటికీ శతాబ్దాల నాటి సుస్థిరాభివృద్ధి నమునాలుగా ఉన్నాయి.

పెరిగిపోతున్న భూతాపం, మితిమీరిన వనరుల దోపిడి వంటి చర్యలతో పర్వతాలు నానాటికీ కునారిల్లుతున్నాయి. మైనింగ్‌, జల విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్యంసం, మితిమీరిన మానవ కార్యకలాపాలు, పర్యాటక కార్యక్రమాల జోరు పర్వత వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2002వ సంవత్సరాన్ని అంతర్జాతీయ పర్వతాల సంవత్సరంగా ప్రకటించింది. 2003 నుంచి ఏటా డిసెంబర్‌ 11న ప్రపంచ పర్వతాల దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపిచ్చింది. ఈ సందర్భంగా సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) పర్వత ప్రాంత సమస్యలపై అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తుంది. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పర్వత ప్రాంత ప్రజల పురోభివృద్ధికి తగిన గమ్యాలను నిర్దేశించుకుని, ప్రచారం చెయ్యడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ‘సుస్థిరాభివృధ్ధితో కూడిన పర్వత పర్యాటకం’ పేరుతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

పర్వత ప్రాంతాల్లో స్థిరమైన పర్యాటక అభివృద్ధి, అక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పన, జీవవైవిధ్య పరిరక్షణ, స్థానిక నాగరికతల సహజ సంప్రదాయాల పరిరక్షణ, స్థానిక ఉత్పత్తుల విలువను పెంపొందించడం వంటి అనేకానేక ఉద్దేశాలు సుస్థిరమైన పర్వత పర్యాటక లక్ష్యాలుగా ప్రపంచం ముందు ఉన్నాయి. పర్యాటక రంగం వృద్ధి చెందడంతో నానాటికీ పెరిగిపోతున్న వాహన కాలుష్యం, సహజ వనరుల విధ్వంసం, పేరుకుపోతున్న వ్యర్థాలు, పర్వతాల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఒకప్పుడు స్వచ్ఛతకు ప్రతిబింబాలుగా భాసిల్లిన పర్వతాలు నేడు కొన్ని వేల టన్నుల వ్యర్థాలతో నిండిపోతున్నట్లు అంతర్జాతీయ పర్వతారోహణ సమాఖ్య (యూఐఏఏ) అంచనా. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం ఎవరెస్ట్‌ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ప్రాణవాయువు సిలిండర్లు, కాగితాలు, ఆహార ప్యాకెట్లతో కూడిన వ్యర్థాలు, ప్రథమ చికిత్స పరికరాలు తదితరాలతో ఎవరెస్ట్‌ పర్వత పాద ప్రాంతమంతా పేరుకుపోయింది. కొవిడ్‌ సంక్షోభంతో ముఖ మాస్కులు, ఖాళీ శానిటైజర్‌ సీసాలువంటివి ఈ జాబితాలో వచ్చి చేరాయి. టాంజానియాలోని కిలిమంజారోదీ ఇదే దుస్థితి.  ఐరోపాలోని ఆల్ప్స్‌ పర్వతాల్లో కేబుల్‌ కార్లు, రైల్‌ రోడ్ల నిర్మాణాన్ని యూఐఏఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పర్యాటక అభివృద్ధి పేరుతో సహజ వనరుల విధ్వంసం తగదని వాదిస్తోంది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మన దేశంలో ఎక్కువగా పర్యాటక వ్యర్థాలు పేరుకుపోతున్న జాబితాలో హిమాలయాలు, పశ్చిమ కనుమలు వరస క్రమంలో ముందున్నాయి. పర్యాటకులు, పర్వతారోహకులు తమ వెంట తీసుకువెళ్ళే వస్తువులన్నింటినీ తిరిగి తీసుకువచ్చే (టేక్‌ ఇన్‌, టేక్‌ అవుట్‌) నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.

గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు ఆలవాలమైన హిమాలయాల్లో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందువల్ల ఆయా ప్రాంతాల్లో జీవావరణం దెబ్బతిని, ఉష్ణోగ్రతలు పెరిగి హిమానీనదాలకు సైతం ముప్పు వాటిల్లుతోందని నిపుణులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు స్పందించి పర్వత పర్యటనలో ప్లాస్టిక్‌, పాలిథిన్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలి. వ్యర్థాలను నిల్వ చేయడానికి సామాజిక కంటైనర్లను ఏర్పాటు చేయాలి. ప్రతీ పర్యాటకుడూ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘించినవారిపై భారీ జరిమానాలు విధించడం, వారి పర్యటనను నిషేధించడంవంటి చర్యలు తీసుకోవాలి. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే నేలతల్లికి గుండెకాయల్లాంటి పర్వతాలను కాపాడుకోగలమని ప్రభుత్వాలు గుర్తించాలి.

- జి.శ్రీనివాసు
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చాబహార్‌ ప్రాజెక్టుపై నీలినీడలు

‣ సైబర్‌ భద్రతకు తూట్లు

‣ సౌరశక్తిని ఒడిసిపట్టే వ్యూహం

Posted Date: 11-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం