• facebook
  • whatsapp
  • telegram

మానవాళికే సవాళ్లు

సమున్నత పర్వత శిఖరాల నుంచి మహాసముద్రాల అగాథాల దాకా వాతావరణ మార్పుల ప్రభావం ఉంటోంది. నిరుడు ఈ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో కనిపించింది. ప్రతి ఖండంలోనూ విపరీతమైన కరవులు, వరదలు, వడగాలులు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఫలితంగా పెద్దయెత్తున నష్టం సంభవించింది.

వాతావరణ మార్పుల ప్రభావంతో అంటార్కిటిక్‌ మహాసముద్రంలోని మంచు, రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. ఐరోపాలో కొన్ని హిమానీనదాలు పూర్తిగా కరిగి, కనుమరుగయ్యాయి. 2022లో సంభవించిన వాతావరణ మార్పుల గురించి ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) దిగ్భ్రాంతికర వాస్తవాలను తన వార్షిక నివేదికలో బయటపెట్టింది. హరితగృహ వాయువుల కారణంగా ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పెరిగిపోవడంతో భూమి, సముద్రాలు, వాతావరణం వంటి వాటన్నింటిలో పెనుమార్పులు సంభవించాయి. గత మూడేళ్లుగా లా నినా వల్ల కాస్త చల్లబడిందనే అనుకున్నా, 2015 నుంచి 2022 వరకు భూతాపం గణనీయంగా పెరిగింది. హిమానీనదాలు కరిగి సముద్రమట్టాలు పెరిగే పరిణామం 2022లో రికార్డు స్థాయిలో ఉందని, ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హరితగృహ వాయు ఉద్గారాలు నిరంతరం పెరుగుతూనే ఉండటంతో వాతావరణం మారుతూనే ఉంది. ఫలితంగా తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు 2022లో తూర్పు ఆఫ్రికాలో వరసగా కరవు, పాకిస్థాన్‌లో రికార్డు స్థాయి వర్షపాతం, చైనా ఐరోపాలలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడగాలులు రావడంతో కోట్ల మంది ఆహార భద్రత కరవై అల్లాడారు. భారీ స్థాయిలో వలసలు సంభవించాయి.

ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1850-1900 నాటి సగటుకంటే 2022లో 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 1850 తరవాత అత్యంత వేడిగా ఉన్న సంవత్సరాల్లో 2022 అయిదో స్థానంలో నిలిచింది. కార్బన్‌ డయాక్సైడ్‌, మీథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటి మూడు ప్రధాన హరితగృహ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇవే ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో హిమానీ నదాలు కరగడం అధికమైంది. ప్రపంచవ్యాప్తంగా 1993 నుంచి 2019 మధ్య ఆరు వేల గిగాటన్నుల మంచు హిమానీనదాల్లో కరిగిందని ‘వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ)’ గతంలో వెల్లడించింది. హిమానీ నదాలు కరగడం, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ సగటు సముద్ర మట్టం 2022లో గణనీయంగా పెరిగింది. 1993 నుంచి 2002 వరకు ఏడాదికి 2.27 మిల్లీమీటర్ల స్థాయిలోనే పెరగగా, 2013 నుంచి 2022 వరకు ఇది ఏడాదికి 4.62 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇలా ప్రతి పదేళ్లకు రెట్టింపు స్థాయిలో సముద్రమట్టాలు పెరగడం తీరప్రాంతవాసుల మనుగడకు తీరని ముప్పుగా పరిణమిస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2005 నుంచి 2019 వరకు సముద్రమట్టాల పెరుగుదలకు- అంటార్కిటికా, గ్రీన్‌లాండ్‌ ప్రాంతాల్లో కరిగిన హిమానీనదాలు 36శాతం కారణమైతే, సముద్రాలు వేడెక్కడం 55శాతం కారణమైంది. తొమ్మిది శాతం మేర ఇతర కారణాలు తోడయ్యాయి. అంతేకాదు, సముద్ర జలాల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ కలవడం ఆమ్లీకరణకు దారితీస్తుంది. ఫలితంగా సముద్ర జీవులు, అక్కడి పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ విషయాన్ని ఐపీసీసీ ఆరో అంచనా నివేదికలోనూ ప్రస్తావించారు.

వాతావరణ మార్పుల ప్రభావం అన్నిరకాల జీవజాలాల మీద ఉన్నట్లే చెట్లపైనా కనిపిస్తోంది. జపాన్‌లో చెట్లకు పూత వచ్చే సమయాన్ని క్రీ.శ.801 నుంచి లెక్కిస్తున్నట్లు అక్కడ చారిత్రక ఆధారాలున్నాయి. వాతావరణ మార్పులు, పట్టణీకరణ కారణంగా ఈ పూత సమయం క్రమంగా ముందుకు జరుగుతోంది. 2021లో మార్చి 26న పూత మొదలైంది. ఇది 1200 సంవత్సరాలలో రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటికీ దాదాపు వంద దేశాలకు వాతావరణ హెచ్చరికల విషయంలో సమర్థంగా సేవలు అందించే పరిస్థితులు లేవు. అలాంటి దేశాలకు ఉపయుక్తంగా ఉండేలా ‘యూఎన్‌ ఎర్లీ వార్నింగ్స్‌ ఫర్‌ ఆల్‌ ఇనీషియేటివ్‌’ సంస్థను 2022 నవంబరులో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ప్రతి మనిషికీ ముందస్తు హెచ్చరికల ద్వారా ఎంతోకొంత మేలు చేకూర్చాలనేది ఈ సంస్థ లక్ష్యం. దీనివల్ల భవిష్యత్తులో ఆయా దేశాలకు వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు అందడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు కారణమవుతున్న అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరముంది.

- కామేశ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రక్షణ ప్రాజెక్టుల నత్తనడక!

‣ కొత్త ఖండం అవతరించనుందా?

‣ వృద్ధిపథంలో భారతావని

‣ బొగ్గు దిగుమతితో విద్యుత్‌ ఖరీదు

‣ తైవాన్‌పై చైనా దూకుడు

Posted Date: 01-05-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం