• facebook
  • whatsapp
  • telegram

తైవాన్‌పై చైనా దూకుడు

తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ ఇటీవల అమెరికాను సందర్శించి కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువసభ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీతో సమావేశమయ్యారు. దాంతో చైనా కన్నెర్రచేసింది. వరసగా మూడు రోజులపాటు యుద్ధ విమానాలు, నౌకలతో  పోరాట అభ్యాసాలు నిర్వహించింది. ఉక్రెయిన్‌ తరవాత జరగబోయేది తైవాన్‌ యుద్ధమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా, చైనా అంతదాకా వెళుతుందా అన్నది కీలక ప్రశ్న!

అమెరికా నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులెవరైనా తైవాన్‌కు వచ్చినా, తైవాన్‌ నేతలు అగ్రరాజ్యానికి వెళ్ళినా డ్రాగన్‌ తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. తైవాన్‌ గగన, సముద్ర తలాలను పదేపదే అతిక్రమించడం ద్వారా తైవాన్‌ సార్వభౌమత్వానికి సవాలు విసరుతోంది. తైవాన్‌ ద్వీప సముదాయంలో అంతర్భాగమైన మట్సు దీవులకు తైవాన్‌తో సమాచార సౌకర్యాన్ని ఏర్పరచే రెండు సముద్ర గర్భ కేబుళ్లను గత ఫిబ్రవరిలో చైనా నౌకాదళం ధ్వంసం చేసింది. మట్సు దీవులు చైనా ప్రధాన భూభాగానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చైనా కవ్వింపులను ఎదుర్కోవడానికి తన దగ్గరున్న పరిమిత వైమానిక, నౌకా దళాలతో తైవాన్‌ సైతం విన్యాసాలకు దిగక తప్పడం లేదు. దానివల్ల తైవాన్‌ కొత్త యుద్ధ విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, ఆయుధాల కొనుగోలుకు భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది.

ఏడు దశాబ్దాల కిందటి చైనా అంతర్యుద్ధంలో కమ్యూనిస్టు పార్టీ గెలిచి ప్రధాన భూభాగంలో ప్రజా చైనా రిపబ్లిక్‌ (పీఆర్‌సీ) ఏర్పడింది. కమ్యూనిస్టు ప్రత్యర్థులు తైవాన్‌ దీవిలో రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా (ఆర్వోసీ) సర్కారును నెలకొల్పారు. తైవాన్‌ తమ దేశంలో అంతర్భాగమేనంటూ కమ్యూనిస్టు పాలకులు ‘ఒకే చైనా’ విధానాన్ని ప్రకటించారు. 1970ల నుంచి అమెరికా సైతం ఒకే చైనా విధానానికి సమ్మతి తెలిపినా తైవాన్‌ను చైనా బలప్రయోగంతో విలీనం చేసుకోకూడదని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత చైనా అధినేత జిన్‌పింగ్‌ తైవాన్‌ను ఎలాగైనా విలీనం చేసుకుంటామని పలుమార్లు ప్రకటించారు. బీజింగ్‌ యత్నాలను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేస్తున్నారు.

తైవాన్‌ విషయంలో చైనా, అమెరికాలు ఘర్షణకు దిగితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందన్న భయాలు చెలరేగుతున్నాయి. తైవాన్‌తో యుద్ధం జరిగే పక్షంలో- అమెరికా పక్షం వహిస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్‌ మార్లెస్‌ ఇటీవలే విస్పష్టం చేశారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా అయిదు అణు జలాంతర్గాములను కొనుగోలు చేసింది. రేపు తైవాన్‌తో యుద్ధం వస్తే తమతో చేతులు కలిపి పోరాడాలనే షరతుపై అమెరికా వాటిని సరఫరా చేసిందనే విమర్శలను మార్లెస్‌ తిప్పికొట్టారు. ఈ జలాంతర్గాముల వల్లనే అమెరికా, ఆస్ట్రేలియాలతో ఫ్రాన్స్‌ సంబంధాలు చెడుతున్నాయి. మొదట్లో జలాంతర్గాముల కోసం ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని జో బైడెన్‌ చెడగొట్టారని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ రుసరుసలాడుతున్నారు. తైవాన్‌పై అమెరికా, చైనా స్పర్థలో ఐరోపా దేశాలు ఎవరి పక్షమూ వహించాల్సిన పనిలేదని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల చైనాకు వెళ్ళి జిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంలో మెక్రాన్‌ తామెవరికీ సామంతులం కాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన యత్నాలను నేతలిద్దరూ సమర్థించారు. సొంతంగా అణ్వస్త్ర బలమున్న ఫ్రాన్స్‌, ఆర్థిక శక్తి అయిన జర్మనీలు చైనా, తైవాన్‌ల విషయంలో సొంత పంథాకు మొగ్గుచూపుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతుండగానే జర్మనీ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ గత నవంబరులో చైనా వెళ్ళి ఆర్థిక సంబంధాలను పరిపుష్టం చేసుకురావడం అమెరికాకు నచ్చలేదు. ఫ్రాన్స్‌, జర్మనీలు రాజకీయాలకన్నా ఆర్థికానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చైనా తన విస్తరణ విధానాలను కొనసాగిస్తూ ఉంటే ఫ్రాన్స్‌, జర్మనీలు మళ్ళీ అమెరికా నాయకత్వాన్ని సమర్థించాల్సి రావచ్చు. తాజాగా జపాన్‌లో జరిగిన జీ7 దేశాల సదస్సు ఉక్రెయిన్‌, తైవాన్‌ సంక్షోభాలపై ఉమ్మడి వైఖరిని ప్రకటించింది. జీ7లో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, కెనడా, ఇటలీ, ఈయూలు సభ్యులు. కాబట్టి తైవాన్‌పై దాడి చేసేముందు చైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో యుద్ధ విన్యాసాలను చైనా ముమ్మరం చేసినా ఇప్పటికిప్పుడు తైవాన్‌పై పోరుకు దిగకపోవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జరిగే తైవాన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే బీజింగ్‌ కవ్వింపు చర్యలకు దిగుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కదలని పట్టణ ప్రగతిరథం

‣ కృత్రిమ మేధ ఎంత లాభం.. ఎంత నష్టం?

‣ వాణిజ్య ఒప్పందంలో చిక్కుముళ్లు

‣ పుడమి తల్లికి గర్భశోకం

Posted Date: 24-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం