• facebook
  • whatsapp
  • telegram

పుడమి తల్లికి గర్భశోకం

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం. మనం పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల... మానవాళి ఆహార భద్రత, జీవనోపాధులు వంటి ఎన్నో అంశాలు భూమాత ఆరోగ్యంతో ముడివడి ఉన్నాయి. అయితే, సహజ వనరుల వినియోగం మితిమీరి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ప్రకృతిపై కనికరం లేకుండా మనం సాగిస్తున్న విధ్వంసాన్ని ఇకనైనా ఆపాలని తాజాగా ఐరాస హితబోధ చేసింది. ప్రకృతి వ్యవస్థలతో మానవీయంగా మసలుకోవాలని సూచించింది.

ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఏటా కోటి హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో అడవులు కనుమరుగవుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన వ్యర్థ జలాలను సైతం సముద్రాలు, నదుల్లోకి విడిచిపెడుతున్నాం. గత శతాబ్ది కాలంలో సగందాకా చిత్తడినేలలు, పగడపు దిబ్బలు అంతర్థాన మయ్యాయి. ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడంతో వాయుకాలుష్యం పెరిగిపోయింది. వాతావరణ మార్పుల ప్రభావంతో భూతాపం ఎక్కువై అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపాన్లు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇటీవలి కొన్ని దశాబ్దాల కాలంలో భూతాపంలో వృద్ధి- పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భూతాపం మరింతగా పెచ్చరిల్లితే ప్రకృతి వైపరీత్యాల దుష్ప్రభావాలు ప్రమాదకరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మానవాళి స్వయంకృతాపరాధమే ఈ దుస్థితికి కారణమని తెలిసినా ప్రపంచ దేశాలు తాత్సార వైఖరిని అవలంబిస్తుండటం ఆందోళనకరం.

తరిగిపోతున్న అడవులు

భూతాపాన్ని నిలువరించి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడే లక్ష్యంతో ప్రపంచ దేశాలు ఏళ్ల తరబడి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలు పర్యావరణ చట్టాలకు పదును పెడుతూ సహజ వనరుల వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో విధానాలు రూపొందిస్తున్నాయి. వాటి కార్యాచరణ మాత్రం చురుకందుకోవడం లేదు. భూతాపాన్ని నియంత్రించేందుకు 2015లో పారిస్‌ వేదికగా ప్రపంచ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం అమలులో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం పర్యావరణహితకరమైన విధానాలు అమలు చేస్తామని దేశాలు ప్రతినపూనాయి. అందుకుగాను ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అవసరాల కోసం నిరుపేద, వర్ధమాన దేశాలకు నిధులు ఇస్తామని సంపన్న దేశాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నాయి. నార్వే, జర్మనీ, స్వీడన్‌ వంటి దేశాలు స్వల్పంగా నిధులు విడుదల చేసినా అగ్ర దేశాలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. భూతాపాన్ని నియంత్రించడంలో అడవులు కీలకపాత్ర పోషిస్తాయి. వనాలు జీవవైవిధ్య పరిరక్షణకు, జీవనోపాధుల కల్పన, ఆహార భద్రతకు విశేషంగా తోడ్పడతాయి. అయితే, అడవుల విస్తీర్ణం పెరగడం సంగతి అటుంచి, ప్రస్తుతమున్న దట్టమైన అడవుల విధ్వసం విచ్చలవిడిగా సాగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయ భూములు, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు, ఖనిజ తవ్వకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం అడవులపై పడుతోంది. మూడు దశాబ్దాల కాలంలో సుమారు 42 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని అడవులు అంతరించాయన్న అంచనా దిగ్భ్రాంతపరుస్తోంది.

లక్ష్యాలకు తూట్లు

పర్యావరణ పరిరక్షణలో భారత్‌ అనుసరిస్తున్న అనేక లోపభూయిష్ఠ విధానాల మూలంగా భూగోళ పరిరక్షణ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. భూతాపం నియంత్రణకుగాను భారత్‌ వివిధ విధానపరమైన చర్చల్లో అమెరికా వంటి అగ్ర దేశాలతో తలపడుతోంది. అయితే, వివిధ పర్యావరణ విధానాలు, చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడంలో ఇండియా విఫలమవుతోందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి వ్యవస్థలకు నష్టం వాటిల్లకుండా, పర్యావరణ న్యాయం అమలు చేసే లక్ష్యంతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ చట్టం-2010 తీసుకొచ్చారు. ఈ చట్టం అమలు మొదలై 13 ఏళ్లు గడుస్తున్నా అన్ని రాష్ట్రాల్లో హరిత న్యాయస్థానాలు అందుబాటులోకి రాలేదు. తీర ప్రాంత పరిరక్షణకు ఉద్దేశించిన సి.ఆర్‌.జెడ్‌. నిబంధనలు-2019 అమలులో రాష్ట్రాలు ప్రదర్శిస్తున్న అలసత్వం, తీరప్రాంతాల్లోని మడ అడవులు వంటి సున్నిత వ్యవస్థల విధ్వంసం వంటి అంశాలపై ఇటీవల కాగ్‌ వివిధ రాష్ట్రాలను తీవ్రంగా ఆక్షేపించింది. మన దేశంలో గడచిన ముప్ఫై ఏళ్ల కాలంలో లక్షల ఎకరాలకుపైగా అడవులను అటవీయేతర కార్యక్రమాలకు బదలాయించినట్లు అంచనా. వీటికి ప్రత్యామ్నాయంగా అడవుల పెంపకంలో అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్ఠంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. నష్టపరిహారంగా వచ్చే నిధులతో వనాల పెంపు కోసం 2016లోనే ప్రత్యామ్నాయ అటవీకరణ నిధి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. రాష్ట్రాల స్థాయుల్లో వాతావరణ మార్పులు, పర్యావరణం, తీరప్రాంతం, చిత్తడి, మడ అడవుల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యావరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పర్యావరణ హితకరమైన పద్ధతులతో కూడిన జీవనశైలిని అందరూ పాటించాలి. నీరు, విద్యుత్‌, ఇంధనం వంటి విలువైన వనరుల వినియోగంలో పొదుపును అలవరచుకోవాలి. తద్వారా పుడమి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వాలు సహజ వనరుల వినియోగం, కేటాయింపుల్లో అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అప్పుడే మానవాళిని కాపాడుతున్న ధరిత్రికి భద్రత, మన భవిష్యత్తు తరాల మనుగడకు భరోసా అందివ్వగలం.

ప్లాస్టిక్‌తో ముప్పు

ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పుల మూలంగా ప్లాస్టిక్‌ వాడకం అనూహ్యంగా పెరిగింది. మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది.  తీరప్రాంతాల్ని కలిగి ఉన్న దేశాల నుంచి ఏటా లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు మహాసముద్రాల్లో పోగుపడుతున్నాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో చేరే వ్యర్థాల్లో దాదాపు 90 శాతం ప్లాస్టిక్‌ ఉంటోంది. భారత్‌లోని ప్రధాన నదులు సైతం ప్లాస్టిక్‌ వ్యర్థాలను సముద్ర పర్యావరణంలోకి తీసుకెళ్ళే మార్గాలుగా మారడం ఆందోళనకరం. ప్రస్తుత ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగం, పునర్‌ వినియోగ విధానాల్లో మార్పు రాకపోతే 2040 నాటికి కోట్లాది టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుపోయే ముప్పుంది. దీనివల్ల సాగర జీవుల మనుగడ ఇక్కట్లలో పడుతుంది. తీర ప్రాంత ప్రజల ఆరోగ్యమూ దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోకో దీవుల్లో డ్రాగన్‌ పాగా

‣ సత్వరన్యాయం కోసం కృత్రిమమేధ

‣ భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

Posted Date: 22-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం