• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ - ఇజ్రాయెల్‌ చెట్టపట్టాల్‌

భారత్‌ - ఇజ్రాయెల్‌ దౌత్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఇజ్రాయెల్‌ పార్లమెంటు కెనెసెట్‌ స్పీకర్‌ అమిర్‌ ఒహానా ఇటీవల భారత్‌లో పర్యటించారు. అమెరికాతో చైనా శత్రుత్వం.. పశ్చిమాసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో డ్రాగన్‌ ఆధిపత్య ధోరణులు పెచ్చరిల్లుతున్న తరుణంలో ఒహానా పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.

భారత్‌ 1920 దశకం తొలినాళ్ల వరకు ఇజ్రాయెల్‌ను అరబ్‌, ఇస్లామిక్‌ ప్రాంతంలో భాగంగానే పరిగణించింది. దాంతో ఉభయ దేశాల నడుమ దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి. 1950, సెప్టెంబరు 17న ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా అధికారికంగా గుర్తించిన భారత్‌- ముంబయిలో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు 1953లో అనుమతి ఇచ్చింది. 1992 నాటికి దిల్లీ, జెరూసలేమ్‌ల దౌత్య సంబంధాలు పూర్తిస్థాయికి చేరాయి. 2003లో నాటి ఇజ్రాయెల్‌ ప్రధాని ఏరియెల్‌ షరోన్‌ భారత్‌ను సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017లో ఇజ్రాయెల్‌లో పర్యటించి, ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. వారిద్దరి నేతృత్వంలో భారత్‌-ఇజ్రాయెల్‌ సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా వేళ్లూనుకొన్నాయి. అందుకే ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మోదీ పర్యటనను విశ్లేషకులు ఒక మైలురాయిగా చెబుతుంటారు.

స్నేహం బలపడి..

ఒకప్పుడు భారత్‌, ఇజ్రాయెల్‌లు సైద్ధాంతికంగా, రాజకీయపరంగా భిన్న ధ్రువాలుగా ఉండేవి. కాలక్రమంలో ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో వాటి మధ్య స్నేహం బలపడింది. నేడు వ్యూహపరంగా విడదీసి చూడలేని మిత్రదేశాలుగా అవి వెలుగొందుతున్నాయి. మోదీ తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరవాత ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచుకోవాలని భారత్‌ యోచించింది. అందుకే ఆ దేశం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తోంది. ఇజ్రాయెల్‌ 2014లో గాజాలో యుద్ధనేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై విచారణ చేపట్టే బాధ్యతను అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించాలంటూ 2015, 2016 సంవత్సరాల్లో ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. భారత్‌ ఎంతో ముందుచూపుతో వ్యవహరించి, ఆ తీర్మానాలపై చేపట్టిన ఓటింగ్‌కు దూరం పాటించింది. తద్వారా జెరూసలేమ్‌కు దిల్లీ మరింత చేరువైంది. ఇజ్రాయెల్‌తో ఉన్న విస్తృతస్థాయి సంబంధాలు భారత్‌కు ఎంతగానో లాభిస్తున్నాయి. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాల సేకరణ, పర్యాటకం వంటి అంశాల్లో దిల్లీకి ప్రయోజనం చేకూరుతోంది. 1962లో చైనాతో, 1965, 1971 సంవత్సరాల్లో పాకిస్థాన్‌తో పోరాడినప్పుడు భారత్‌కు ఇజ్రాయెల్‌ కీలకమైన ఆయుధ సంపత్తిని సమకూర్చింది. ఇజ్రాయెల్‌ తయారుచేసే అత్యాధునిక తుపాకులు, డ్రోన్లు, క్షిపణులను ఎక్కువగా కొంటున్నది ఇండియానే. ఆ దేశ మొత్తం రక్షణ ఎగుమతుల్లో   46శాతం భారత్‌కే చేరుతున్నాయి! ఈ కొనుగోలు-అమ్మకందారు సంబంధాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు స్పీకర్‌ అమిర్‌ ఒహానా పర్యటన బాటలు వేసింది. అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను ఉమ్మడిగా తయారు చేయాలని ఉభయదేశాలు నిర్ణయించాయి. ఇజ్రాయెల్‌ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణపరంగా అపారమైన అనుభవముంది. భారత్‌ వద్ద అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాలు మెండుగా ఉన్నాయి. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఈ సామర్థ్యాలన్నింటినీ జతచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఉభయ దేశాలు తలపోశాయి. ఆ దిశగా భారత్‌, ఇజ్రాయెల్‌ రక్షణ సంస్థలు సంయుక్తంగా ఇండియాలో ఆయుధాలను ఉత్పత్తి చేయనున్నాయి. భారత దళాలకు ఆయుధాలను సమకూర్చడంతో పాటు అంతర్జాతీయ విపణికి వాటిని సరఫరా చేయనున్నాయి. కృత్రిమ మేధ, బిగ్‌ డేటా, సెమీకండక్టర్లు, సైబర్‌ సెక్యూరిటీ, పునరుత్పాదక ఇంధన వనరులు, ఆరోగ్యం వంటి రంగాల్లోనూ ఉభయ దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరముంది.

కీలక పాత్ర పోషించే అవకాశం..

పశ్చిమాసియాలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా, యూఏఈలతో కలిసి భారత్‌, ఇజ్రాయెల్‌ నిరుడు ‘ఐ2యూ2’ చతుర్భుజ కూటమిని ఏర్పాటుచేశాయి. తుర్కియే, పాకిస్థాన్‌ సంబంధాలు బలపడుతున్న క్రమంలో ఈ కూటమి ప్రాధాన్యం సంతరించుకొంది. మధ్యధరా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సహకారం పెంపొందించుకోవడంతో పాటు ఇస్లామిక్‌ తీవ్రవాదంపై పోరాడేందుకు... క్షిపణి రక్షణ, డ్రోన్స్‌, సమాచార భద్రత వంటి కీలక అంశాల్లో కలిసికట్టుగా ముందుకు వెళ్ళేందుకు ఐ2యూ2 తోడ్పడుతుంది. ఈజిప్ట్‌, సౌదీ అరేబియాలు ఈ కూటమిలో చేరితే, అమెరికా దన్నుతో ఆసియాలో విస్తృతస్థాయి నూతన భద్రతా క్రమం ఏర్పడినట్లే భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అరబ్‌ దేశాలతో దృఢమైన సంబంధాలు ఉండటం, ఐ2యూ2లో భాగస్వామి కావడం వల్ల- ప్రాంతీయంగా శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అవకాశం భారత్‌కు ఉంది. పశ్చిమాసియాలోని ఇంధన వనరులపై ఇండియా ఆధారపడుతోంది. ఈ ప్రాంతంలోని పలు దేశాల్లో సుమారు 80లక్షల మంది భారతీయులు జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి, పశ్చిమాసియా వ్యవహారాలు భారత్‌కు ఎంతో కీలకం. ముఖ్యంగా ఇక్కడి ఆర్థిక, రాజకీయ, భద్రతాపరమైన అంశాల్లో తన మాటను నెగ్గించుకోవడానికి ఇజ్రాయెల్‌తో సంబంధాలు భారత్‌కు తోడ్పడతాయి. ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారుతున్న తరుణంలో- భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఇండియా, ఇజ్రాయెల్‌లకు ఎక్కువగా ఉంది. ఇందుకు అవి భావసారూప్య పొరుగు దేశాలతో కలిసి ముందడుగు వేయాలి.

అనేక రంగాల్లో సహకారం

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధానికి మొదట్లో భద్రత, రక్షణ పరమైన అంశాలే ప్రాతిపదికగా ఉండేవి. ఇప్పుడా బంధం ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ, సైబర్‌ సెక్యూరిటీ, పర్యాటకం, విద్య, శాస్త్ర సాంకేతిక తదితర ఎన్నో రంగాలకు విస్తరించింది. ఇందిరాగాంధీ హత్యానంతరం భారత్‌ తన విదేశీ నిఘా సంస్థ ‘పరిశోధన విశ్లేషణ విభాగం(రా)’ బృందాన్ని శిక్షణ నిమిత్తం ఇజ్రాయెల్‌కు పంపింది. అక్కడి నుంచి ఎలెక్ట్రానిక్‌ నిఘా పరికరాలను దిగుమతి చేసుకొంది. ‘లుక్‌ వెస్ట్‌’ వ్యూహంలో భాగంగా పశ్చిమ నావికాదళానికి చెందిన మూడు నౌకలు సహా పలు ఓడలను 2017లో ఇజ్రాయెల్‌లోని హైఫా రేవుకు పంపింది. ఆ మరుసటి ఏడాది నావికాదళ శిక్షణనౌక ఐఎన్‌ఎస్‌ తరంగి అక్కడకు వెళ్ళింది. ఆ క్రమంలోనే ఇజ్రాయెల్‌లో బ్లూఫ్లాగ్‌-2021 పేరుతో చేపట్టిన బహుముఖ వైమానికదళ విన్యాసాల్లో భారత్‌ పాలుపంచుకొంది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, నిఘా సహకారం, తీరప్రాంత రక్షణ వంటి అనేక అంశాల్లో ఉభయ దేశాలు సహకరించుకుంటున్నాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమగ్ర సన్నద్ధతకు అవకాశం

‣ డాలరుతో డిజిటల్‌ కరెన్సీ ఢీ?

‣ నిలువునా సంక్షోభంలో పాక్‌

‣ వాణిజ్య విధానం.. ఎగుమతులకు ఊతం

‣ భారత భాగ్య విధాత డాక్టర్‌ అంబేడ్కర్‌

Posted Date: 22-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం