• facebook
  • whatsapp
  • telegram

నిలువునా సంక్షోభంలో పాక్‌

నిరుడు ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ద్వారా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తరవాత ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పాక్‌ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారయింది.

సైనిక చర్య ద్వారా కాకుండా ప్రజాస్వామిక పద్ధతిలో ఒక ప్రధానిని పదవి నుంచి తొలగించి పాక్‌ పార్లమెంటు నిరుడు చరిత్ర సృష్టించింది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ, ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్‌లో అధికార మార్పిడి చోటుచేసుకుంది. షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆర్థిక స్థిరత్వాన్ని సాధిస్తామని హామీ ఇచ్చింది. కష్టాల నుంచి గట్టెక్కడానికి ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో పాక్‌ జరిపిన చర్చలు నేటికీ కొలిక్కి రాలేదు. ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు తీసుకున్న చర్యలు సైతం సరైన ఫలితాలను ఇవ్వలేదు. ఇరవై మూడేళ్ల తరవాత మాస్కోలో పర్యటించిన తొలి పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ అప్పట్లో చరిత్ర సృష్టించారు. తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేసే ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఆయన రష్యాను సందర్శించారు. అది నేటికీ ఆచరణ రూపం దాల్చలేదు.

ప్రధాని మోదీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ రష్యా నుంచి రాయితీపై ముడి చమురును కొనుగోలు చేయడాన్ని పలు సందర్భాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ బహిరంగంగా ప్రశంసించారు. పాక్‌ సైతం భారత్‌లాగా స్వతంత్ర విధానాన్ని అనుసరించాలని ఆయన పిలుపిచ్చారు. అయితే, అధికార మార్పిడి అనంతరం పోనుపోను పాక్‌ మరింతగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ సైతం తీవ్రంగా దెబ్బతింది. పీటీఐ గతంలో ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా (కేపీ), పంజాబ్‌ ప్రావిన్సుల్లో అధికారంలో ఉండేది. అక్కడి అసెంబ్లీలు రెండూ ఈ ఏడాది జనవరిలో రద్దయ్యాయి. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో ఉండే కేపీలో గిరిజన జనాభా అధికం. ఇమ్రాన్‌ ప్రభుత్వం కూలిపోయిన తరవాత అక్కడ చిన్న తీవ్రవాద ముఠాలకు మళ్ళీ పునరుజ్జీవం వచ్చింది. అవన్నీ ప్రధాన తీవ్రవాద ముఠా అయిన తెహ్రీకే తాలిబన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ)తో చేతులు కలిపాయి. ఇది అఫ్గాన్‌ తాలిబన్లతో కలిసి పనిచేస్తోంది.

ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, పంజాబ్‌ ప్రావిన్సులతో పాటు పాక్‌ సాధారణ ఎన్నికలను సైతం ముందస్తుగా నిర్వహించాలని పీటీఐ డిమాండు చేస్తోంది. షెహబాజ్‌ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తోంది. పంజాబ్‌, కేపీల్లో తొంభై రోజుల్లో ఎలెక్షన్లు జరపాలని గత నెలలో సుప్రీంకోర్టు పాక్‌ ఎన్నికల సంఘాన్ని (ఈసీపీ) ఆదేశించింది. తీవ్రవాద సమస్య అధికంగా ఉన్నందువల్ల కేపీలో ఎన్నికల నిర్వహణలో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఈసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేపీలో ఎన్నికలు నిర్వహించడం కన్నా తీవ్రవాదాన్ని నిర్మూలించడమే అత్యంత ప్రధానమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం తీవ్రవాద ముఠాలపై  భారీ దాడులు జరపాలని పాక్‌ సర్కారు తలపోస్తోంది.

నిజానికి అఫ్గాన్‌లో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కేపీలో సమస్యలు తలెత్తుతాయని పాకిస్థాన్‌ సైన్యం ముందుగానే ఊహించింది. అయితే, కేపీలో తీవ్రవాద ముఠాలపై సైనిక చర్యలను ఇమ్రాన్‌ ప్రభుత్వం నిలిపివేయించింది. వాటివల్ల ఆ ప్రాంతంలో తన ఓటుబ్యాంకును నష్టపోవాల్సి వస్తుందని ఇమ్రాన్‌ భావించారు. కేపీలో కొంతమంది తీవ్రవాద నేతలు క్షమాభిక్ష కోరడంతో వారి పట్ల ఇమ్రాన్‌ ఖాన్‌ అనుకూల వైఖరి కనబరచారు. జైలు నుంచి విడుదలైన తరవాత లేదా హింసకు ముగింపు పలికిన అనంతరం సాధారణ జనజీవితంలో భాగం కావడానికి వారికి అవకాశం దక్కింది. దానివల్ల గిరిజనుల్లో ఇమ్రాన్‌కు ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తీవ్రవాద ముఠాలు పీటీఐకి సహకరిస్తాయని, తద్వారా ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ప్రస్తుత ప్రభుత్వం, భద్రతా యంత్రాంగం భావిస్తున్నాయి. అందుకే కేపీలో తీవ్రవాద మూకలపై మొదట దాడులు జరిపి, ఆ తరవాత ఎన్నికలు నిర్వహించాలని షెహబాజ్‌ సర్కారు యోచిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు రాజకీయ ఎత్తుగడల్లో మునిగిపోయాయి.మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి కరకు దెబ్బలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు.

- బిలాల్‌ భట్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వాణిజ్య విధానం.. ఎగుమతులకు ఊతం

‣ భారత భాగ్య విధాత డాక్టర్‌ అంబేడ్కర్‌

‣ భూటాన్‌తో బంధం భద్రం

‣ న్యాయవాద వృత్తిలో విదేశీ వకీళ్లు

‣ కృత్రిమ మేధ కొత్తపుంతలు

‣ గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం