• facebook
  • whatsapp
  • telegram

భూటాన్‌తో బంధం భద్రం

ఇండియాకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన డోక్లాం పీఠభూమి విషయంలో భూటాన్‌ ప్రధానమంత్రి షెరింగ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దిల్లీని ఇబ్బందుల్లో పడేసేలా చైనా వైపు థింపూ మొగ్గుచూపుతోందన్న విశ్లేషణలు వెలువడటానికి కారణమయ్యాయి. ఈ తరుణంలో భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ భారత్‌లో పర్యటించడం సానుకూల పరిణామం!

దశాబ్దాలుగా ఇండియాకు భూటాన్‌ విశ్వసనీయ మిత్రదేశంగా ఉంటోంది. విదేశాలతో థింపూ చేసే వాణిజ్యంలో దాదాపు 82శాతం వాటా భారత్‌దే. ఆ దేశానికి అండగా నిలిచేందుకు 2022-23 బడ్జెట్‌లో ఇండియా రూ.2,266 కోట్లు కేటాయించింది. కొవిడ్‌ ఉద్ధృతి వేళ టీకాలను సరఫరా చేసింది. ప్రస్తుతం 4వేల మందికిపైగా భూటాన్‌ విద్యార్థులు ఉపకార వేతనాలపై ఇండియాలో చదువుకుంటున్నారు. థింపూ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఇండియా 1961 నుంచి తన సైనిక శిక్షణ బృందాన్ని భూటాన్‌లో ప్రత్యేకంగా ఉంచుతోంది.

పీఠభూమిపై పీటముడి

చైనా, భూటాన్‌లకు దీర్ఘకాలంగా సరిహద్దు తగాదాలున్నాయి. వాటి మధ్య వివాదం నడుస్తున్న ప్రాంతాల్లో డోక్లాం పీఠభూమి ఒకటి. అది ఇండియా, చైనా, భూటాన్‌ల త్రైపాక్షిక కూడలి వంటి ప్రాంతంలో ఉంది. డోక్లాం తమదంటే తమదని థింపూ, బీజింగ్‌లు అంటున్నాయి. ఈ వ్యవహారంలో భూటాన్‌కు దిల్లీ అండగా నిలుస్తోంది. త్రైపాక్షిక కూడలిని ప్రస్తుతమున్న బటంగ్‌ లా నుంచి మౌంట్‌ గిప్మోచి వరకు సుమారు ఏడు కిలోమీటర్ల మేర జరపాలని చైనా ప్రయత్నిస్తోంది. అదే జరిగితే- డోక్లాం చైనాలో అంతర్భాగం అవుతుంది. అది ఇండియాకు చాలా ఇబ్బందికరం. ఈశాన్య భారత్‌ను ఇండియా ప్రధాన భూభాగంతో అనుసంధానించే శిలిగుడి నడవాకు డోక్లాం చాలా దగ్గర. అందుకే దానిపై బీజింగ్‌ కన్నేసింది. 2017లో డోక్లాంలో రహదారి నిర్మాణానికి ప్రయత్నించగా, భారత బలగాలు చురుగ్గా స్పందించి భూటాన్‌ తరఫున చైనీయులను అడ్డుకున్నాయి. ఫలితంగా భారత్‌, చైనా సైనికుల మధ్య 73 రోజులపాటు ప్రతిష్టంభన నెలకొంది. ఆ ఏడాది ఆగస్టు చివర్లో డ్రాగన్‌ సైన్యం వెనక్కి మళ్ళడంతో నాటి సంక్షోభానికి తెరపడింది. తరవాత చైనా మళ్ళీ ఆ పీఠభూమిలో మౌలిక సదుపాయాల పనులను ప్రారంభించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ పరిస్థితుల్లో భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ ఇటీవల ఐరోపా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇండియాకు ఆందోళనకరంగా మారాయి. డోక్లాంలో చైనా ఆక్రమణలేవీ లేవని, ఆ వివాదంలో జోక్యం చేసుకునే హక్కు చైనాకు ఉందని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆ దేశంతో జరుపుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. దాంతో- భారత ఆందోళనలను పట్టించుకోకుండా డోక్లాంపై బీజింగ్‌తో థింపూ ఏదైనా ఒప్పందం చేసుకుంటుందేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి భూటాన్‌ను చైనా 1990ల నుంచీ ఓ ఆకర్షణీయ ప్యాకేజీతో ఊరిస్తోంది. అందులోని ప్రతిపాదనల ప్రకారం- ఉత్తర భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతాలపై థింపూ సార్వభౌమత్వాన్ని చైనా అంగీకరిస్తుంది. బదులుగా డోక్లాంతో కూడిన పశ్చిమ భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతాలు డ్రాగన్‌ నియంత్రణలోకి వెళ్తాయి. డోక్లాం తమకేమీ వ్యూహాత్మకంగా కీలకం కాదు కాబట్టి దాన్ని వదులుకునేందుకు భూటాన్‌ సిద్ధపడి ఉండవచ్చన్న విశ్లేషణలు వినిపించాయి. ఉత్తర భూటాన్‌లో సరిహద్దు తగాదాలను పరిష్కరించుకోవడం ద్వారా ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చన్నది షెరింగ్‌ యోచన కావచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

మరింత బలోపేతం

షెరింగ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియా-భూటాన్‌ల మధ్య దూరం పెరుగుతుందేమోనన్న ఆందోళనలు తలెత్తాయి. అలాంటి పరిస్థితి రానివ్వబోమని తన తాజా పర్యటనతో భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ చాటిచెప్పినట్లయింది! ఇండియాలో ప్రధాని మోదీతో సమావేశమైన ఆయన- ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఫలవంతమైన చర్చలు జరిపారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, అంకుర పరిశ్రమలు, విద్య, సీమాంతర అనుసంధానత తదితర అనేక రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు ఉభయ దేశాలు తాజాగా అంగీకరించాయి. భూటాన్‌ 13వ పంచవర్ష ప్రణాళికకు అండగా నిలుస్తామని ఇండియా హామీ ఇచ్చింది. జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని, ఉమ్మడి భద్రత కోసం కృషిచేయాలని 2007 నాటి ‘మైత్రి, సహకార ఒడంబడిక’లో దిల్లీ, థింపూ అంగీకరించాయి. కాబట్టి డోక్లాం విషయంలో ఇండియా ఆందోళనలను భూటాన్‌ విస్మరించడం ఏమాత్రం కుదరదు. భారత్‌తో దూరం పెంచుకుంటే- అది థింపూ ప్రగతికి శరాఘాతమే. మన దేశం నుంచి ఆర్థిక సాయం, ఎగుమతులు నిలిచిపోతే తట్టుకొని నిలబడే సామర్థ్యం భూటాన్‌కు లేదు!

- ఎం.నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ న్యాయవాద వృత్తిలో విదేశీ వకీళ్లు

‣ కృత్రిమ మేధ కొత్తపుంతలు

‣ గెలుపు కోసం సామాజిక ఎత్తుగడలు

‣ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ముందడుగు

‣ పులుల రక్షణలో ప్రాజెక్ట్‌ టైగర్‌

‣ రష్యాకు నాటో గుబులు

‣ మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం