• facebook
  • whatsapp
  • telegram

రష్యాకు నాటో గుబులు

ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో)లో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్‌ చేరడం ప్రకంపనలు సృష్టిస్తోంది. తరవాతి వంతు స్వీడన్‌దేనని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు దేశాలూ ఏడు దశాబ్దాల నుంచి అమెరికా, రష్యాలకు సమదూరం పాటిస్తూ సైనికపరంగా అలీన విధానాన్ని అనుసరిస్తూ వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో అవి తమ పంథా మార్చుకున్నాయి.

ఫిన్లాండ్‌, స్వీడన్‌లు కొంత కాలం నుంచి నాటోలో చేరడానికి సుముఖత ప్రదర్శిస్తున్నా- తుర్కియే మోకాలడ్డుతూ వచ్చింది. ఏదైనా దేశం నాటోలో చేరాలంటే అన్ని సభ్యదేశాల సమ్మతి తప్పనిసరి. పశ్చిమాసియాలో, ముఖ్యంగా సిరియా, ఇరాక్‌లలో తనపై పోరాడుతున్న కుర్దిస్థాన్‌ వర్కర్స్‌ పార్టీ (పీకేకే)కి ఫిన్లాండ్‌, స్వీడన్‌లు మద్దతు పలుకుతున్నాయన్నది తుర్కియే ఆరోపణ. అందుకే ఆ రెండు దేశాల చేరికకు అడ్డుపడుతూ వచ్చింది. తొమ్మిది నెలలపాటు సాగిన చర్చలు తుర్కియే, స్వీడన్‌, ఫిన్లాండ్‌ల మధ్య గత జూన్‌లో త్రైపాక్షిక అవగాహన ఒప్పందానికి దారితీశాయి. ఆ క్రమంలో గత నెలలో తుర్కియే పార్లమెంటు నాటోలో ఫిన్లాండ్‌ చేరడానికి ఆమోదం తెలిపింది. దాంతో ఈ నెల మొదటి వారంలో ఫిన్లాండ్‌ చేరిక జరిగిపోయింది. స్వీడన్‌లో మాత్రం పీకేకే కార్యకలాపాలు ఇప్పటికీ జోరుగా సాగుతున్నాయని తుర్కియే వాదిస్తోంది.

త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరినప్పటి నుంచి స్వీడన్‌ తన పంథా మార్చుకుంది. తమ గడ్డపై ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను నిషేధిస్తూ చట్టాలు చేసింది. స్వీడిష్‌ రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తున్నందువల్ల అక్కడ పీకేకేకి అనుకూలంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. పోస్టర్లు వెలుస్తున్నాయి. దాంతో స్వీడన్‌ నాటోలో చేరడానికి తుర్కియే అడ్డుపడుతోంది. అయితే అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిడి వల్ల క్రమంగా తుర్కియే తన వైఖరి మార్చుకోక తప్పడం లేదు. తొలుత ఫిన్లాండ్‌ చేరికకు సమ్మతించిన తుర్కియే- స్వీడన్‌ తగిన మార్పులుచేర్పులు చేసుకుంటే ఆ దేశమూ నాటోలో చేరడానికి అంగీకరిస్తానని సూచనలు ఇస్తోంది. మరోవైపు హంగరీలో న్యాయపాలన లేదని స్వీడన్‌ విమర్శించింది. అందువల్ల హంగరీ సైతం స్వీడన్‌ నాటో సభ్యత్వానికి మోకాలడ్డుతోంది. ఈ ఏడాది జులైలో జరిగే నాటో సభ్యదేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సులో తమ సభ్యత్వానికీ ఆమోద ముద్ర పడుతుందని స్వీడిష్‌ అధికార వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.

ఫిన్లాండ్‌ నాటోలో చేరడం ఆ దేశ రక్షణకే కాకుండా యావత్‌ నాటో దేశాల భద్రతకు దన్నుగా నిలుస్తుందని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ వ్యాఖ్యానించారు. ఫిన్లాండ్‌ చేరడానికి ముందు రష్యాకు అయిదు నాటో దేశాలతో 1,215 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉండేది. ఫిన్లాండ్‌ చేరిక అనంతరం ఆ సరిహద్దు రెట్టింపు అయింది. ఫిన్లాండ్‌కు నాటో సేనలను కానీ, ఆయుధాలను కానీ పంపితే ఆ దేశ సరిహద్దులో తన సేనల మోహరింపును పెంచుతానని క్రెమ్లిన్‌ హెచ్చరించింది. నాటో విస్తరణ వల్ల ఐరోపాకు భద్రత లభించదని రష్యా చెబుతోంది.  ఫిన్లాండ్‌ పెద్ద చారిత్రక తప్పిదం చేసిందని మాస్కో విమర్శించింది. నాటో తన పొరుగు దేశాలను చేర్చుకుంటూ రష్యా పొలిమేరల్లోకి చొచ్చుకొస్తోందని వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుంటారనే అనుమానంతోనే ఆ దేశంపై పుతిన్‌ దండెత్తారు. ఇప్పుడు ఆయన భయాలు నిజమవుతున్నాయని, రష్యా ఉత్తర సరిహద్దుల్లో ఫిన్లాండ్‌ తరవాత స్వీడన్‌ సైతం నాటోలో చేరబోతోందని స్టోల్టెన్‌బర్గ్‌ వ్యాఖ్యానించారు.

ఫిన్లాండ్‌ వద్ద మిగతా నాటో దేశాలకన్నా ఎక్కువ శతఘ్నులు ఉన్నాయి. ప్రపంచంలో మూడు అగ్రగామి 5జీ మౌలిక వసతుల సరఫరాదారుల్లో ఒకటైన నోకియా- ఫిన్లాండ్‌కు చెందిన కంపెనీయే. మిగతా రెండు అగ్రగాములు ఎరిక్సన్‌ (స్వీడన్‌), హువావై (చైనా). టెలికాం రంగంలో మేటి అయిన ఫిన్లాండ్‌కు బలీయ సైబర్‌ భద్రతా యంత్రాంగం ఉంది. ఫిన్లాండ్‌కు 30వేల మంది సైనికులతో పాటు రెండున్నర లక్షల మందితో రిజర్వు దళమూ ఉంది. ఫిన్లాండ్‌పై 1939లో రష్యా (నాటి సోవియట్‌) దండెత్తింది. ఆ చేదు స్మృతులు ఫిన్లాండ్‌ ప్రజల్లో ఇప్పటికీ గూడుకట్టుకుని ఉన్నందువల్ల తమ దేశం నాటోలో చేరాలని వారు చాలాకాలంగా ఆశిస్తున్నారు. నాటో సభ్యదేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా అది యావత్‌ కూటమి మీద యుద్ధ ప్రకటనగా పరిగణిస్తారు. ఈ క్రమంలో నాటో సభ్యత్వం వల్ల తమకు సరైన భద్రత లభిస్తుందని ఫిన్లాండ్‌ ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

‣ రైతుకు తోడ్పాటుతోనే లాభసాటి సాగు

‣ ఎన్నికల సమరాంగణంలో కన్నడసీమ

‣ మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం