• facebook
  • whatsapp
  • telegram

మహిళాభివృద్ధికి ఆటంకాలెన్నో..

ఇండియాలో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, గణితం (స్టెమ్‌) కోర్సులను అభ్యసిస్తున్న వారిలో 43శాతం అమ్మాయిలే. ఈ విషయాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రస్తావించారు. అది సంతోషకరమే అయినా, ‘స్టెమ్‌’ పట్టభద్రులైన అమ్మాయిల్లో ఎంతమంది ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్నారన్నది పరిశీలించాల్సిన అంశం.

మహిళల అభివృద్ధి నుంచి వారి నేతృత్వంలో ప్రగతి వైపు భారత్‌ పురోగమిస్తోందని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. భారతదేశ ప్రగతికి స్త్రీలు నాయకత్వం వహించాలంటే- స్టార్టప్‌ల నుంచి బడా కంపెనీల దాకా అన్ని చోట్లా వారు గణనీయమైన పాత్ర పోషించాలి. నేటి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో వ్యాపారవేత్తలుగా, సృజనశీలురుగా, వివిధ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ మహిళలు ఎంతవరకు రాణించగలుగుతున్నారు... అసలు వారికి అలాంటి అవకాశాలు ఏ మేరకు లభిస్తున్నాయి అన్నవి తరచి చూడాల్సిన అంశాలు. ప్రగతి రథసారథులుగా స్త్రీలను గుర్తించి ప్రోత్సహించే సానుకూల ధోరణుల్ని భారతీయ సమాజం పూర్తిగా అందిపుచ్చుకోలేదన్నది కాదనలేని సత్యం. దుర్విచక్షణతో కూడిన కట్టుబాట్లు మహిళల ఆశలకు కలలకు నేటికీ సంకెళ్లు వేస్తున్నాయి.

దక్కని ప్రాధాన్యం

నూతన సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా పలు మార్పులకు కారణమవుతున్నాయి. ‘స్టెమ్‌’ రంగాలపై దృష్టిపెట్టిన ఎన్నో దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఉన్నత విద్య స్థాయిలో స్టెమ్‌ కోర్సుల్లో అమ్మాయిల నమోదు అమెరికా, కెనడా, బ్రిటన్‌ తదితర దేశాల్లో నలభైశాతం లోపే ఉంది. వాటితో పోలిస్తే భారత్‌తో స్టెమ్‌ కోర్సులు చదువుతున్న అమ్మాయిలు 43శాతం. అయితే, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్నాలజిస్టుల వంటి కొలువులు చేస్తున్న వారిలో దేశీయంగా మహిళల వాటా దాదాపు 14శాతమే. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం (డీఎస్‌టీ) లెక్కల ప్రకారం 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,304 మంది క్రియాశీల మహిళా శాస్త్రవేత్తలు ఉండేవారు. 2018 నాటికి వారి సంఖ్య 56,747కి చేరింది. మొత్తం శాస్త్రవేత్తల్లో స్త్రీల భాగస్వామ్యం ఆ పద్దెనిమిదేళ్లలో 4.6శాతం మేరే (12శాతం నుంచి 16.6శాతానికి) పెరిగింది. స్టెమ్‌ కోర్సులను బోధించే ఉన్నతస్థాయి సంస్థల్లో ఆచార్యుల స్థాయిలో మహిళలు ఇరవైశాతం కంటే తక్కువే ఉన్నట్లు రెండేళ్ల క్రితం ఒక పరిశీలన వెల్లడించింది. మద్రాస్‌ ఐఐటీలో 10.2శాతం, బాంబే ఐఐటీలో 17.5శాతం మేర మహిళా ప్రొఫెసర్లు ఉన్నట్లు అప్పట్లో వెల్లడైంది. మిగిలిన వాటిలోనూ పరిస్థితి అలాగే ఉంది. సామాజిక దుర్విచక్షణ, పెళ్ళి తరవాత అనివార్యమయ్యే కుటుంబ బాధ్యతల కారణంగా పరిశోధన రంగంలో స్త్రీలు వెనకబడుతున్నారు. దానికితోడు ఉద్యోగ నియామకాల్లో చిన్నచూపు, విధి నిర్వహణలో పురుషుల కన్నా మిన్నగా రాణించినా స్త్రీలు అనే కారణంతో వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి ఇంకా కొనసాగుతున్నాయి.

మూడేళ్ల కిందటి ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 20 అతిపెద్ద దేశాల్లో మహిళా టెక్‌ సీఈఓల సంఖ్య పరంగా ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 4,490 మందితో అమెరికా ఆ జాబితాలో ముందుంది. రెండో స్థానంలో ఉన్న భారత్‌లో అప్పటికి మహిళా సీఈవోల సంఖ్య 1,501 మాత్రమే. దేశవ్యాప్తంగా మహిళా సీఈఓల సారథ్యంలో పనిచేస్తున్న టెక్‌ సంస్థలు కేవలం    5.01శాతమే. అహ్మదాబాద్‌ ఐఐఎం పరిశోధకులు నిరుడు వెల్లడించిన వివరాల ప్రకారం, భారతీయ కార్పొరేట్‌ రంగంలో అత్యున్నత నిర్వహణ పదవుల్లో మహిళల వాటా అయిదు శాతమే. ఒకే రకం కొలువులు చేస్తున్నా పురుషులతో పోలిస్తే మహిళల ఆదాయం 17శాతం మేర తక్కువగా ఉన్నట్లు ఆ పరిశోధన వెల్లడించింది. లింగపరమైన దుర్విచక్షణకు తావివ్వకుండా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తేనే మహిళలు నాయకత్వ స్థానాల్లోకి మరింత ఎక్కువగా రాగలుగుతారు. దానివల్ల ఆయా సంస్థలకే మేలు జరుగుతుంది. దేశంలో స్టార్టప్‌ల సంఖ్య కొంత కాలంగా బాగా పెరుగుతోంది. ఇటీవలి ‘నాస్కామ్‌’ నివేదిక ప్రకారం భారత్‌లో 18శాతం స్టార్టప్‌లను మహిళలు నడుపుతున్నారు.

పాఠశాల స్థాయి నుంచే..

ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ‘హర్‌స్టార్ట్‌’ పేరిట ఒక వేదికను గుజరాత్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. దాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిరుడు అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇలాంటి వేదికలు మరిన్ని అందుబాటులోకి రావాలి. సంస్థల వ్యవస్థాపకులుగా, వ్యాపారవేత్తలుగా స్త్రీలను తీర్చిదిద్దడానికి కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిలో లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, మహిళలకు మెరుగైన సహకారం అందించాలి. విజ్ఞానశాస్త్ర రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని 30శాతానికి పెంచాలని జాతీయ సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నొవేషన్‌ విధానం-2022 లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని చేరుకోవాలంటే పాఠశాల స్థాయి నుంచే అమ్మాయిలకు విజ్ఞానశాస్త్ర రంగంపై అవగాహన కల్పించాలి. పరిశోధనల వైపు నడిపించేందుకు మరిన్ని ఉపకారవేతనాలను అందించాలి. ఉద్యోగ, వ్యాపార అవకాశాల కల్పననూ విస్తృతం చేయాలి.  ముఖ్యంగా- మహిళాభద్రతకు తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

- పద్మ వడ్డె
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతుకు తోడ్పాటుతోనే లాభసాటి సాగు

‣ ఎన్నికల సమరాంగణంలో కన్నడసీమ

‣ మయన్మార్‌లో ఎన్నికల ప్రహసనం

‣ మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

Posted Date: 18-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం