• facebook
  • whatsapp
  • telegram

మితిమీరిన రుణం దేశానికే అరిష్టం

అవసరాల కోసం కుటుంబం, సంస్థ, దేశం ఇలా ఏదైనా, ఎవరైనా అప్పులు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. దేశాలైతే తమ సొంత ప్రజలు, సంస్థలతో పాటు విదేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తెచ్చుకుంటాయి. ఇలా సమీకరించుకునే నిధులను ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు సమర్థంగా వినియోగించినప్పుడే ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది.

అభివృద్ధి కోసం దేశాలు కేవలం సొంత ఆదాయంపైనే ఆధారపడకుండా, రుణాలను సైతం తెస్తాయి. వాటి ద్వారా ఉత్పత్తిని పెంచుతాయి. రుణంగా తీసుకున్న ధనాన్ని దేశ ఆర్థికాభివృద్ధి కోసం వెచ్చించినప్పుడు ప్రజల ఆదాయాలు పెరిగి, అనంతర కాలంలో అప్పులు తీర్చేసే స్థోమత దేశాలకు చేకూరుతుంది. తీసుకొచ్చిన రుణాలకు అసలు, వడ్డీ చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి రుణదాతలకు భరోసా ఉంటుంది. ఎప్పటికప్పుడు సక్రమంగా వడ్డీ చెల్లించడంతో పాటు పాత రుణాలు తీర్చేందుకు తక్కువ వడ్డీకి కొత్త అప్పులు చేయకుండా, అభివృద్ధి క్షీణించకుండా ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించే దేశాలకు సుస్థిర రేటింగ్‌ లభిస్తుంది.

సుదీర్ఘ ప్రభావం

నిజానికి రుణాలు తీసుకోకుండా అభివృద్ధి పథంలో పురోగమించే దేశాలు చాలా తక్కువగా ఉంటాయి. హాంకాంగ్‌ రుణ-జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి) నిష్పత్తి చాలా తక్కువ. అంటే రుణాలపై ఆధారపడాల్సిన అవసరం హాంకాంగ్‌కు లేదన్నమాట. అదే సమయంలో తమ జీడీపీలో ఏకంగా 20శాతాన్ని రుణదాతలకు చెల్లిస్తున్న దేశాలు 25 దాకా ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ సంస్థ (యూఎన్‌డీపీ) అధిపతి అహిం స్టెయినర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జీడీపీలో రుణభారం ఎంత అనేది రుణ-జీడీపీ నిష్పత్తి ద్వారా తెలుస్తుంది. చేసిన అప్పులను తీర్చేందుకు తగిన ఉత్పత్తి సాధించే స్థోమత ఆ దేశానికి ఉందా, లేదా అనేది ఈ నిష్పత్తి ద్వారా అవగతమవుతుంది. రుణాలను తీర్చడానికి ఎన్నేళ్లు పడుతుందన్నదీ ఈ నిష్పత్తిని బట్టి తెలుసుకోవచ్చు.

వర్ధమాన దేశాలు అప్పులు చేయడానికి అమెరికన్‌ డాలర్లలో బాండ్లను విదేశాలకు విక్రయిస్తాయి. క్రెడిట్‌ కార్డులు, ఆస్తుల తనఖా ద్వారా స్థోమతకు మించి అప్పులు చేసిన కుటుంబాలు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. దీన్నే రీఫైనాన్స్‌ అంటారు. తాహతుకు మించి అప్పులు చేసిన ప్రభుత్వాలూ రీఫైనాన్స్‌, రుణ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అక్కడికీ పరిస్థితి కుదుటపడకపోతే చేసిన అప్పులను సకాలంలో, ముందు అనుకున్న షరతుల ప్రకారం తీర్చలేని పరిస్థితి వస్తుంది. దీన్ని డిఫాల్ట్‌ అంటారు. వ్యక్తులు అప్పులు తీర్చలేకపోతే వారిపై కోర్టులో దావా వేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. ప్రభుత్వాలకు ఇలాంటి పరిస్థితి తలెత్తితే వాటిపై చర్యలు తీసుకోవడానికి అంతర్జాతీయ కోర్టులంటూ ఏవీ లేవు. అయితే, దీనివల్ల ప్రతిష్టంభన ఏర్పడి అనేక సంవత్సరాలపాటు దేశం ఆర్థికంగా కడగండ్లపాలవుతుంది.

భారత్‌ విషయానికి వస్తే మన విదేశీ రుణభారం ప్రమాదకర పరిస్థితిలో ఏమీ లేదు. భారతీయ కుటుంబాల రుణభారమూ అదుపులోనే ఉంది. అయితే, కుటుంబాలు విచక్షణారహితంగా రుణాలు చేస్తూ పోతే మున్ముందు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుంది. 1991 నాటి ఆర్థిక సంస్కరణలు మొదలు భారత విదేశీ రుణభారం పెరగకుండా స్థిరంగా కొనసాగుతోంది. 2014 మార్చి 31 నాటికి ఇండియా మొత్తం రుణభారం రూ.55.87 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ.155.8 లక్షల కోట్లకు ఎగబాకింది. 2006లో ఇండియా తన జీడీపీలో 17.1శాతానికి సమానమైన విదేశీ రుణాలు సేకరించింది. 2014లో అవి 23.9శాతానికి పెరిగి, 2022 నాటికి 19.9శాతానికి తగ్గాయి.

ఉత్పత్తి పెంపుతో అభివృద్ధి

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గణాంకాల ప్రకారం- భారతదేశ రుణ-జీడీపీ నిష్పత్తి 83శాతమే. జపాన్‌ విషయంలో అది ఏకంగా 257శాతం ఉంది. వెనుజువెలా 350శాతం, సూడాన్‌ 259శాతం, గ్రీస్‌ 206శాతం, లెబనాన్‌ 172శాతం, ఇటలీ 156శాతం, లిబియా 155శాతం రుణ-జీడీపీ నిష్పత్తి కలిగి ఉన్నాయి. ఈ నిష్పత్తి దీర్ఘకాలం 77శాతానికన్నా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది. భారత్‌ రుణ-జీడీపీ నిష్పత్తి 64శాతంకన్నా ఏటా అదనంగా ఒక పర్సంటేజీ పాయింటు చొప్పున పెరిగితే అభివృద్ధి 0.02 శాతం మేర కోసుకుపోతుంది. రుణ-జీడీపీ నిష్పత్తి తక్కువగా ఉండటం అభిలషణీయమే. అయితే, అది ఆర్థిక పటిష్ఠతకు కొలమానం కాదు. ఈ నిష్పత్తి తక్కువగా ఉన్న వర్ధమాన దేశాలు ఆర్థిక ప్రతిష్టంభనకు లోనవుతాయి. వాటి స్థూల దేశీయోత్పత్తిలో ఎదుగూబొదుగూ ఉండకపోవడంతో ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. వివిధ మార్గాల్లో తీసుకున్న రుణాలను ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు నిర్మాణాత్మకంగా వినియోగించినప్పుడే- ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి దిశగా పురోగమిస్తుంది.

అంతర్జాతీయంగా కష్టాలు

కొవిడ్‌ వల్ల 2020లో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిని ప్రపంచ దేశాలు ఎడాపెడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ మహమ్మారి మూలంగా ప్రభుత్వాల రుణభారం 14 పర్సంటేజ్‌ పాయింట్లు పెరిగింది. అంతలోనే ఉక్రెయిన్‌ యుద్ధం విరుచుకుపడటంతో ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇతర వ్యాపార సరకుల ధరలు విజృంభించాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ భారం పెరిగి దేశాలను కుంగదీశాయి. అత్యధిక వర్ధమాన దేశాలు చేసిన అప్పులను తీర్చలేని ప్రమాదం ముంచుకొస్తోంది. ఇది వ్యక్తిగత, అంతర్జాతీయ రుణదాతలకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, ఆయా దేశాల పౌరులకూ తీవ్ర కష్టనష్టాలు తెచ్చిపెడుతుంది. రుణాలను తీర్చలేని స్థితికి చేరిన దేశాలకు విదేశాల్లో ఉన్న ఆస్తులను తప్ప, ఇతర వాటిని రుణదాతలు జప్తు చేసుకోలేరు. 2020లో అప్పులు తీర్చలేని స్థితికి చేరిన లెబనాన్‌తో పరిష్కారం కోసం రుణదాతలు రెండేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి దేశాలు అంతర్జాతీయంగా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన తరవాత రష్యాపై జీ-7 దేశాలు ఆర్థిక ఆంక్షలను విధించడం వల్ల మాస్కోకు రుణాలు తీర్చలేని పరిస్థితి ఎదురైంది.
 

Posted Date: 07-04-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం